ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో మున్నేరు వరద కారణంగా మునిగిపోయిన కాలనీ వాసులు ఇంకా నష్టం బాధ నుంచి కోలుకోలేదు. మంగళవారం కూడా ఇండ్లలో పేరుకుపోయిన బురదను క్లీన్ చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, పాడైపోయిన ఇంటి సామాన్లను బాగు చేసుకుంటూ కనిపించారు. వరదల్లో కొట్టుకువచ్చిన చెత్తను క్లీన్ చేసుకున్నారు. జేసీబీల ద్వారా కూలిన చెట్లను తొలగించుకున్నారు.
ఏ మున్నేరు వరదతో సర్వం కోల్పోయారో, మళ్లీ అదే మున్నేరులో బట్టలు ఉతుకున్నారు. ఎఫ్సీఐ గోడౌన్ రోడ్డులో నిలిపివుంచిన వందలాది లారీలు కూడా
ఆదివారం నాటి వరదలో మునిగిపోయాయి. దీంతో ఆ లారీల్లో ఇంజన్ ఆయిల్ మార్చుకుంటూ, బాగుచేసుకునే ప్రయత్నాల్లో బాధితులున్నారు.
మరోవైపు ముంపు కాలనీల వాసులకు మంచినీటిని అందించేందుకు వరద ప్రభావంలేని గ్రామాల నుంచి మంచినీటి ట్రాక్టర్లను తెప్పించిన అధికారులు, వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పారిశుధ్య పనుల కోసం జిల్లాలోని ఇతర గ్రామ పంచాయతీల నుంచి సిబ్బందిని రప్పించి, ముంపు కాలనీల్లో బాధ్యతలు అప్పగించారు.