- బెంగళూరు నుంచి సీడ్ తెచ్చి సాగుచేసిన రైతు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో కలర్ పుచ్చకాయలు ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామానికి చెందిన రైతు బండారి వెంకటేశ్ వీటిని సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నాడు. వేసవిలో అధిక డిమాండ్ ఉండే వాటర్ మిలన్, మస్క్ మిలన్ పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బెంగుళూరు నుంచి సరికొత్త సీడ్స్ తెప్పించి కలర్ పుచ్చకాయలు సాగుచేస్తున్నాడు. వీటిని స్థానికులతోపాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు.
బెంగుళూరు నుంచి సీడ్
మొదట్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వైపు మాత్రమే పండించే కిరణ్, సరస్వతి, ఆరోహి(యెల్లో వాటర్‌మిలన్), విశాల వంటి రకాలను వెంకటేశ్ జగిత్యాలకు పరిచయం చేశారు. వాటితో పాటు మస్క్ మిలన్ సాగు చేస్తున్నాడు. మస్క్ మిలన్ రకం సీడ్స్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నాడు. వీటి ధర మిగిలిన రకాలతో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉంది. అయితే దీని సాగుకు ఖర్చు, శ్రమ తక్కువ ఉండడంతో నాలుగేళ్లుగా ఈ రకం పుచ్చకాయ సాగు చేస్తున్నట్లు వెంకటేశ్చెబుతున్నాడు. ఎకరాకు పెట్టుబడి ఖర్చులు పోనూ రూ. 1.50 లక్షలు లాభం వస్తున్నట్లు చెప్పాడు.