ఫీజు కడితేనే సర్టిఫికెట్లు

  • విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్న కాలేజీలు, వర్సిటీలు
  • మూడేండ్లుగా రీయింబర్స్ మెంట్ రాకపోవడమే కారణం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో 7 వేల కోట్ల బకాయిలు పెండింగ్ 
  • చదువు పూర్తయినా సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది ఇబ్బందులు 

హైదరాబాద్​, వెలుగు: ఇది కేవలం ఓ ముగ్గురి సమస్యనే కాదు..రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువులు పూర్తయిన లక్షలాది మంది స్టూడెంట్​కు  ఇలాంటి ప్రాబ్లమ్సే ఎదురవుతున్నాయి. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం మూడేండ్ల నుంచి సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో, పేద విద్యార్థుల చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది.

అటు ప్రైవేట్​ కాలేజీలతోపాటు సర్కారు కాలేజీల్లోనూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇదే దుస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది విద్యార్థుల హయ్యర్ ఎడ్యుకేషన్​కు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు విద్యార్థులకు జాబ్​లూ మిస్ అవుతున్నాయి. అత్యవసరం అయిన వాళ్లు అనివార్యంగా అప్పులు చేసి, డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోతున్నారు. సర్కారు రిలీజ్ చేసినా తర్వాత, రీఫండ్ చేస్తామని మేనేజ్​మెంట్లు, వర్సిటీ అధికారులు చెప్తున్నారు. అయితే, విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దని ఏఐసీటీఈ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తో పాటు తాజాగా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా, ఈ ఆదేశాలు ప్రైవేట్​ కాలేజీలే కాదు.. ఏకంగా సర్కారు యూనివర్సిటీలు కూడా అమలు చేయడం లేదు. 

రూ.7 వేల కోట్ల బకాయిలు 

రాష్ట్రంలో 2 వేల వరకూ డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలుండగా, వాటిలో ఏటా ఐదు లక్షల మంది స్టూడెంట్స్​ చేరుతున్నారు. వీరిలో పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​ మెంట్ అందిస్తోంది. దానికోసం ఏటా సుమారు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకూ అవసరం. అయితే, 2021–22 నుంచి గత బీఆర్ఎస్ సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ రిలీజ్ చేయలేదు. దీంతో వేల కోట్లు పెండింగ్​లో పడిపోయాయి. 2021–22 విద్యాసంవత్సరంలో కొంత అమౌంట్ రిలీజ్ చేసింది. కానీ, 2022–23, 2023–24లో ఒక్క పైసా ఇవ్వలేదని మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి.

ప్రస్తుతం సుమారు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సకాలంలో ఫీజు బకాయిలు రిలీజ్ కాకపోవడంతో చదువులు పూర్తయిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం కాలేజీల మేనేజ్ మెంట్ ను కలిస్తే, ఫీజు మొత్తం కట్టి తీసుకుపోవాలని సూచిస్తున్నారు. 

టోకెన్లు ఇచ్చినా డబ్బులు రావట్లే..

రాష్ట్రంలోని కాలేజీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేసే ముందు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (టోకెన్లు) రిలీజ్ చేస్తుంటుంది. ప్రస్తుతం కాలేజీలకు గత 11 నెలల నుంచి ఇప్పటి వరకూ రూ.1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి.

గతంలో టోకెన్ రిలీజ్ చేసిన వారంలోపే డబ్బులు రిలీజ్ అయ్యేవి. కానీ, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్​లో ఉండటంతో కాలేజీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత సర్కారు లెక్క బకాయిలు పెట్టొద్దని స్టూడెంట్లు, మేనేజ్​మెంట్లు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

బకాయిలు విడుదల చేయాలి

రాష్ట్రంలో ప్రైవేట్​ కాలేజీలకు సర్కారు ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు భారీగా ఉన్నాయి. రెండేండ్లుగా ఒక్క పైసా రాలేదు. దీంతో కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నం. అద్దె భవనాలకు రెంట్లు కట్టే పరిస్థితి లేదు. సీఎం రెడ్డి స్పందించి, మా బకాయిలు రిలీజ్ చేయాలి. 
–సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ 

నల్గొండ జిల్లాకు చెందిన ఫణికుమార్ బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2023లో పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు కావాలని వర్సిటీ అధికారులను అడిగితే.. ‘సర్కార్ నుంచి ఇంకా రూ.87 వేల ఫీజు రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది చెల్లించి తీసుకుపో’ అని చెప్పారు. సర్కార్ యూనివర్సిటీలో చదువు ఉచితమని అడ్మిషన్ తీసుకుంటే, డబ్బులు వసూలు చేయడమేంటని నిర్మల్ కలెక్టర్​కు ఫణికుమార్ ఫిర్యాదు చేశాడు. అయినా ఇప్పటికీ అతనికి సర్టిఫికెట్లు అందలేదు. 

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణి జేఎన్టీయూహెచ్​లో 2024 జనవరిలో ఎంఎస్సీ కెమిస్ర్టీ పూర్తి చేసింది. సర్టిఫికెట్ల కోసమని వర్సిటీకి వెళ్తే.. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని, వచ్చాకే ఇస్తామని అధికారులు చెప్పారు. సర్టిఫికెట్లు వెంటనే కావాలంటే రూ.40 వేల ఫీజు కట్టి తీసుకెళ్లాలని సూచించారు.  

హైదరాబాద్ సిటీకి చెందిన ఓ విద్యార్థిని జేఎన్టీయూహెచ్​లో నిరుడు ఫస్టియర్​లో జాయిన్ అయింది. ఈ ఏడాది జేఈఈలో మంచి ర్యాంకు రావడంతో, ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు వచ్చింది. ఈ నెలలో అక్కడ జాయిన్ కావాలి. సర్టిఫికెట్ల కోసం పోతే, ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు రూ.లక్ష కట్టి తీసుకుపోవాలని సూచించారు. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది.