ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్​/మంచిర్యాల/ఆదిలాబాద్​ టౌన్​/ఆసిఫాబాద్​, వెలుగు: రైతులను కేంద్రంలోని మోడీ సర్కార్​దగా చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కల్లాలకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్​ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. నిర్మల్​లో జరిగిన కలెక్టరేట్​ఎదుట జరిగిన ఆందోళనలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు.

నిరసనలో జిల్లాలోని ఎమ్మెల్యేలు విఠల్​రెడ్డి, అజ్మీర రేఖానాయక్, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, అంకం రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామే శ్వర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ టౌన్  ప్రెసిడెంట్ మార్గొండ రాము తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్​లో జరిగిన నిరసనలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జడ్పీ కో ఆప్షన్​మెంబర్ తాహెర్​ బిన్​సలామ్, రుక్మాన్​సింగ్, భాస్కర్​రెడ్డి, చట్ల ఉమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​లో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్పా, ఆత్రం సక్కు, జడ్పీ చైర్​పర్సన్​కోవ లక్ష్మి, జడ్పీటీసీ జిల్లా ఫోరం అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్, ఎంపీపీ మల్లికార్జున్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కలాం, మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి 

లోకేశ్వరం, వెలుగు: డ్యూటీకి ఆలస్యంగా వస్తూ... గంట ముందుగానే వెళ్లిపోతున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం లీడర్లు డిమాండ్​ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్​ఆఫీస్​ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ ప్రసాద్​కుమార్​మాట్లాడుతూ శుక్రవారం నాలుగు గంటలకు కార్యాలయాన్ని సందర్శిస్తే తహసీల్దార్​ఆఫీస్​లో  ఒక జూనియర్ అసిస్టెంట్ మినహా ఏ ఒక్క ఆఫీసర్​డ్యూటీలో లేరన్నారు.

పక్కనే ఉన్న ఎంపీడీవో  ఆఫీస్​లో కూడా ఇదే తీరు కొనసాగుతోందని  ఆరోపించారు. కలెక్టర్​ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్యులకు అందుబాటులో లేని ఆఫీసర్లు ఎందుకని ప్రశ్నించారు. నిరసనలో  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు  గైని మురళీమోహన్, జిల్లా కార్యదర్శి టి.ముత్తన్న, సంఘం సీనియర్ లీడర్​దుర్గం పోశలింగం తదితరులు పాల్గొన్నారు.

డి1 పట్టాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు, బంధువులు డి1 పట్టాల పేరిట చేసిన అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని బీజేపీ లీడర్లు డిమాండ్​చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. ఆర్టీఏ యాక్ట్​ద్వారా సేకరించిన వివరాలను అందించారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దపల్లి  జిల్లా ఇన్ చార్జి రావుల రామ్​నాథ్, పార్లమెంట్​ఇన్​చార్జి అయ్యన్న గారి భూమయ్య, లీగల్ సెల్ బాధ్యుడు అంజు కుమార్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సాదం అర్వింద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాగర్, జిల్లా కార్యదర్శి విలాస్ తదితరులు మాట్లాడారు.

జిల్లాలో పెద్ద ఎత్తున్న భూకబ్జాల దందా సాగు వ్యవహారం సాతుందోందన్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడితో నకిలీ డి వన్ పట్టాలు సృష్టించి వందల ఎకరాలు కబ్జాచేశారని ధ్వజమెత్తారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ  లీడర్లు మురళి, ఉంగరాల రాజు, నరేందర్, శ్రీరామోజు నరేశ్, ప్రవీణ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

విశ్వనాథ ఆలయం ఎదుట వానరసేన ధర్నా 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం ఎదుట రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్​రావు మాట్లాడుతూ ఆలయంలోని పలు నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయని, రినోవేషన్​కు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. నాలుగు రోజుల కిందట వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఒక భక్తురాలపై స్లాబ్ కూలడంతో గాయాలయ్యాయని తెలిపారు. నిర్మల్​ జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయానికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి రూ.11 కోట్లు కేటాయించుకున్నారని, విశ్వనాథ ఆలయానికి నిధులు ఇచ్చేందుకు మాత్రం ఆయనకు మనసు రావడంలేదని విమర్శంచారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు సైతం నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. నాయకులు ఆకుల అశోక్, బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్​రావు, లింగన్నపేట విజయకుమార్, సోమ ప్రదీప్​చంద్ర పాల్గొన్నారు.  

ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలి

బెల్లంపల్లి,వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రతిపక్షపార్టీల లీడర్లు చేస్తున్న నిరాధార ఆరోపణలను సోషల్ మీడియా సైనికులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ పిలుపునిచ్చారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, లీడర్లు శ్రావణ్, మహేశ్ గౌడ్, ఉపాధ్యక్షుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు.  

ఘనంగా సింగరేణి డే

సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ​ సింగరేణి ఏరియాలు, జైపూర్​ సింగరేణి థర్మల్ పవర్​ ప్లాంట్​, బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై జరిగిన సంబరాల్లో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి  ఏరియాల జీఎం దంపతులు  చింతల శ్రీనివాస్ -లక్ష్మి, బి.సంజీవరెడ్డి-రాధాకుమారి, దేవేందర్- స్వరూపరాణి​ సింగరేణి జెండాలను ఆవిష్కరించారు. జైపూర్​ ఎస్టీపీపీలో సీటీసీ సంజయ్​సూర్​, జీఎం సూర్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మందమర్రిలో పుష్ప ఫేమ్​సింగర్​మౌనిక్​యాదవ్​ పాడిన పాటలు అలరించాయి.   - మందమర్రి/ఆసిఫాబాద్/నస్పూర్/జైపూర్,వెలుగు