- ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం న్యూ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు విధుల సిబ్బందికి ఈనెల 29న మొదటి విడత, జూన్ 2 న రెండో విడత శిక్షణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద తహసీల్దార్లను బాధ్యులుగా పెట్టాలన్నారు. లెక్కింపు తర్వాత ఈవీఎం యంత్రాలను గోడౌన్ కు తరలింపునకు వాహనాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిమిత్తం 40 లోకేషన్లలో 115 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని కేంద్రాలలో సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నెల 21న మొదటి విడత, 26న రెండో విడత శిక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని చెప్పారు.
అడిషనల్ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి. మాలతి, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్ కుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్టీవో ఆఫ్రీన్ సిద్దిఖీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, డీపీవో హరికిషన్, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరుణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.