తెలంగాణలో పక్కాగా వెబ్​కాస్టింగ్​ : కలెక్టర్​ వీపీ గౌతమ్

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్​ వీపీ గౌతమ్ ​చెప్పారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందన్నారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్​ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్​ కాంప్లెక్స్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 12,16,796 మంది ఓటర్లున్నారన్నారు. ఇందులో 5,89,165 మంది పురుషులు, 6,27,553 మంది మహిళా ఓటర్లు, 78 మంది ఇతరులు ఉన్నారని చెప్పారు.

1456 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో 355, పాలేరులో 289, మధిరలో 268, వైరాలో 252, సత్తుపల్లిలో 292 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. పోలింగ్​ స్టేషన్ల ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2338 కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను రికార్డింగ్ చేస్తామన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వికలాంగుల కోసం ర్యాంప్​ లు, తాగునీరు, ఫర్నీచర్​, లైటింగ్, టాయిలెట్స్​ లాంటి సౌకర్యాలన్నీ కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం వరకు రూ.7.93 కోట్ల విలువైన క్యాష్​, ఇతర వస్తువులను, రూ.2.81 కోట్ల విలువైన లిక్కర్​ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1898 మంది,,

జిల్లాలో 2414 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, 1898 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారని కలెక్టర్​ చెప్పారు. జిల్లాలో 1456 పోలింగ్ స్టేషన్లకు గాను 3790 బ్యాలెట్​ యూనిట్లు, 2289 కంట్రోల్​ యూనిట్లు, 2242 వీవీ ప్యాట్ మిషన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్​ సెంటర్​ ను గుట్టల బజార్​ లోని సెయింట్ జోసెఫ్​ హైస్కూల్​లో, పాలేరుకు పొన్నెకల్​ లోని శ్రీచైతన్య ఇన్​ స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ రీసెర్చ్​ కాలేజీ, మధిరకు ఖాజీపురంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్​ కాలేజీ, వైరాకు ఎస్సీ గురుకుల పాఠశాలలో, సత్తుపల్లికి జ్యోతి నిలయం హైస్కూల్​ లో డిస్ట్రిబ్యూషన్​ , ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్​ లో ఉన్న శ్రీ చైతన్య ​ఇన్​ స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ రీసెర్చ్​ కాలేజీలో కౌంటింగ్ సెంటర్​ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్​ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

జాగ్రత్తలు తీసుకోవాలి.. 

బ్యాలెట్ యూనిట్లను అమర్చడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ఈవీఎం, వీవీపాట్, కంట్రోల్​ యూనిట్ల కమీషనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

ఓటర్లలకు ఇబ్బంది ఉండొద్దు : కలెక్టర్​ ప్రియాంక అల

ఇల్లెందు, వెలుగు: 30న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. సింగరేణి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన  స్ట్రాంగ్ రూమ్​లో ఉన్న ఈవీఎంలను శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ​వెంట నియోజకవర్గ ఎన్నికల అధికారి కాశయ్య, తహసీల్దార్లు కోట రవికుమార్, కృష్ణవేణి, ఇమేనియల్, సుధాకర్, స్వాతి బిందు, రెవెన్యూ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.