ఆర్మూర్, వెలుగు: షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న చలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏరియా అధ్యక్షుడు ఆకుల గంగారాం, ప్రధాన కార్యదర్శి మచ్చర్ల రాజన్న తెలిపారు. శనివారం ఆర్మూర్ లో చలో కలెక్టరేట్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రైతులను మోసగిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని, కార్మికులకు 200 రోజుల పని దినాలు కల్పించాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు తలారి గంగాధర్, తర్పటి శ్రీనివాస్, రవి, బాలు , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.