అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం కట్టడికి చర్యలు : కలెక్టర్ వి.పి.గౌతమ్

  •     ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి వి.పి.గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో   జిల్లాలో డబ్బు, మద్యం కట్టడికి చర్యలు చేపట్టాలని  ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. వీఎంల మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు.  మంగళవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్ కాంతా మహంతి, కానా రామ్, సతేంద్ర సింగ్, రిటర్నింగ్ అధికారులతో కలిసి ప్రక్రియను నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1456 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మూడవ దశ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బంది కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

సమన్వయంతో పనిచేయాలి 

ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తిచేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్​ గౌతమ్​ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలీస్ కమిషనర్, వ్యయ పరిశీలకులతో కలిసి నోడల్ అధికారులు, ఏసీపీలు, సీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కు ముందు 72 గంటల ప్రోటోకాల్ ను అమలు చేయాలన్నారు. ఇంటింటి ప్రచారానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. డబ్బు, మద్యం పంపిణీ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, నిఘా బృందాలు అలర్ట్ గా విధులు నిర్వహించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెయిన్ ప్రూఫ్ టెంట్ లు ఏర్పాటుచేయాలన్నారు. 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలన్నారు. చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వ, పోలీస్, ప్రయివేటు, అంబులెన్స్ అన్ని రకాల వాహనాలు తనిఖీ చేయాలన్నారు.

సమీక్ష లో శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్,  అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అడిషనల్​ డీసీపీ ప్రసాద్ రావు, నోడల్ అధికారులు, పోలీస్ అధికారులు, సీఆర్ఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.