వరంగల్ ముంపు కాలనీల్లో ఇళ్లకు తాళాలు

  • ఎన్‍టీఆర్‍ కాలనీలో నడుంలోతు నీరు 
  • ఆరెంజ్‍ అలర్ట్ ప్రకటించిన అధికారులు 
  • టెన్షన్​ పడుతున్న జనాలు 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ వరదగల్లుగా మారింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన చిన్నపాటి వానకే  సుమారు 20 కాలనీలు నీట మునిగాయి. వరంగల్‍ రైల్వేస్టేషన్‍ దగ్గర్లోని ఏడెనిమిది కాలనీలు అతలాకుతలమయ్యాయి. నడుంలోతు వరదనీరు చేరడంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. వాన ఆగి రెండు రోజులు దాటుతున్నా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా అధికారులు నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆరెంజ్​అలర్ట్​జారీ చేయడంతో జనాలు వణికిపోతున్నారు.  
నడుంలోతు నీటిలో..ఎన్‍టీఆర్‍ నగర్‍
వరంగల్​లోని ఎన్‍టీఆర్‍ నగర్‍లోకి నడుంలోతు వరదనీరు చేరడంతో 150 మంది బాధితులు ఇండ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఉప్పు,పప్పులు, వస్తువులు, బట్టలు బురదమయం కావడంతో రంది పెట్టుకున్నారు. బీఆర్‍ నగర్‍, డీకే నగర్‍, మైసయ్యనగర్‍, హంటర్‍రోడ్‍, సాయి నగర్‍, సంతోషిమాత కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బృందావన్‍ కాలనీ, గాయత్రి నగర్‍, శివనగర్‍, పెరకవాడ, ఎనుమాముల మధురా నగర్‍, ఎస్సార్‍ నగర్‍, సాయి గణేశ్‍ కాలనీ, లక్ష్మిగణపతి కాలనీ, ఉర్సు, శాంతినగర్‍.. హన్మకొండలోని సమ్మయ్య నగర్‍, గోపాల్‍పూర్‍, పోచమ్మకుంట, నయీంనగర్‍, జంగా భద్రయ్య కాలనీ, ఎల్‍.వెంకట్రామయ్య కాలనీ.. కాజీపేటలోని బూడిదిగడ్డ, భవానీ నగర్‍లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. 

బొందివాగు నాలా మూయడంతో..
వరంగల్‍, కాజీపేట మధ్య మూడో రైల్వే లైన్‍ బొందివాగు వద్ద పనులను సకాలంలో పూర్తి చేసేలా చొరవ తీసుకోవడంలో బల్దియా పాలకవర్గం ఫెయిలయ్యింది. పాత సరోజ టాకీస్‍ వద్ద 12 మోరీల నాలా వద్ద ఎప్పటినుంచో పనులు జరుగుతున్నాయి. ఖిల్లా వరంగల్‍ అగర్త,  స్తంభంపల్లి, శివనగర్‍, వరంగల్‍ అండర్‍ బ్రిడ్జి, పెరకవాడ, రైల్వే గేటు నుంచి వచ్చే వరద 30 నుంచి 40 అడుగుల వెడల్పు ఉండే కచ్చా నాలా నుంచి బయటకు వెళ్లేది. కాగా, ట్రాక్‍ పనుల పేరుతో దీనిని 10 అడుగులకు కుదించడంతో నీరు బయటకు వెళ్లే దారిలేక శివనగర్‍, పెరకవాడ జలమయ్యాయి. బొందివాగు వద్ద ట్రాక్‍ అవతల నుంచి బయటకు వచ్చే వరద నీరుపోయే నాలాను మూసేశారు. పైనుంచి వచ్చే వరదకు తోడు భట్టుపల్లి, ఉర్సు మీదుగా వచ్చే వరద ఆగిపోయింది. దీనికితోడు ఖమ్మం బ్రిడ్జి ప్రాంతంలో గతంలో వాననీరు నాలా వద్దకు డైరెక్ట్​గా వచ్చేది. ప్రస్తుతం ఈ ఏరియాల్లో ప్లాట్ల యజమానులు ప్లాట్ల చుట్టూ గోడ కట్టుకోవడంతో వరద పోయే చిన్న నాలా ఇరుకుగా మారింది. వర్షాకాలం నేపథ్యంలో రైల్వే అధికారులతో మాట్లాడామని.. జూన్‍ వరకే నాలాకు అడ్డుగా ఉన్న ప్రాంతాన్ని ఓపెన్‍ చేస్తామన్న బల్దియా ఆఫీసర్లు ఆ తర్వాత లైట్‍ తీసుకున్నారు. మంగళవారం వానకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు హడావుడిగా జేసీబీతో అడ్డుగా ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. దీంతో రైల్వై ట్రాక్‍ వద్ద బొందివాగు పొంగి పదుల సంఖ్యలో కాలనీలు మునిగాయి.

ఆరెంజ్‍ అలర్ట్​తో మరింత టెన్షన్‍ 
మంగళవారం రాత్రి వాన కురవగా ఆ వరద ఇంకా ప్రవహిస్తోంది. పదుల సంఖ్యలో కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో భారీ వానలుంటాయని ఆరెంజ్​అలర్ట్​ప్రకటించడంతో ఆ ధాటికి మరిన్ని కాలనీలు మునిగే అవకాశం ఉంటుంది. దీంతో నగరవాసులు భయడుతున్నారు. అయితే వరద బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన అధికారులు..కేవలం 40, 50 మందికి షెల్టర్‍ ఇవ్వడానికి హైరానా పడ్డారు. గతంలో వారు చెప్పిన షెల్టర్‍ స్పాట్లు (ఫంక్షన్‍ హాల్స్) ప్రస్తుతం పెళ్లిళ్ల నేపథ్యంలో ఖాళీగా లేవు. దీంతో రామన్నపేటలోని ఓ మర్వాడీ ఫంక్షన్‍హాల్‍ యజమానుల సహకారంతో బాధితులకు వసతి కల్పించారు. సమస్య తీవ్రత పెరిగి మరింత మంది బాధితులు వస్తే ఏం చేస్తారో అధికారులకు కూడా తెలియడం లేదు.