- కౌలు రైతులకు కూడా పరిహారం అందేందుకు చర్యలు తీసుకోవాలి
- చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లదే..
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్/తొర్రూరు/, వెలుగు : కలెక్టర్లు అన్ని మండలాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. హనుమకొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో సోమవారం ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు పోలీస్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపడంతో పాటు రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. కౌలురైతులకు కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల సేకరణ వేగం పెంచాలని ఆదేశించారు. సెంటర్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఆఖరి వడ్ల గింజ కొనుగోలు చేసే వరకు కలెక్టర్లు, ఆఫీసర్లు అలసత్వంగా ఉండొద్దన్నారు. రైస్ మిల్లర్లతో ఎప్పటికప్పుడు మీటింగ్‌లు నిర్వహించాలని, తూకాల్లో తేడాలు, కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మక్కల కొనుగోలుకు సైతం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వర్ధన్నపేట, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, ఒడితల సతీశ్‌బాబు, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అగ్రికల్చర్ జేడీ ఉషాదయాల్, డీఆర్డీవోలు శ్రీనివాస్‌కుమార్, సంపత్‍రావు పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోని దుబ్బతండాలో నిర్వహించిన దుర్గామాత ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్‌చైర్మన్ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్ ధరావత్ సునీత జైసింగ్, ఆలయ చైర్మన్ వాగ్యా నాయక్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ కార్మిక విభాగం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకలకు మంత్రి హాజరయ్యారు.
గోలీలాట ఆడిన మంత్రి
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం స్థానిక స్కూల్‌కు వెళ్లారు. అక్కడ పిల్లలు గోలీలు ఆడుతుండడాన్ని గమనించిన మంత్రి వారితో కలిసి గోళీలు ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరాజుపల్లిలో శివాలయ పునరుద్ధరణ కోసం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.