యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లు, హనుమంతు జెండగే, తేజస్ నందలాల్ పవార్, సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్ల పరిధిలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో మూడు జిల్లాలకు చెందిన కలెక్టర్లు పాల్గొని అర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
గ్రామకంఠం భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా పౌతి చేయించుకొని పట్టాదారు పాస్‌బుక్స్ పొందారని, వాటిని రద్దు చేయాలని కలెక్టర్ హనుమంతు జెండగేకు మోటకొండూరు మండలం సికిందర్ నగర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 533 బీలోని 4 ఎకరాలకు పాస్‌బుక్ పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో భూవ్యవహారాలకు సంబంధించి 26 ఫిర్యాదులు రాగా, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి మరో 9 ఫిర్యాదులు వచ్చాయి.
బీసీ కులగణన పకడ్బందీగా నిర్వహించాలి..
బీసీ కులగణన పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన కోసం జిల్లా అధికారులు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయ్యేలోపు మండలాల నుంచి కులగణనకు అవసరమయ్యే ఎన్యూమరేటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఆయిల్ పామ్ తోటల పెంపకంపై దృష్టి..
ప్రజావాణిలో భాగంగా నల్గొండ కలెక్టరేట్ లో ప్రజల వద్ద నుంచి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మహిళాశక్తి, ఉపాధి హామీ, ఆయిల్ పామ్ తోటల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.