
- తీరు మార్చుకోకుంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్
- ప్రజావాణికి హాజరవుతూ ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్
- కలెక్టర్ల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకుంటున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు మొదలుపెట్టారు. గురుకులాలు, గవర్నమెంట్ స్కూళ్లు, హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపడ్తున్నారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను హెచ్చరిస్తున్నారు. మళ్లీ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్లు పాల్గొంటూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తున్నారు. కొందరు కలెక్టర్లు నిరంతరం ఫీల్డ్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని అప్పటికప్పుడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ముందు వరుసలో యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉన్నారు.
నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మిని ఇటీవల సస్పెండ్ కూడా చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు కూడా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్లను తనిఖీ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే కొందరు ఫీల్డ్ విజిట్స్
గత మూడు నెలల కలెక్టర్ల పనితీరుపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోనున్నట్లు తెలిసింది. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో బదిలీలు ఉంటాయని ఇప్పటికే సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొందరు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు. వాస్తవానికి 2018 నుంచి చాలా మంది కలెక్టర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ప్రభుత్వ లక్ష్యాలు వివరించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇతర కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంటున్నది. ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో కలెక్టర్లు వెనుకబడిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల్లోనూ ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి.
దీంతో గ్రామాల్లో అర్హులు, లబ్ధిదారులు ఆందోళనకు గురైనట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇవే గాకుండా ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ వంటి గ్యారంటీ పథకాల అమలులోనూ పాజిటివిటీని తీసుకురాలేకపోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
తప్పులు చేస్తామంటున్నది ఎవరు?
ఇక కొందరు ఐఏఎస్లు ఒక తప్పు చేయమంటే.. మూడు చేద్దాం అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై సెక్రటేరియెట్ ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. సీఎం, మంత్రుల స్థాయిలో నిర్ణయాలు జరిగేవి సెక్రటేరియెట్లోనేనని.. తప్పులు చేద్దామంటున్న ఆ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరంటూ చర్చ జరుగుతున్నది.
సెక్రటేరియెట్లో ఉన్న కొందరు సీనియర్ ఐఏఎస్లు కూడా ప్రభుత్వ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని సీఎం.. తన సన్నిహితుల దగ్గర అన్నట్లు తెలిసింది. విజిటర్లకు కూడా అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.