ఖమ్మం టౌన్, వెలుగు: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. జిల్లాస్థాయి నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరిగింది. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూలాలను గుర్తించాలని, అధికారులు సరఫరాను కలిసికట్టుగా అరికట్టాలని అన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఓ కంట కనిపెట్టాలన్నారు. విద్యాసంస్థల్లోనూ నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రధానంగా యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని పేర్కొన్నారు.
వారే రేపటి దేశ భవిష్యత్తుకు నిదర్శనమని, వారిని అభివృద్ధి దిశలో పయనించేలా చూడాలన్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకొని రావాలన్నారు. సమావేశంలో సీపీ విష్ణు వారియర్, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి, డీఈవో సోమశేఖర శర్మ, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.