టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ 

ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని  కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, తాగునీరు, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

పరీక్షా పత్రాలు, జవాబు పత్రాల రవాణా పోలీస్ ఎస్కార్ట్ తో చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతించవద్దన్నారు. భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 97 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 16577 మంది రెగ్యులర్, 279 మంది విద్యార్థులు ప్రైవేట్​గా పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు

97 మంది శాఖాధికారులు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్, 97 సిట్టింగ్ స్క్వాడ్, 1983 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆయన వెంట నయాబజార్ కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ నర్సింహారావు, అధికారులు తదితరులు ఉన్నారు.