హైదరాబాద్​లో నీట మునిగిన కాలనీలు

హైదరాబాద్​లో నీట మునిగిన కాలనీలు
  • 200కు పైగా కాలనీల్లో వరదనీరు..
  • ఈదురుగాలులకు కూలిన చెట్లు.. వాహనాలు ధ్వంసం
  • రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు.. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
  • సెలవు కావడంతో అందుబాటులో లేని ఆఫీసర్లు..
  • రామంతాపూర్‌‌‌‌లో అధికారులను నిలదీసిన జనం
  • చాంద్రాయణగుట్టలో బోట్ల ద్వారా సహాయక చర్యలు
  • అత్యధికంగా సీతాఫల్‌‌మండీలో 8.6 సెంటీమీటర్ల వర్షం
  • జీహెచ్ఎంసీ, జలమండలికి భారీగా ఫిర్యాదులు
  • వరదలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌‌పై విమర్శలు‌‌

హైదరాబాద్, వెలుగు: ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఆగమాగమైంది. గంటన్నరపాటు పడ్డ వానకే చాలా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీరు చేరింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఈదురుగాలులకు కొన్నిచోట్ల చెట్లు కూలాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. రంజాన్ సందర్భంగా వరుసగా రెండ్రోజులపాటు సెలవులు కావడంతో ఆఫీసర్లు అందుబాటులో లేక సహాయక చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ, జలమండలికి వేలాది మంది ఫిర్యాదులు చేయగా.. వరదలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌‌‌‌ని పలువురు నిలదీశారు. రామంతాపూర్‌‌‌‌లో ఫీల్డ్‌‌లోకి వచ్చిన అధికారులను స్థానికులు నిలదీశారు. ఇంకెన్నేళ్లు ఇలా ఇబ్బందులు పడాలంటూ ప్రశ్నించారు. మరో రెండ్రోజులపాటు నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెల్లవారుజామున మొదలై..

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన వర్షం గంటన్నరపాటుపాటు దంచికొట్టింది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, బేగంపేట్, అల్వాల్, ఆసిఫ్‌‌నగర్‌‌‌‌, ఉప్పల్, ఓల్డ్ సిటీలోని అనేక ప్రాంతాల్లో కుమ్మరించింది. తక్కువ సమయంలోనే భారీ వర్షం కురవడంతో వరదనీరు వెళ్లేందుకు దారిలేక కొన్ని గంటలపాటు కాలనీలు నీళ్లలోనే ఉండిపోయాయి. 200 కాలనీలకుపైగా నీటిలో చిక్కుకున్నాయి. దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌‌‌లోని కోదండరాంనగర్ చెరువుని తలపించింది. చాంద్రాయణగుట్టలోని బాబానగర్‌‌‌‌లో ఒక్కసారిగా నడుం లోతు నీరు రావడంతో భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇక్కడ రెండు బోట్ల ద్వారా డిజాస్టర్‌‌‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బేగంపేట్‌‌లోని మయూరిమార్గ్ లో ఉదయం 9 గంటల వరకు జనం ఇండ్లకే పరిమితమయ్యారు. తర్వాత నీరు తగ్గడంతో బయటకు వచ్చారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో పోలీసులు ట్రాఫిక్‌‌ని మళ్లించారు.

వందకు పైగా చెట్లు కూలినయ్

గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలో భారీ వర్షానికి వందకుపైగా చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు పడి కార్లు, బైక్‌‌లు ధ్వంసమయ్యాయి. వనస్థలిపురంలోని హుడా సాయి నగర్‌‌‌‌లో విద్యుత్ స్తంభంపై చెట్టు కూలింది. ఇక్కడి కమలానగర్‌‌‌‌లో చెట్టుకొమ్మలు రెండు కార్లపై పడ్డాయి. ఇదే కాలనీలో విద్యుత్ స్తంభం కూలింది. గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో.. ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పద్మారావునగర్, అభినవ్‌‌నగర్, బోయిగూడ ప్రాంతాల్లో రోడ్లపై చెట్లుకూలాయి. శాస్ర్తిపురం, వెస్ట్ మారేడ్‌‌పల్లి తదితర ప్రాంతాల్లో చెట్లు కూలడంతో కార్లు ధ్వంసమయ్యాయి. వనస్థలిపురంలోని కాకతీయ కాలనీలో ఓ బైక్ వరదలో కొట్టుకుపోయింది. అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌లోని లష్కర్‌‌‌‌గూడలో ఇండ్లపై రేకులు కూలిపోయాయి. ఇదే ప్రాంతంలో ఓ ఇంటిపై ఉన్న హోర్డింగ్ ఫ్రేమ్ కూలింది. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ఆర్టీసీ బస్సు నీటిలోనే చిక్కుకుంది. ఫ్లై ఓవర్ ఎక్కే మార్గంలో రోడ్డు కుంగిపోయి ఆ గుంతలో కారు చిక్కుకుంది. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేశ్‌‌ మండపానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై సాయంత్రం దాకా నీరు తొలగలేదు. చిక్కడపల్లి మెయిన్ రోడ్డు, బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద మోకాళ్లలోతు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బషీర్‌‌‌‌బాగ్ పోలీసు కమిషనరేట్ దగ్గర ఉదయం 9 దాటినా ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభించలేదు. అత్తాపూర్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌‌లోని ఫాల్ సీలింగ్ కుప్పకూలింది. పైకప్పు ఊడి పడడం వల్ల స్టేషన్ లోపలికి వర్షపునీరు వచ్చింది. దీంతో స్టేషన్‌‌లోని కీలక దస్తావేజులతోపాటు కంప్యూటర్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సెక్రటేరియట్ దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసులో పాత గోడలు కూలాయి.