- గుక్కెడు నీళ్ల కోసం అష్టకష్టాలు.. చెలిమ నీళ్లే దిక్కు
- కరెంట్ లేక గుడ్డిదీపాల వెలుగుల్లోనే గుడిసెలు
- అందని వైద్యం.. ఇబ్బందుల్లో గర్భిణులు, బాలింతలు
- ఇటీవల గొత్తికోయల గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్
- తమ బతుకులు మారేనా.. ఆశగా ఎదురుచూస్తున్న గొత్తికోయలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెంలోని అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ గొత్తికోయలు అనేక సమస్యలతో గోస పడుతున్నారు. వీరు ఏండ్ల కింద వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. జిల్లాలో దాదాపు 110కి పైగా గుత్తికోయ ఆవాసాలున్నాయి. ఇవి ఎక్కవగా చండ్రుగొండ, ముల్కలపల్లి, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, చర్ల, దుమ్ముగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, అశ్వాపురం, పినపాక మండలాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో వేలాది మంది గొత్తికోయలు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పలు గొత్తికోయల గ్రామాలను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సందర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడైనా తమ సమస్యలు తీరేనా అని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాన సమస్యలు ఇవే..
ఎండాకాలంలో గొత్తికోయ గ్రామాలు గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వ్యవసాయ బోర్లు, చెలిమల ద్వారా నీళ్లను తెచ్చుకొని గొంతు తడుపుకొంటున్నారు. క్రాంతి నగర్లో ఉన్న ఒకే ఒక్క హ్యాండ్‌పంప్ రిపేరులో ఉంది. అశ్వారావుపేట మండలంలోని రేగళ్ల గుంపు గ్రామస్తులకు చెలిమ నీళ్లే దిక్కు. రాజీవ్‌నగర్ కాలనీ, ఎదుళ్ల చెరువులో గతంలో వేసిన సోలార్ బోర్ పనిచేయడం లేదు. దాదాపు 20 నుంచి 30 గొత్తికోయ గ్రామాల ప్రజలు ఎండాకాలంలో నీళ్ల కోసం అరిగోస పడుతున్నారు.
సరైన రోడ్లు లేక కిలోమీటర్ల కొద్దీ నడవలేక ఇబ్బంది పడుతున్నారు. ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా దాదాపు 5 నుంచి 8కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తేనే అక్కడి నుంచి వాహనాలు దొరుకుతాయి. వానాకాలం అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
చాలా గ్రామాల్లో కరెంట్ సౌకరం లేదు. గుడ్డిదీపాల వెలుగుల్లోనే గొత్తికోయలు జీవితాలు గడిచిపోతున్నాయి. కొన్ని చోట్ల సోలర్ సౌలత్లు కల్పించినా అవి ఎక్కువ శాతం పనిచేయడం లేదు. ఈ సమస్యతో రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతున్నారు. వానాకాలంలో అయితే మబ్బులు పట్టి ఈ లైట్లు చాలా వరకు వెలగవు. దీంతో చీకట్లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడపుతుంటారు.
సరైన రోడ్లు, కరెంట్ సౌకర్యం లేక గొత్తికోయలకు వైద్యం కూడా అందని ద్రాక్షగానే మారింది. గత శుక్రవారం అర్ధరాత్రి పాల్వంచ మండలం గొత్తికోయ గ్రామమైన సీతారామపురానికి చెందిన గర్భిణి మడివి ఇడిమమ్మకు పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రోడ్డు సరిగా లేక అంబులెన్స్ ఊరికి సమీపంలోని వాగు వద్దే నిలిచిపోయింది. దీంతో అంబులెన్స్‌లోని సిబ్బంది సెల్ ఫోన్ల లైట్ల సాయంతో గ్రామానికి చేరుకున్నారు. బైక్‌పై గర్భిణిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పురిటినొప్పులు ఎక్కువవడంతో గ్రామంలోనే సెల్ ఫోన్ వెలుతూరులోనే డెలివరీ చేశారు. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు సరైన సమయంలో వైద్యం అందక గర్భిణులు, బాలింతలు, ఇతర పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్ పర్యటనతో చిగురించిన ఆశలు
కలెక్టర్ ప్రియాంక అల గొత్తికోయ గ్రామాలను నాలుగు రోజుల కింద సందర్శించారు. చుంచుపల్లి మండలంలోని పాలవాగు, జగ్గారం, మర్రిగూడెం, గడ్డికుప్పలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలుగా తాగునీరు, రహదారులు, కరెంట్ సౌకర్యం లేకపోవడమేనని గర్తించారు. వాటిని పరిష్కరించాలని ఆఫీసర్లను ఆమె ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతోనైనా తమ గ్రామాలు బాగుపతాయని గొత్తికోయలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్ల కొర్రీలు!
ఛత్తీస్ గఢ్ ప్రాంతం నుంచి ఏండ్ల కాలం కింద వచ్చి స్థిరపడిన గొత్తికోయల గ్రామాలకు తాగు నీళ్లు, రహదారి, కరెంట్ సౌకర్యం ఇచ్చేందుకు అధికారులు ముందుకు వస్తున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు కొర్రీలు పెడతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడవిని నరికివేస్తున్నారంటూ వారికి సౌకర్యాలు కల్పించడంలో అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏండ్ల కింద అడవుల్లో స్థిరపడినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎందుకు అడ్డుకోలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.