కర్నల్ మన్‌‌ప్రీత్ సింగ్‌‌కు కన్నీటి వీడ్కోలు

  • జై హింద్ నాన్నా!
  • కర్నల్ మన్‌‌ప్రీత్ సింగ్‌‌కు ఆరేండ్ల కొడుకు వీడ్కోలు
  • అంతిమ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన జనం

చండీగఢ్ :  టెర్రరిస్టులతో పోరులో వీరమరణం పొందిన తన తండ్రికి ఆరేండ్ల చిన్నారి వీడ్కోలు పలికాడు. ‘జై హింద్ నాన్న’ అంటూ ఆర్మీ సెల్యూట్ కొట్టి సాగనంపాడు. కాశ్మీర్​లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో మృతిచెందిన కర్నల్ మన్‌‌ప్రీత్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శుక్రవారం పూర్తయ్యాయి. అంతకుముందు పంజాబ్‌‌ మహాలి జిల్లాలోని సొంత గ్రామం భరావుంజైన్‌‌లో అంతిమయాత్రకు వేలాది మంది హాజరయ్యారు.

ఈ సమయంలో సైనిక దుస్తుల్లో ఉన్న కబీర్‌‌‌‌ను ఓ ఆర్మీ ఆఫీసర్ ఎత్తుకోగా, రెండేండ్ల కూతురు బన్నీని ఓ రిలేటివ్ ఎత్తుకున్నారు. మన్‌‌ప్రీత్ సింగ్ పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తర్వాత పేటికపై కబీర్ తన తల ఆనించి కొద్దిసేపు అలా ఉండిపోయాడు.

‘జై హింద్ పప్ప’ అంటూ తండ్రికి వీడ్కోలు సెల్యూట్ చేశాడు. పక్కనే ఉన్న చిన్నారి కూడా సెల్యూట్ చేసింది. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ సపూత్‌‌ (సుపుత్రుడు)కి జై’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు మారుమోగాయి. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ఆర్మీ మాజీ చీఫ్ వీపీ మలిక్, మంత్రులు చేతన్ సింగ్ జౌరామజ్ర, అన్మోల్ గగన్ మాన్, ఆర్మీ ఆఫీసర్లు, పోలీసులు, మన్‌‌ప్రీత్‌‌ టీచర్లు, వందలాది మంది ప్రజలు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.

ALSO READ: ఉదారత చాటుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం 

మరో సైనికుడు మృతి

అనంత్‌‌నాగ్‌‌లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో గాయపడిన ఓ సైనికుడు శుక్రవారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటిదాకా కర్నల్ మన్‌‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్, డీఎస్పీ హుమయూన్ భట్ చనిపోయారు. మరోవైపు బుధవారం మొదలైన సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అనంత్‌‌నాగ్‌‌లోని కోకర్‌‌‌‌నాగ్‌‌ ఫారెస్ట్ ఏరియాలో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.