
వైరా/సుజాతనగర్, వెలుగు : భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్వి పాటిల్ అన్నారు. కొణిజర్ల మండల కేంద్రంలోని శ్రీరామ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం-2025 రెవెన్యూ సదస్సులో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ తో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సుజాతనగర్ రైతువేదికలో కొత్తగూడెం ఎమ్మెల్యే కుంబనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ జితేశ్ మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం సర్వేతోనే సాధ్యం అవుతుందని, భూ సర్వేను భూభారతి చట్టంలో పొందుపర్చినట్లు తెలిపారు.
జీపీఎస్, సాంకేతికతతో కూడిన యంత్రాలతో సర్వే చేపట్టనున్నామని, ప్రతి గ్రామానికీ సర్వేయర్లను కేటాయించి సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీరికి పట్టాలు అందించేందుకు భూ భారతి చట్టంలో సౌలభ్యం కల్పించామన్నారు. కొనిజర్లలో ఆర్డీఓ జి. నరసింహారావు, తహసీల్దార్ రాము, ఎంపీడీవో రోజారాణి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కరుణశ్రీ, మండల వ్యవసాయ అధికారి బాలాజీ, సూజాతనగర్లో ఆర్డీఓ మధు, పాక్స్ చైర్మన్ మండే వీరహనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.