- అప్పటి అధికార పార్టీ నేతలు, వారి బంధువుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు
- నిర్మల్ కలెక్టరేట్ ముట్టడి
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో అక్రమ డీ1 పట్టాల పేరిట రూ.కోట్ల విలువైన భూములను పలువురు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నేతలు, వారి బంధువుల ప్రమేయమున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోన్ మండలం సిధిలకుంట గ్రామంలో జరిగిన డీ1 పట్టాల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆ గ్రామస్తులంతా శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో మొత్తం డీ వన్ పట్టాల అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అక్రమాల్లో అధికారుల హస్తం!
జిల్లాలోని పలు పునరావాస గ్రామాలను లక్ష్యంగా చేసుకొని డీ వన్ పట్టాల దందా పెద్ద ఎత్తున సాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రమేయంతోఈ దందాకు రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ల అధికారులు సహకరించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వందలాదిమంది సిధిలకుంట గ్రామస్తులు కలెక్టరేట్‌కు తరలివచ్చి అడిషనల్ కలెక్టర్‌ను డీ వన్ పట్టాల వ్యవహారంపై నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి అక్రమ డీ వన్ పట్టాల పేరిట భూములను కొట్టేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మామడ మండలంలోని న్యూ లింగంపల్లి, సోన్ మండలంలోని సిద్ధిలకుంట, లోకేశ్వరం మండలంలోని మరికొన్ని గ్రామాల్లో ఈ అక్రమ దందా జోరుగా సాగిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డీ వన్ పట్టాలను కేటాయిస్తారు. అయితే కొంతమంది దళారులు ఈ నిర్వాసితుల పేరు మీదనే డీ వన్ పట్టాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే అప్పటి అధికార పార్టీ నేత ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు వెనుకాడినట్లు తెలుస్తోది. అప్పట్లోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డీ వన్ పట్టాల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల్లోనే డీ వన్ పట్టాల అక్రమాలపై అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేసి, విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది
రెండేండ్లలో 366 పట్టాల జారీ
2017 –18, 2018 –19 కాలంలో 366 అక్రమ డీ1 పట్టాలు జారీ అయినట్లు తెలుస్తోంది. వీటిలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నకిలీ పట్టాలు సృష్టించినట్లు సమాచారం. సంబంధిత అధికారులు ఈ నకిలీ పట్టాలను రిజిస్ట్రేషన్లు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. మామడ మండలం న్యూ లింగంపల్లిలోని 18వ సర్వే నెంబర్, రత్నాపూర్ కాండ్లీలోని 67, 167 సర్వే నంబర్లలో దాదాపు 150 ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులు, ఆ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ దందాను కొనసాగించేందుకు బీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలమైన ఆఫీసర్లను నియమించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తహసీల్దార్లతోపాటు మండల సర్వేయర్లు, ల్యాండ్ సర్వే శాఖ అధికారులు ఈ దందా వెనుక సూత్రధారులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విచారణ జరిపిస్తా..
నిర్మల్ జిల్లాలో జరిగిన డీ వన్ పట్టాల అక్రమాలపై ఇప్పటికే మాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. రెండు, మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తా. ఆ తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.
అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబు