- జమ్మికుంట ఆటోనగర్‌లో గత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్లాట్లను లాక్కున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
- 370 మంది లబ్ధిదారుల నోట్లో మట్టి
- డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు
జమ్మికుంట, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జమ్మికుంటలోని ఆటోనగర్ లో నిరుపేదలకు కేటాయించిన ఇందిరమ్మ ప్లాట్లను బీఆర్ఎస్ సర్కార్ లబ్ధిదారుల నుంచి బలవంతంగా లాక్కున్నది. అనంతరం ఆ ప్లాట్లను డంపింగ్ యార్డుగా, పందుల పెంపకం కేంద్రంగా మార్చేసింది. దీంతో అప్పటికే ఇళ్లు కట్టుకున్న పేదలు వాసన భరించకలేక ఇబ్బందిపడుతుండగా.. మరికొందరు ఇప్పుడు ఇళ్లు కట్టుకుందామంటే ప్లాట్లే లేవని వాపోతున్నారు. తమకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్‌ను కలిసి వేడుకుంటున్నారు.
370 మందికి ప్లాట్లు
2006--–07లో నాటి ప్రభుత్వం జమ్మికుంట ఆటోనగర్‌లో 275, 278 సర్వే నంబర్లలో సుమారు 370 నిరుపేదలకు ప్లాట్లు కేటాయించింది. ఆ టైంలో 100 మందికి పైగా లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకున్నారు. మరికొందరు బేస్‌మెంట్ లెవెల్ వరకు ఇందిరమ్మ బిల్లుల ద్వారా వచ్చే డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులను వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత పదేళ్ల కింద టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఆటోనగర్‌లో పేదల కోసం కేటాయించిన స్థలంపై ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల కన్ను పడింది.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్లాట్లను మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు బలవంతంగా లాక్కొని ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ తో పాటు, డీఆర్‌సీసీ బిల్డింగ్ నిర్మించారు. దీంతోపాటు మరో ఎకరం స్థలం పందుల పెంపకందారులకు కేటాయించారు. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. మౌలిక వసతులు కల్పించకపోయినా కొందరు ఇచ్చిన ప్లాట్లలో ఇండ్లు కట్టుకోగా.. మరికొందరు బేస్‌మెంట్ లెవెల్ వరకు కట్టి వదిలేశారు. మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇండ్లు పూర్తయినా వదిలేసి పట్టణంలో కిరాయికి ఉంటున్నారు. కాగా నిర్మాణం పూర్తికాని ప్లాట్లను బలవంతంగా లాక్కొని, బేస్‌మెంట్లను కూలగొట్టి డంపింగ్ యార్డు నిర్మించారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై లబ్ధిదారులు పలుమార్లు స్థానిక తహసీల్దార్ తో పాటు, మున్సిపల్ కమిషనర్‌ను కలిసినా పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రజావాణిలో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. మరోవైపు డంపింగ్ యార్డు, పందుల పెంపకం వల్ల వెలువడుతున్న దుర్వాసనతో ఇప్పటికే ఇండ్లు కట్టుకుని నివాసముంటున్నవారు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా తమకు కేటాయించిన ప్లాట్లను తిరిగివ్వాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
నా స్థలం బలవంతంగా లాక్కున్నారు
నిరుపేద కుటుంబానికి చెందిన మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 80 గజాల స్థలం కేటాయించింది. దాదాపు రూ.60 వేల అప్పుచేసి బేస్‌మెంట్ నిర్మించాను. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నా ప్లాటును లాక్కొని మున్సిపాలిటీ చెత్తను పారబోస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ స్థలం మీది కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. నాకు కేటాయించిన స్థలాన్ని నాకు ఇప్పించాలి.
సరోజన, లబ్ధిదారు, ఆటోనగర్