ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆసిఫాబాద్ ,వెలుగు: ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు కృషి చేస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్​లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు భూసమస్యలు, ఆసరా పింఛన్లు, డబుల్​బెడ్రూం ఇండ్లు కేటాయించాలని కలెక్టర్​కు అర్జీలు అందించారు. 

మేడమ్.. పట్టాలు ఇప్పించండి 

మంచిర్యాల, వెలుగు: 'మా గ్రామస్తులం 1960 నుంచి భూములు సాగు చేసుకుంటున్నం. ఇంతవరకు మాకు పట్టాలు లేవు. మేడమ్​... మీరన్నా దయతలిచి పట్టాలు ఇప్పియ్యున్రి' అని చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్​ భారతి హోళికేరికి విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​ సెల్​లో కలెక్టర్​ ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురు కలెక్టర్​ఫిర్యాదులు అందించారు. అడిషనల్​ కలెక్టర్​ రాహుల్​, ట్రైనీ కలెక్టర్​ గౌతమి పాల్గొన్నారు. 

అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ అన్నారు. సోమవారం కలెక్టర్​ మీటింగ్​ హాల్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను కలెక్టర్​కు విన్నవించగా వెంటనే సంబంధిత శాఖల అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్​రాథోడ్, డీఆర్డీవో కిషన్ పాల్గొన్నారు.

పెరిగిన రేట్ల జీవో విడుదల చేయాలి

కలెక్టరేట్ ఎదుట హమాలీల ధర్నా

ఆసిఫాబాద్ ,వెలుగు: సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు  పెంచిన ధరల ఒప్పందాన్ని అమలుచేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ హమాలీలు సోమవారం కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. ఒప్పందం ప్రకారం జీవోను విడుదల చేసి అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగి ఉపేందర్ డిమాండ్ చేశారు.  సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14 నుంచి సమ్మెకు వెళ్తామని అదనపు కలెక్టర్​రాజేశం, సివిల్ సప్లై ఇన్​చార్జి డీఎం తారామణికి నోటీసు అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్,హమాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కుమార్, కార్యదర్శి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో.. 

మంచిర్యాల, వెలుగు: ఈ ఏడాది జనవరి నుంచి సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెరిగిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో ఏవో సురేశ్​కు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 14 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఖలిందర్​ అలీఖాన్​, హమాలీలు సత్యనారాయణ, సత్తయ్య, చంద్రశేఖర్​, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 

లిక్కర్​ స్కామ్​తో రాష్ట్ర  గౌరవం మంటగలిసింది: బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్​ కుతూరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్​ స్కామ్​తో రాష్ట్ర గౌరవాన్ని మంటగలిపారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో జిల్లా మహిళా మోర్చా విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మహిళల అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి నిధులను మంజూరు చేస్తే.. ఆ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారిమళ్లించి సొంత లాభాలకు వాడుకుంటోందని విమర్శించారు. సమావేశంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్యామల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరుణ, జిల్లా అధ్యక్షులు ధోని జ్యోతి, జిల్లా ఇన్చార్జి సుహాసినీరెడ్డి, ఉమామహేశ్వరి, సర్పంచ్ ఉజ్వల, శ్యామల, భాగ్యలక్ష్మి, పద్మ, పాల్గొన్నారు.

డ్యూటీలకు రాకపోతే  ఉద్యోగాలకు ఇబ్బంది: మందమర్రి ఏరియా జీఎం శ్రీనివాస్

మందమర్రి, వెలుగు: సింగరేణి ఎంప్లాయిస్​ డ్యూటీలకు రాకుండా  నాగాలు చేస్తే ఉద్యోగ భద్రతకు ఇబ్బందవుతుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మందమర్రిలోని సీఈఆర్​ క్లబ్​లో గైర్హాజర్ ఎంప్లాయిస్ కు కౌన్సెలింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా 2022 జనవరి నుంచి నవంబర్​ వరకు  ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్​లలో ఆబ్సెంట్​అయిన 210 మందిలో 102 మంది ఎంప్లాయిస్​, వారి కుటుంబసభ్యులతో  ఏరియా జీఎం, ఆయన సతీమణి, సింగరేణి సేవా సమితి ప్రెసిడెంట్​ లక్ష్మీ మాట్లాడారు.

రానున్న మూడు నెలల్లో ప్రతి నెలకు 20 మస్టర్లు చేయాలని లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించే చాన్స్​ ఉందని జీఎం పేర్కొన్నారు. కౌన్సెలింగ్​లో ఏరియా ఏస్వోటూజీఎం సీహెచ్.కృష్ణారావు, కేకే, ఎస్​కే, కాసీపేట గ్రూప్​ గనుల ఏజెంట్లు రాందాస్​, విజయ్​కుమార్​, రాజేందర్​, పర్సనల్​ డిపార్ట్​మెంట్​ హెచ్​ఓడీ శ్యాంసుందర్​ పాల్గొన్నారు.   అనంతరం మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​ స్టూడెంట్ల కోసం  సోమవారం బస్సు సౌకర్యాన్ని జీఎం శ్రీనివాస్  ఓ స్టూడెంట్​తో కలిసి ప్రారంభించారు. 

శనగ పంట కొనాలని..

కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ప్రభుత్వం శనగ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు కలెక్టరేట్​ను ముట్టడించారు.  ఈ సందర్భంగా కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు.  రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి 6  క్వింటాళ్ల 75 కిలోల పంటను మాత్రమే కొనుగోలు చేయడం సరికాదన్నారు. దిగుబడి ఎక్కువ వస్తున్న క్రమంలో మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడంతో నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూత్​ కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ రూపేశ్​రెడ్డి, నాయకులు, రైతులు  వెంకట్, మల్లయ్య, రాజు, చంద్రకాంత్ పాల్గొన్నారు.