ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో భూ రక్షణా బృందాలతో ఆయన సమీక్షించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి భూ రక్షణ బృందాలకు అందజేసినట్లు తెలిపారు. వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో క్రమబద్ధీకరణ జీవో 59లో చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయిన చోట వెంటనే స్థలాలు స్వాధీనం చేసుకోవాలన్నారు.
వైఎస్సార్ కాలనీలో ఎక్స్ సర్వీస్ మెన్లకు కేటాయించిన అసైన్డ్ భూమిపై సర్వే చేసి నివేదిక సమర్పించాలన్నారు. టేకులపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తీసుకొని అందులో నివాసం ఉండని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు బీ.సత్యప్రసాద్, డీ.మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, ఖమ్మం ఆర్డీవో జీ. గణేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1లోపు కొనుగోళ్లు ప్రారంభించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1లోపు ప్రారంభించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణపై ఆయన సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 151 ధాన్య కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కేంద్రాలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. రబీలో 1,71,357 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రానున్నట్లు అంచనా ఉందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలి
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో నిర్వహించిన ఏఎల్ఎమ్ టీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులుపోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ని వినియోగించుకోవాలన్నారు.