ఎన్నికల రూల్స్ అతిక్రమించొద్దు .. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు

హనుమకొండ/మహబూబాబాద్/ములుగు/భూపాలపల్లి అర్బన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల కోడ్​  ఎట్టిపరిస్థితుల్లో అతిక్రమించొద్దని ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కలెక్టర్లు సూచించారు. మంగళవారం ఆయా కలెక్టరేట్లలో కలెక్టర్లు అధికారులతో, రాజకీయ ప్రతినిధులతో  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.  జయశంకర్ ​భూపాలపల్లి కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్​ ఆఫీసర్​ భవేశ్​ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 317 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ కు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అవసరమైన మేర బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వీవీ  ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 

మహబూబాబాద్ కలెక్టర్​ కే.శశాంక​ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందం పర్యటిస్తుందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు బూత్​ లెవల్​ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జి.చంద్రమోహన్ మాట్లాడుతూ  జిల్లాలో  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్​  లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతరం మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్ మండల కేంద్రాలలో  పోలింగ్ కేంద్రాలలో విధుల నిర్వహణ బందోబస్తుకు సీఆర్​పీఎఫ్  బలగాల వసతి  ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. 

హనుమకొండ కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ మాట్లాడుతూ ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ--విజిల్, ఈ--సువిధ యాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.  ఈ--సువిధ యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు  ముందస్తు అనుమతులు పొందవచ్చన్నారు. నామినేషన్ కూడా ఈ--సువిధ యాప్ ద్వారా వేసే అవకాశం ఉందన్నారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు  తెలిపారు. 

పొలిటికల్​ పార్టీల పోస్టర్లు, పాంప్లెట్లపై  ప్రింటింగ్ ప్రెస్ పేరు, సెల్ ఫోన్ ఇతర వివరాలను తప్పకుండా ప్రింట్​ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు  అన్నీ 24 గంటలలోపు,  పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లో,  ప్రైవేటు స్థలాల్లో ఉన్న వాటిని 72 గంటలలోపు తొలగించాలని సూచించారు.  వెబ్సైట్ లో రాజకీయ నాయకుల ఫొటోలు కూడా తీసివేయాలని చెప్పారు.  ప్రభుత్వ వాహనాలు రాజకీయ అవసరాలకు వాడరాదని తెలిపారు. 

ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.  జిల్లాలో మొత్తం 303పోలింగ్​ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్​ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 1950 టోల్​ ఫ్రీ సెంటర్​ 24గంటల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలన్నారు. పేరులేని వారికి అక్టోబర్​ 30వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. 

కుల, మత, ప్రాంత విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేయడం, రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు లౌడ్​ స్పీకర్ల వినియోగం నిషేధమన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లొద్దని, లిక్కర్​ సరఫరా చేయొద్దని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ లో ఐటీడీఏ పీవో, అడిషనల్​కలెక్టర్​ తో కలిసి ఎంసీసీ అధికారులు, ఎంపీడీవోలు, స్క్వాడ్​ లు, వీడియో సర్వెలెన్స్​​, ఎక్స్​పెండీచర్​, అకౌంట్​ టీం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలపై ప్రతీ ఒక్క అధికారి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్​ సూచించారు.