ఘట్ కేసర్ బస్ స్టాప్ వద్ద కాలేజీ విద్యార్థుల ధర్నా

ఘట్ కేసర్ బస్ స్టాప్ వద్ద కాలేజీ విద్యార్థుల ధర్నా

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ బస్ స్టాప్ వద్ద కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఔషాపూర్ లో ఉన్న అరోరా (VIBIT) కళాశాల బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన చేశారు. నిన్న ఇదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థినీ బస్సు ఎక్కుతూ జారి కింద పడిపోవడంతో కాలుకి ఫ్యాక్చర్ అయినట్టు తెలుస్తోంది. దీంతో వరంగల్ జాతీయ రహదారి మార్గంలో ఉన్న తమ కళాశాల స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. బస్సులు లేక తాము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకొని బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..విద్యార్థులను సముదాయించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం విద్యార్థుల ధర్నాకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ప్రతి సాయంత్రం కళాశాల ముగిశాక యాదగిరిగుట్ట డిపోకు, చెంగిచెర్ల డిపోకు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థుల కోసం బస్సులు అపి.. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణం చేసేలా చూస్తామని స్పష్టం చేసింది.