- డిసెంబర్ 5 వరకు ఎన్నికల నియామవళి అమలు
- ఈ నెల 31 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు
- సీ విజిల్ ఫిర్యాదులకు గంటన్నరలోగా పరిష్కారం
మంచిర్యాల, వెలుగు: జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్లు వెల్లడించారు. కలెక్టరేట్లలో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు సబావత్ మోతీలాల్, బి.రాహుల్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీవో రాములు, ఏసీపీ తిరుపతిరెడ్డితో కలెక్టర్బదావత్ సంతోష్ సమావేశమై మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న ఎలక్షన్ షెడ్యూల్ప్రకటించిన వెంటనే కోడ్అమల్లోకి వచ్చిందన్నారు.
డిసెంబర్ 5 వరకు అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో 741 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3 చొప్పున చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, అక్కడ స్టాటిస్టికల్ సర్వెలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్టీమ్లు 24 గంటలు నిఘా నిర్వహిస్తాయన్నారు.
పర్మిషన్ లేకుండా ర్యాలీలు, మీటింగ్లు పెట్టొద్దు
నిర్మల్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో మీడియా సెంటర్ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబుతో కలిసి మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్ని కలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సీ విజిల్ ద్వారా అభ్యర్థుల ఎన్నికల వ్యయంతో పాటు అన్ని రకాల అక్రమాలపై నిఘా సారిస్తామన్నారు. సువిధ పోర్టల్ ద్వారా ర్యాలీలు, మీటింగ్లు, లౌడ్ స్పీకర్ల కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 590 సాధారణ పోలింగ్ స్టేషన్లను గుర్తించామని, 153 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 17 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలక్షన్ రూల్స్ కచ్చితంగా పాటించాలి
ఆసిఫాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ఆసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉంటూ నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరించారు.