మెస్ ఛార్జీలు, స్కాలర్​షిప్ రిలీజ్​ చేయాలని కలెక్టరేట్ ముట్టడి

నస్పూర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు, స్కాలర్​షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ను ముట్టడించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాహుల్​కు వినతిపత్రం అందించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన మెస్ బిల్లులు సమారు రూ.6,300 కోట్లు పెండింగ్​లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.

ఆరేండ్లుగా రూ.7200 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల కాలేదని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీతోపాటు  లక్షెట్టిపేట, దండెపల్లిలోని జూనియర్ కాలేజీలకు వెంటనే కొత్త భవనాలు నిర్మించాలని కోరారు.

జిల్లాలో ఇంజనీరింగ్, పీజీ, మహిళా డిగ్రీ, ఐటీఐ కాలేజీలు ఏర్పా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్​లో 30 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలో తొలగించిన స్కావెంజర్స్​ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ లీడర్లు దాగం శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి, అభినవ్, సత్యనారాయణ, దినేశ్, రాజు, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.