చార్లోట్టె (నార్త్ కరోలినా) : కోపా అమెరికా టోర్నీలో కొలంబియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో కొలంబియా 1–0తో ఉరుగ్వేపై నెగ్గింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. కొలంబియా ప్లేయర్ జెఫెర్‌సన్ లెర్మా (39వ ని.) ఏకైక గోల్ చేశాడు. అయితే ఈ టీమ్ డిఫెండర్ డానియల్ మునోజ్ రెండోసారి ఎల్లో కార్డు, ఒక రెడ్ కార్డుకు గురికావడంతో అతను గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది.
ఫలితంగా సెకండాఫ్ మొత్తం కొలంబియా 10 మందితోనే ఆడినా కీలక టైమ్‌లో ప్రత్యర్థుల ఎదురుదాడులను దీటుగా ఎదుర్కొంది. దీంతో ఉరుగ్వే గోల్స్ ప్రయత్నాలు సమర్థంగా తిప్పికొట్టింది. ఇక విజయం తర్వాత కొలంబియా ఫ్యాన్స్ చేసుకున్న సంబరాలు ఉరుగ్వే ప్లేయర్లకు నచ్చలేదు. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ డార్విన్ నునెజ్‌తో సహా ఇతర ప్లేయర్లు కొలంబియా ఫ్యాన్స్‌పై దాడి చేశారు.
పిడి గుద్దులు కురిపిస్తూ నానా హంగామా చేశారు. ఆ టైమ్‌లో భద్రతా సిబ్బంది లేకపోవడంతో కొలంబియా ప్లేయర్లు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా తలపడుతుంది.