ధరణితో కలెక్టర్ల దందా

ల్యాండ్ రేటును బట్టి ముడుపులు ఇస్తేనే పని 
రియల్ బూమ్ ఉన్న జిల్లాల్లో జోరుగా పైరవీలు 
ముఖ్యంగా ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి
తొలగించేందుకు భారీగా డిమాండ్ 
కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములకూ
ఆమోదం తెలుపుతూ అక్రమాలు

హైదరాబాద్, వెలుగు : ధరణి పోర్టల్​తో ఏకంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే దందా చేస్తున్నారు. భూముల క్లియరెన్స్ కోసం రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నారు. ఈ దందాలో కొందరు అధికార పార్టీ లీడర్లు కూడా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిన భూములను తొలగించడం, మిస్సింగ్ సర్వే నంబర్లను ఎక్కించడం, భూమి విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉంటే సరిచేయడం, ల్యాండ్ క్లాసిఫికేషన్ (నేచర్ ఆఫ్ ల్యాండ్) మార్చడం మొదలు సమస్య ఏదైనా సరే పైసలు ఇస్తేనే పరిష్కరిస్తున్నారు. లేదంటే అప్లికేషన్ పెండింగ్ లో పెట్టి నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. చివరకు అన్ని సరిగానే ఉన్నాయని ఎమ్మార్వోల నుంచి రిపోర్టులు వచ్చినా సరే.. ఏదో ఒక కొర్రీ పెట్టి అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు కబ్జాకు గురైన వక్ఫ్, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూములకు ఎలాంటి గ్రౌండ్ రిపోర్టు లేకుండానే అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. ఇక సీలింగ్, అసైన్డ్ భూముల క్లాసిఫికేషన్ కూడా మార్పు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిపోర్టుల కోసం కింది స్థాయిలో ఆర్ఐలు, ఎమ్మార్వోలకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సి వస్తుండగా.. చివరకు ధరణిలో అప్రూవల్స్ కోసం ఉన్నతాధికారులకూ డబ్బులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు ధరణిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరిస్తుంటే.. మరికొందరు అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం.  

ఈ జిల్లాల్లోనే అక్రమాలు.. 

రియల్ భూమ్ ఎక్కువ ఉన్న జిల్లాల్లోనే ధరణితో దందా జోరుగా జరుగుతోంది. ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆపై పలుకుతున్న ప్రాంతాల్లోనే అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ జిల్లాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎక్కువే ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వరంగల్, యదాద్రి భువ నగిరి, జనగాం, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగాయి.  

వసూళ్లకో వ్యవస్థ... 

ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి ముందు ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే, అది కలెక్టర్ నుంచి కిందిస్థాయికి వెళ్తుంది. దానిపై ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రిపోర్టులు పాజిటివ్​గా వచ్చినా, ఆ అప్లికేషన్లకు ఆమోదం తెలపడం లేదు. ల్యాండ్ రేట్లు ఎక్కువగా ఉండటంతో వాటికి డబ్బులు ఇచ్చుకోవాలని ఉన్నతాధికారుల నుంచే డిమాండ్ వస్తోంది. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని వసూళ్లు చేస్తున్నారు. 

కబ్జాలకు ఆమోదం... 

కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములకూ కలెక్టర్లు ఆమోదం తెలుపుతున్నారు. అసైన్డ్, వక్ఫ్, దేవా దాయ, సీలింగ్ ల్యాండ్స్ కు సంబంధించి కింది స్థాయి నుంచి ఎలాంటి రిపోర్ట్  తీసుకోకుండానే అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ లీ డర్ల ప్రమేయం ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నింటిపై కోర్టుకు వెళ్లడంతో అక్కడ స్టే ఆర్డర్లు వస్తున్నాయి. 3నెలల కింద రంగారెడ్డి జిల్లాలో 40 ఎకరాలపై కలెక్టర్ ఇచ్చిన 3అప్రూవల్స్​ను హైకోర్టు సస్పెండ్ చేసింది.  

లక్షల్లో సమస్యలు.. 

ధరణి సమస్యలు లక్షల్లో ఉన్నాయి. ఒక్క ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ల సమస్యలే 8 లక్షల దాకా ఉన్నాయి. కోర్టు కేసుల్లో ఉన్నవి మరో 2 లక్షలపైనే ఉన్నాయి. ఎక్స్టెంట్​కరెక్షన్ కోసం 3 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చాలని వస్తున్న దరఖాస్తులు కూడా లక్షల్లో ఉంటున్నాయి. 2నెలల కింద ప్రొహిబిటెడ్ లిస్టులో పొరపాటున నమోదైన భూములపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అయినా సమస్యలు కొలిక్కి రాలేదు.

కలెక్టర్లపై లీడర్ల ఆరోపణలు..

రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని, ఆధారాలు సేకరించామని, త్వరలోనే వాళ్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. దీంతో ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేగింది. ఆ నలుగురు ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. అలాగే వికారాబాద్ కలెక్టర్ పై ఆ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి ఆరోపణలు చేశారు. జిల్లాలో ఎంతోమంది రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, భూముల సెటిల్‌‌‌‌మెంట్లకు సంబంధించి ఆధారాలతో సహా సీఎస్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు.

ఎకరాకు కోటి చొప్పున 47 కోట్లు... 

ఉమ్మడి మెదక్ జిల్లా​లో కీలక కేంద్రంగా ఉండి కొత్తగా ఏర్పడిన ఓ జిల్లా కలెక్టర్ కు ధరణి కాసులు కురిపిస్తోంది. ఈ జిల్లాలో గతంలో వివిధ పారిశ్రామిక, ప్రాజెక్టుల అవసరాల కోసం కేటాయించిన భూముల సర్వే నంబర్లు, సీలింగ్ కింద పోయిన భూముల సర్వే నంబర్లు ప్రొహిబిటెడ్ లిస్టులో చేరాయి. ఇవే సర్వే నంబర్లలో పట్టా భూములు కూడా చేరాయి. దీంతో ఆ భూములు అమ్ముకోవడం ఓనర్లకు ఇబ్బందికరంగా మారింది. ఇదే సమస్య ఆ జిల్లా కలెక్టర్ కు కోట్లు కుమ్మరిస్తోంది. ఇటీవల 47 ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించేందుకు ఆయన ఎకరాకు రూ.కోటి చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. ఎకరాకు రూ.10 కోట్లు పలికే ఆ ల్యాండ్ టైటిల్ ను క్లియర్ చేసుకునేందుకు ఓనర్ కూడా అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

అంతా కలెక్టర్ల చేతుల్లోనే.. 

భూములకు సంబంధించి ఏ మార్పు చేయలన్నా కలెక్టర్ల చేతిలో పెడితేనే అక్రమాలకు చోటు ఉండదని సర్కార్ భావించింది. అందులో భాగంగానే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. రెవెన్యూ ట్రిబ్యునళ్లనూ తొలగించింది. ఇప్పుడు ధరణిలో పేర్లను సరి చేయడం దగ్గరి నుంచి ఏదైనా సరే కలెక్టర్ చేయాల్సిందే. కలెక్టర్ ఓకే చేస్తేనే ధరణి పోర్టల్ లో మార్పులు జరుగుతాయి. ఇదే అదునుగా భావించిన కొందరు కలెక్టర్లు దందాకు తెరలేపారు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరను బట్టి సమస్యల పరిష్కారానికి అదే స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారు. రూ.50 లక్షలకు ఎకరం ఉంటే కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక రూ.కోటి దాటితే భారీగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే రియల్ భూమ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లేందుకు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం స్థాయికలో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఐదారు జిల్లాలకు కలెక్టర్ కావడమంటే, నేరుగా సీఎంవోతో సంబంధాలుండటమేనని ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. 

ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం..   

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏర్పడిన ఓ కొత్త జిల్లాలో కలెక్టర్.. ధరణి సమస్య ఏదైనా సరే పరిష్కరించాలంటే ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. భూమి మార్కెట్ రేటును బట్టి ఆ మొత్తం పెరుగుతోంది. ఈ కలెక్టర్ పై జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా పని చేసి ఇటీవల ట్రాన్స్ ఫర్ అయిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ కేవలం ధరణి అప్లికేషన్ల పరిష్కారం కోసమే ఏజెంట్లను పెట్టుకున్నారనే ప్రచారం సాగింది.