ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​లో భూసమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్​ భారతి హోళికేరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి పిటిషన్లు తీసుకున్నారు. కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన నిట్టూరి మధుకర్, మహేశ్, లక్ష్మణ్, లక్ష్మి తాము గ్రామ గ్రామ శివారులోని భూమి తరతరాలుగా సాగు చేసుకుంటున్నామని, కొందరు ఆక్రమించి ప్లాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన గుమ్ముల రామయ్య తన భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దానిని రద్దు చేయాలని కోరాడు.

బెల్లంపల్లి మండలం చొప్పరపల్లికి చెందిన గోమాస భీమయ్య ప్రభుత్వం పోడు భూములకు దరఖాస్తు చేసుకోమని చెప్పిన సమయంలో అనారోగ్య పరిస్థితులతో  చేసుకోలేదని, తన భూమిని ఇతరులు వారి పేరిట ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారని, తిరిగి తన పేరిట మార్పు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. జన్నారం మండలం కొత్తపేటకు చెందిన రైతులు తమ గ్రామంలో పోడు భూముల సర్వే సమయంలో అధికారులు 2011 గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్​ను తీసుకువచ్చి మా భూములను నాన్ రికమెండ్ అని రాశారని, వివరాలను సవరించి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ భారతీ హోళికెరి ఆఫీసర్లను ఆదేశించారు.

అర్జీలు పెండింగ్​లో ఉంచకూడదు...

ఆదిలాబాద్, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, భూసమస్యలు, ఉపాధి, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం లబ్ధిదారులు పెద్దఎత్తున అర్జీలు చేసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీవో కిషన్ తదితరులు ఉన్నారు.

డీటీడబ్ల్యూవో ఆఫీసు ఎదుట ఆందోళన

మంచిర్యాల,వెలుగు: కొన్ని నెలలుగా తన శాలరీ బిల్స్ చేయకుండా డీటీడబ్ల్యూవో నీలిమ ఇబ్బంది పెడుతున్నారని జూనియర్​అసిస్టెంట్ ప్రదీప్​కుమార్​ సోమవారం ట్రైబల్ వేల్ఫేర్ ఆఫీసు వద్ద భార్యాపిల్లలతో కలిసి ఆందోళన చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు వస్తే అధికారి అందుబాటులో లేరంటూ డీటీడబ్ల్యూవో చాంబర్​కు తాళం వేశాడు. సమాచారం అందుకున్న ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్​రెడ్డి మంచిర్యాల చేరుకొని ప్రదీప్​ కుమార్ గురించి ఎంక్వయిరీ చేశారు. అతడు కొన్ని నెలలుగా సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నందునే శాలరీ బిల్స్​ చేయలేదని డీటీడబ్ల్యూవో నీలిమ తెలిపారు. ప్రదీప్​కుమార్​పై పోలీసులకు కంప్లైంట్​ చేశామని, కేసు నమోదు అయ్యిందని వివరించారు.

నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్​ల పంపిణీ

కాగ జ్ నగర్,వెలుగు: సిర్పూర్ పేపర్ మిల్​కు చెందిన స్పర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చింతగూడ గవర్నమెంట్​స్కూల్​ విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి డీఈవో అశోక్ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఎస్పీఎం కంపెనీకి సామాజిక దృక్పథం, సేవాభావం కలిగి ఉండడం అభినందనీయమన్నారు. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో  ఎస్పీఎం వైస్​ప్రెసిడెంట్​అనిల్ కుమార్ మిశ్రా, జనరల్ మేనేజర్ ఎంఎస్​గిరి, ఎంఈవో గడ్డం భిక్షపతి, హెచ్ఎం లక్ష్మీనారాయణ, సర్పంచ్ సంజీవ్, పేపర్ మిల్ స్టాఫ్ శశికాంత్ బోడే, తుమ్మ రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీలకు అండగా ఉంటాం

తిర్యాణి,వెలుగు: ఆదివాసీలకు అండగా ఉంటామని ఎస్పీ సురేశ్ కుమార్  హామీ ఇచ్చారు. పోలీసుల  ఆధ్వర్యంలో గుండాల గ్రామంలో నిర్మిస్తున్న ఏడు కిలో మీటర్ల రోడ్డును సోమవారం ఆయన పరిశీలించారు. రోడ్డు అందుబాటులోకి వస్తే ఏడు గూడేలకు చెందివారికి విద్య, వైద్యం అందుతుందన్నారు. గ్రామాల్లో గంజాయి సాగుచేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక శక్తులకు గ్రామాల్లో అవకాశంలేదన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. రోడ్డు పనులకు సహకరిస్తున్న ట్రాక్టర్స్ యూనియన్, సింగరేణి యాజమాన్యం, గుండాల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ అల్లం నరేందర్, ఎస్సై చుంచు రమేశ్ ఉన్నారు.

రోడ్డు వెడల్పు పనులు కంప్లీట్​ చేయండి

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ లో  జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ  లీడర్లు డిమాండ్​చేశారు. సోమవారం పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన జరుగుతున్నాయన్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్​ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నిరసనలో పీసీసీ కార్యవర్గ సభ్యులు వెడ్మా బొజ్జు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, కౌన్సిలర్ కిశోర్ నాయక్,  పార్టీ మండల అధక్ష్య, కార్యదర్శులు దయానంద్, షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, లీడర్లు జహీర్, సత్యం, గంగ నర్సయ్య, రాజేందర్, గంగాధర్, సలీంఖాన్, శెట్టి శ్యామ్ రావు, సాబీర్, నేత శ్యామ్,  రాజేశ్వర్, శంకర్  తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా నేషనల్ అచీవ్​మెంట్​ సర్వే

ఆదిలాబాద్,వెలుగు: నేషనల్ అచీవ్​మెంట్​సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ఎన్ఏఎస్ పై విద్యాశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యం అంచనా వేయడానికి మంగళవారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3, 5వ తగరగతుల విద్యార్థులకు ఉదయం10.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‍, గణితం సబ్జెక్టులపై 45 ప్రశ్నలు ఉంటాయన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆదిలాబాద్, నిర్మల్ డీఈవోలు ప్రణీత, రవీందర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు నర్సయ్య, సుజత్ ఖాన్  పాల్గొన్నారు.