- మహిళా శక్తి కుట్టు కేంద్రం సందర్శన
ఖమ్మం టౌన్/ ఖమ్మం రూరల్, వెలుగు : గవర్నమెంగ్ స్కూల్స్ రీఓపెన్ నాటికి యూనిఫామ్స్ అందించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం, జలగంనగర్ లోని మహిళా శక్తి కుట్టు ఆయన కేంద్రాన్ని సందర్శించారు. యూనిఫామ్స్ తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2,48,837 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 1,15,990 మంది బాలురు, 1,32,857 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. 1,185 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి, యూనిఫామ్స్ తయారీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
విద్యార్థుల వారీగా కొలతలు తీసుకొని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు తయారీకి అప్పజెప్పామన్నారు. జలగంనగర్ మహిళా కుట్టు కేంద్రంలో 19 కుట్టు మిషన్లు ఉండగా, కటింగ్ మిషన్, కాజా మిషన్, బటన్ మిషన్లు సమకూర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు యూనిఫామ్స్ అందడంతో పాటు, స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధి దొరుకుతోందని చెప్పారు. సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ఆసరా ఇస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండలం ఎంపీడీవో ఎస్. కుమార్, ఏపీఎం ఎం. శ్రీనివాసరావు, సీసీ బి. మోహన్ రావు, కె. శారద ఉన్నారు.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మం న్యూ కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో బుధవారం లోక్ సభ కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఓట్ల లెక్కింపును ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు తెలిపారు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఒకటి, మొత్తం 8 హాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఒక్కో హాల్లో 14 టేబుళ్ల చొప్పున, ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 355 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున అక్కడ 18 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోటీ చేసిన అభ్యర్థులు 117 మంది ఏజెంట్ల ను నియమించవచ్చని చెప్పారు. ఆయా పార్టీల ఏజెంట్ల వివరాలు గురువారం సాయంత్రం లోపు ఇవ్వాలని సూచించారు. జూన్ 4 న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 5 గంటలకు ఈవీఎం స్ట్రాంగ్ రూంలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నట్లు చెప్పారు. పోటీ అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కౌంటింగ్ కేంద్రం లోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని
చెప్పారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు
ఈ నెల 27 న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదైనట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు నల్గొండ లోని స్ట్రాంగ్ రూమ్‌కు పంపనున్నట్లు, కౌంటింగ్ జూన్ 5 న నల్గొండలో జరగనున్నట్లు ఆయన వివరించారు. అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు పాల్గొన్నారు.
‘ధరణి’ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం టౌన్/కూసుమంచి, వెలుగు : కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను, మండలంలోని కల్లూరిగూడెంలో ఉన్న పీఏసీఎస్ సెంటర్ లోని ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలానికి సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ స్లాట్ల గురించి తహసీల్దార్ సురేశ్‌కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
కూసుమంచి మండలంలో టీఎం33, మ్యూటేషన్ తదితర అన్ని రకాల దరఖాస్తులను కలుపుకొని ధరణి లో 380 దరఖాస్తులు, 15 రిజిస్ట్రేషన్ స్లాట్లు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ అప్లికేషన్ ను నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. దాదాపు అందరు సన్నాలే పండించినట్లు, సన్నాలకు మంచి ధర వచ్చినట్లు రైతులు కలెక్టర్ కు తెలిపారు. లైసెన్స్ ట్రేడర్లు, మిల్లర్లు క్వింటాలుకు రూ. 2600 నుంచి 2400 ఇచ్చి కొనుగోలు చేశారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, అధికారులు ఉన్నారు.