ఫర్టిలైజర్ షాపులను రెగ్యులర్గా తనిఖీ చేయాలి
విత్తనాల వివరాలను తెలుగులో ప్రదర్శించాలి
నగరంలోని పలు సీడ్స్ షాపుల తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఫర్టిలైజర్షాపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నాసిరకం విత్తనాలు, ఎరువులు, మందులతో రైతులు నష్టపోకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. విత్తన షాపుల నిర్వాహకులు విత్తనాలు, నిల్వ వివరాలు రైతులకు అర్థమయ్యేలా తెలుగులో డిస్ప్లే ఉంచాలని సూచించారు. గురువారం ఖమ్మంలోని గాంధీ చౌక్, బర్మా షెల్ రోడ్ లోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎంఆర్పీ రేటు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. పోలీసు, రెవెన్యూ అధికారులను సమన్వయము చేసుకుని అన్ని దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు అమ్మితే వారు ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు.
జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని, లూజ్ విత్తనాలు, సీల్ తీసిన విత్తనాలు కొనవద్దని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస రావు, ఖమ్మం అర్బన్ మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు ఉన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. కొనిజర్ల మండలం అమ్మపాలెం, బస్వాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలకు మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, పూర్తి కావాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
కంప్లీట్ అయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్ల ప్రారంభంలో పు పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, ఎంపీడీవో రోజారాణి, ఎంఈవో శ్యామ్సన్, స్కూళ్ల హెడ్మాస్టర్లు వై. కోటేశ్వరరావు, సీహెచ్. వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
యూనిఫామ్స్ కుట్టు క్వాలిటీగా ఉండాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మన్నికగా ఉండేలా యూనిఫామ్స్ కుట్టాలని కలెక్టర్ సూచించారు. గురువారం కొనిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. యూనిఫామ్స్ కుడుతున్న మహిళలతో మాట్లాడారు. ఎన్ని యూనిఫామ్స్ కుట్టడానికి ఇచ్చారు, రోజుకు ఎన్ని కుడుతున్నారు, ఇప్పటివరకు ఎన్ని కుట్టారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యూనిఫామ్స్ ను నాణ్యమైన దారంతో కుట్టాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన యూనిఫామ్ కుట్టే పనే కాక, ప్రయివేటుగా బట్టలు కుట్టే పనిని కొనసాగించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, ఎంఈవో శ్యామ్సన్, కొనిజర్ల ఎంపీడీవో రోజారాణి, ఏపీఎం సుశీల, అధికారులు పాల్గొన్నారు.