ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నది బఫర్‌జోన్ విషయంలో కలెక్టర్ గౌతమ్చేసిన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడ అజయ్ కు కోపం తెప్పించినట్లు కనిపిస్తోంది. బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్లు ఇవ్వబోమని, వరదలకు దెబ్బతిన్న ఇండ్ల స్థానంలో మళ్లీ తిరిగి ఇండ్లు నిర్మిస్తే ఎప్పటికైనా ముప్పేనని ఇటీవల కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్పరోక్షంగా స్పందిస్తూ.. ఒక్క ఇంటిని కూడా పోనివ్వనని, కొత్తగా ఇండ్లు కట్టుకునేందుకు దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తామని ముంపు బాధితులకు హామీ ఇచ్చారు. అధికారులు కొంత అత్యుత్సాహంతో మాట్లాడుతుంటారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వరద తగ్గు ముఖం పట్టాక ముంపు నష్టంపై ఆయా కాలనీల్లో అధికారులు సర్వే చేశారు. బఫర్ జోన్‌తో పాటు, మ్యాగ్జిమమ్ఫ్లడ్లెవల్స్(ఎంఎఫ్ఎల్) పరిధిలో కొన్నేళ్లుగా చేపట్టిన నిర్మాణాలతోనే ముంపు సమస్య ఎక్కువైందని గత నెల 31న ప్రెస్‌మీట్‌పెట్టి కలెక్టర్గౌతమ్ వెల్లడించారు. బఫర్‌జోన్ తో పాటు ఎంఎఫ్ఎల్ ఏరియాలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్వ్యాఖ్యలతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకున్న వారు లాభాలు పొందారని, తక్కువ ధరకు వస్తున్నాని కొనుక్కున్న తాము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామంటూ బాధపడుతున్నారు. తాము నష్టపోకుండా చూడాలని ఆయా డివిజన్ల కార్పొరేటర్లపై కొన్నిరోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో మంత్రి అజయ్ బాధితులకు ధైర్యం చెప్పారు. ఒక్క ఇంటిని కూడా పోనివ్వమని హామీ ఇచ్చారు.
గత నెల 31న కలెక్టర్గౌతమ్మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మున్నేరు బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. కొంత మంది రియల్ఎస్టేట్వ్యాపారులు బఫర్‌జోన్‌లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఆ విషయం తెలియక కొందరు అమాయకులు వాటిని కొని మోసపోతున్నారు. ఇక నుంచి ముంపు ప్రాంతంలోని ఇండ్ల ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయం. ఇండ్లు నిర్మాణానికి అనుమతులు ఇవ్వం. రూల్స్‌కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినా, అనుమతులు ఇచ్చినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వరదలకు పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల స్థానంలో మళ్లీ కడితే ఎప్పటికైనా ముప్పే. లోతట్టు కాలనీల ప్రజలు ముందుకు వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తాం. వేరేచోట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. బఫర్ జోన్‌లోని భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలి. ప్లాట్లు, కన్వర్షన్ చేసేందుకు వీల్లేదు.’’ అని స్పష్టం చేశారు.
రిటైనింగ్ వాల్ కడితే బఫర్‌జోన్ ఉండదు: మంత్రి
మంత్రి అజయ్సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మున్నేరుకు రెండు వైపులా ఆర్ సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే.. ఇక్కడున్న ప్రజలకు, ఇండ్లకు ఎలాంటి నష్టం ఉండదు. కరకట్ట(మట్టికట్ట) అయితే ఇండ్లు పోతాయి. భూమి సేకరించాల్సి వస్తుంది. అందుకే మట్టికట్టల జోలికి పోకుండా ఆర్సీసీ వాల్ నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించాం. ఏడాది కిందే డీపీఆర్ రూపొందించాం. కేబినెట్ ఆమోదం తీసుకున్నాం. అవసరమైతే రీఎస్టిమేట్స్ చేయించి శాంక్షన్చేయించే బాధ్యత నాది. ఇరిగేషన్ఉన్నతాధికారులు వచ్చి, కాంటూర్లెవల్స్ చూసుకుని ఎస్టిమేట్స్ ఇస్తామని చెప్పారు.
నేను ఇదే పని మీద హైదరాబాద్పోయా. ఈ లోపు ఇక్కడి అధికారులు స్థానికులను ఆందోళన కలిగించేలా కొన్ని ప్రకటనలు చేశారు. ఆర్సీసీ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత బఫర్ జోన్ ఉండదు. ప్రైవేట్ ఆస్తులు అలాగే ఉంటాయి. ఒక్క ఇల్లు కూడా పోదు. గజం స్థలం కూడా కోల్పోనివ్వను. ఎవరి స్థలాల్లో వాళ్లు ఇల్లు కట్టుకునేలా.. నేనే పర్మిషన్ ఇప్పిస్తానని ప్రామిస్ చేస్తున్నా. అధికారులు కొంత అత్యుత్సాహంతో మాట్లాడుతుంటారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇటీవల మునిగిన ఇండ్లకు త్వరలోనే నష్టపరిహారం ఇస్తాం” అని చెప్పారు.