- బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం
- స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 7 వేల ఇండ్లు కూలిపోయాయి. వీటిలో కొన్ని పూర్తిగా నేలమట్టం కాగా, ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ క్రమంలో హౌసింగ్ ఆఫీసర్లు గ్రామాల వారీగా ఇండ్లు కూలినోళ్ల సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదటి విడతలోనే వరద బాధితులకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇంకా వర్షాలు పడుతున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, కూలిన ఇండ్లపై ఆఫీసర్లు మూడు రకాలుగా సమాచారం సేకరించారు. పూర్తిగా కూలిపోయిన ఇండ్లు ఒక కేటగిరి కింద, పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు మరో కేటగిరి కింద.. అందులోనూ వాగులు, చెరువుల వెంట ఉన్న ఇండ్ల వివరాలను ఇంకో కేటగిరీ కింద సేకరించి సర్కార్ కు పంపించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇంటి స్థలం ఉన్నోళ్లకు రూ.5 లక్షలు, ఇంటి జాగ లేనోళ్లకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో చెరువులు, వాగుల వెంట ఉన్న ఇండ్లు కూలిపోయినోళ్లకు.. తిరిగి అదే స్థలంలో కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ..
దెబ్బతిన్న 7 వేల ఇండ్లలో ఎక్కువ శాతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహబుబాబాద్ జిల్లా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువ నష్టం జరిగింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బాధితులందరికీ స్కీమ్ తొలి దశలోనే ఇండ్లు ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇక ఆకేరు వాగు ఉధృతికి ఖమ్మం జిల్లాలోని రాకాసితండా నామరూపాల్లేకుండా పోయింది. ఇక్కడ 40కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి.