ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​జిల్లాలో టూరిజం అభివృద్ధిలో భాగంగా స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్​హౌస్​ను తొలగించి  రూ.12 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేపడుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అనేక పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు ఉన్నాయన్నారు. వీటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోందన్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున హరిత హోటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలో టెండర్​ప్రక్రీయ పూర్తవుతుందని వివరించారు.

జిల్లాకే తలమానికంగా హరిహర క్షేత్రం...

మల్లన్న గుట్టపై  నిర్మించిన హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయం జిల్లాకే తలమానికంగా నిలుస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి  దంపతులు, కుటుంబ సభ్యులు ఆలయంలో పూజలు నిర్వహించారు. శబరిమలై ఆలయ ప్రధాన అర్చకులు పరమేశ్వరన్ నంబూద్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రజతోత్సవ వేడుకల్లో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరిహర క్షేత్రం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు అల్లోల్ల గౌతమ్ రెడ్డి, దివ్యారెడ్డి, ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి వినోదమ్మ, అల్లోల నితీశ్​రెడ్డి దంపతులు ఇతర కుటుంబ సభ్యులు 
పాల్గొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలె

ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్, వెలుగు: రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణంలో రైతులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ధరణి పోర్టల్ కారణంగా చాలామంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత వరకు రుణమాఫీ కాలేదన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేసీఆర్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఫైర్ అయ్యారు. కుమ్రంభీం  ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎకరం భూమి కూడా సాగులోకి రాలేదన్నారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. 

ఇయ్యాల ఏకలవ్య మోడల్​ స్కూల్​ ప్రారంభం

కాగజ్ నగర్,వెలుగు: కాగజ్ నగర్​ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ను బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు ఐటీడీఏ పీవో వరుణ్​రెడ్డి తెలిపారు. భద్రాచలం నుంచి రాష్ట్రపతి ముర్ము వర్చువల్ పద్ధతిలో రెసిడెన్షియల్​స్కూల్​ను ప్రారంభిస్తారన్నారు. ఫస్ట్​ఫేస్​లో వసతి గృహం, క్లాస్​ రూమ్, టాయిలెట్స్, కంపౌండ్ వాల్​పూర్తయినట్లు పీవో వివరించారు. ఇది ఇలాఉంటే తమకు రావాల్సిన రూ.20 లక్షలు కాంట్రాక్టర్​ఎగ్గొట్టాడని కూలీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. డబ్బులు ఇప్పించేందుకు కృషిచేస్తామని పీవో వరుణ్​రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఉత్తమ స్టేషన్​గా ఆదిలాబాద్​ వన్ టౌన్ 

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్​గా ఆదిలాబాద్​ వన్​టౌన్​స్టేషన్ ఎంపికైంది. ఈమేరకు మంగళవారం వన్​టౌన్ సీఐ కె.సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ డి.ఉదయ్​కుమార్​ రెడ్డి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా17 వర్టికల్స్​లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లలో ఆదిలాబాద్ వన్​టౌన్​ పోలీస్ స్టేషన్ మూడు క్టస్లర్ల విభాగంలో ఉత్తమంగా నిలిచిందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్సీ ఎస్. శ్రీనివాసరావు, డీఎస్పీ వి.ఉమేందర్, సీసీ దుర్గం శ్రీనివాస్ 
పాల్గొన్నారు.

‘ఎమ్మెల్యే మోసం చేసిండు’

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసీలను నమ్మించి మోసం చేశాడని జడ్పీ మాజీ చైర్​పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆరోపించారు. మంగళవారం మాలెబోరిగావ్​కు గ్రామానికి చెందిన బీఆర్ఎస్​లీడర్లు గెడం లీలావతి, రాము దంపతులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుహాసినిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రామన్న ఆదివాసీలకు మార్కెట్​చైర్మన్​పదవి ఇస్తానని ఇవ్వలేదని, దీంతో మార్కెట్​డైరెక్టర్​పదవీ, బీఆర్ఎస్​ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి బీజేపీలో చేరినట్లు లీలావతి రాము దంపతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడర్లు క్రాంతి కుమార్, మోహన్ అగర్వాల్, సతీశ్​రెడ్డి, కిరణ్ చాకటి, అనూప్ తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీ స్కూల్​ తనిఖీ

నేరడిగొండ,వెలుగు: నేరడిగొండ కేజీబీవీ స్కూల్​ను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో వరుసగా ఫుడ్​పాయిజన్​అయిన కారణంగా కలెక్టర్​ స్కూల్​ను విజిట్​చేసి సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం వంటగది, డైనింగ్​స్టోర్ రూమ్​లను పరిశీలించారు. అన్నం, పప్పు రుచిచూశారు. స్థానికంగా ఉండి సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సెక్టోరియల్​ఆఫీసర్​ఉదయశ్రీని ఆదేశించారు. 

ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారించాలనే ఉద్దేశంతోనే ప్రతీ మంగళవారం ‘పుర ప్రజావాణి’ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. మంగళవారం మున్సిపల్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పుర ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వివిధ సమస్యలపై 27 అర్జీలు రాగా మూడు అప్పటికప్పుడే పరిష్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.

ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో మిషన్ భగీరథ పథకాన్ని సక్రమంగా అమలు చేయని ఆఫీసర్లు, కాంట్రాక్టర్ పై  చర్యలు తీసుకోవాలని ఆ  వార్డు బీజేపీ కౌన్సిలర్  నాయిని స్రవంతి డిమాండ్ చేశారు. మంగళ వారం నిర్మల్ లో  లోకల్ బాడీస్​అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడేకు వినతి పత్రం అందజేశారు. 

జరిగితే కలెక్టర్​దే బాధ్యత

ఇచ్చోడ,వెలుగు: హాస్టళ్లలో చదివే పేద విద్యార్థులకు ఏమైనా జరిగితే  కలెక్టరే బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేశ్ ​మాదిగ ఫైర్​అయ్యారు. మంగళవారం ఇచ్చోడలో మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్న డీడీ, ఆర్ సీవో, డీసీవో, డీఈవో స్పెషల్ ఆఫీసర్లు విధులు విస్మరిస్తున్నారని ఆరోపించారు.  ఫలితంగా విద్యార్థులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ మండల ఇన్​చార్జి బరుకుంట సుభాష్ మాదిగ,  మండల అధ్యక్షుడు చిట్టిరవి మాదిగ, పట్టణ అధ్యక్షుడు దుబ్బాక చందు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి మోదుగు వెంకటేశ్​మాదిగ, అధికార ప్రతినిధి సుంకె అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు మచ్చ నగేశ్​మాదిగ, ప్రధాన కార్యదర్శి మసీదు నందు మాదిగ  పాల్గొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు రైతులను మోసం చేస్తున్నాయి​

ఆదిలాబాద్,వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలు రైతులను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ మంగళవారం సీసీఐ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో లీడర్లు వెంకట్ రెడ్డి, ఆరె పోచన్న, శాంతన్ రావు, మల్లయ్య, నర్సింగ్, ప్రభాకర్ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు.

డబుల్​ బెడ్​ రూమ్​ఇండ్లు ఎప్పుడిస్తరు?

బెల్లంపల్లి,వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇంకెప్పుడు ఇస్తరని బీజేపీ అసెంబ్లీ ఇన్ చార్జి కొయ్యల ఏమాజీ ప్రశ్నించారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూమ్​ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే చేతకాని తనంవల్లే ఇండ్ల నిర్మాణం పూర్తికాలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూలాల్, లీడర్లు అజ్మీరా శ్రీనివాస్, ప్రకాశ్​, శ్రావణ్, నర్సింగ్, నవీన్, అరుణ్ పాల్గొన్నారు. 

ఇది పీఎస్సార్​ అడ్డా... 'గోమాస’ గో బ్యాక్

మంచిర్యాల/నస్పూర్​,వెలుగు: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత మరోసారి కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గోమాస శ్రీనివాస్​ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల పీసీసీ జనరల్​ సెక్రటరీగా నియమితులైన గోమాస శ్రీనివాస్​ మంగళవారం మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయన వర్గీయులు, మద్దతుదారులు భారీ స్వాగత ర్యాలీ, సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. జైపూర్​ మండలం ఇందారం నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు వందల సంఖ్యలో బైక్​లు, కార్లతో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ కేవీ.ప్రతాప్​, గుమ్ముల శ్రీనివాస్​తో పాటు నేతకాని కుల సంఘాల నాయకులు ఆయన వెంట ఉన్నారు. ర్యాలీ శ్రీరాంపూర్​ బస్టాండ్​ దగ్గరికి చేరుకోగానే అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పీఎస్సార్​ వర్గీయులు కొంతం రమేశ్, నూకల రమేశ్​​, రఘునాథ్​రెడ్డి, పూదరి తిరుపతి, బండారు సుధాకర్, సురిమిళ్ల వేణు తమ అనుచరులతో అడ్డుకున్నారు.

'ఇది ప్రేమ్​సాగర్​రావు అడ్డా... సార్​ పర్మిషన్​ లేకుండా ఎవరూ అడుగుపెట్టడానికి వీళ్లేదు... డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మకు సమాచారం లేకుండా ఎట్ల ర్యాలీ తీస్తున్నారు...' అంటూ నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి శ్రీనివాస్​ కాన్వాయ్​ ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ తోపులాడుకోవడంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. అనంతరం శ్రీనివాస్​, కేవీ.ప్రతాప్​ మంచిర్యాల ఐబీ చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ మీడియాతో మాట్లాడుతూ... తామంతా కాంగ్రెస్​ బలోపేతం కోసమే కృషి చేస్తున్నామని, కొంతమంది ర్యాలీని అడ్డుకోవడం బాధాకరమని అన్నారు.

‘ఎమ్మెల్యే అనుచరులు భూమిని కబ్జాచేసిన్రు’

భైంసా,వెలుగు: హైదరాబాద్​లోని అల్వాల్​ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు, బాసర గ్రామానికి చెందిన గౌరొళ్ల సురేశ్​కలిసి తన భూమిని కబ్జాచేశారని బాసర గ్రామానికి చెందిన రాజేశ్వర్​ దేశాయ్​ఆరోపించాడు. మంగళవారం బాసర తహసీల్దార్​ఆఫీస్​ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. బాసర శివారులోని సర్వే నంబర్ 543లో 14.07 ఎకరాల భూమి తన పేరు మీద ఉందని.. అందులో నుంచి 5.07 ఎకరాల భూమి ఎమ్మెల్యే మైనంపల్లి బంధువులు కబ్జా చేశారని ఆరోపించారు. ఆఫీసర్లకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రాజేశ్వర్​ దేశాయ్​తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లక్ష్మణ్​రావు, లీడర్లు వెంకటేశ్​గౌడ్, జ్ఞాని పటేల్ బాధితుడితో మాట్లాడారు. విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన 
విరమించాడు.

మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన విద్య, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తోందని స్టేట్​ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫాస్ట్రక్చర్​డెవలప్మెంట్​కార్పొరేషన్( ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్​రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్​సిక్తా పట్నాయక్ తో కలిసి విద్యాశాఖ, వివిధ శాఖల ఇంజినీర్లతో ‘మన ఊరు.. మన బడి’పై రివ్యూ నిర్వహించారు. మొదట విడత రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అవసరమైన మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. రూ.10 లక్షలలోపు ఉన్న పనులు జనవరి 15లోగా పనులు పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అంతకుముందు ఇచ్చోడ, గుడిహత్నూర్, జైనథ్, తాంసి, ఆదిలాబాద్ అర్బన్ మండలాల్లోని పలు పాఠశాలల్లో జరుగుతున్న ‘మన ఊరు.. మన బడి’ పనులను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి నారాయణ, ట్రైనీ కలెక్టర్ శ్రీజ తదితరులు ఉన్నారు.

సింగరేణి దర్శన్​లో జైపూర్​ఎస్టీపీపీ

మందమర్రి(జైపూర్),వెలుగు: సింగరేణి సహకారంతో ఆర్టీసీ దేశంలోనే మొదటి సారిగా 'సింగరేణి దర్శన్​- కోల్​ టూరిజం' పేరుతో ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుచ్చింది. పర్యాటకులను హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకవచ్చి పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్​ పరిధిలోని సింగరేణి జీడీకే7 ఎల్ఈపీ(లైఫ్​ ఎక్స్​టెన్సన్​ ప్రాజెక్టు) అండర్​గ్రౌండ్​ కోల్​మైన్​, ఓపెన్ ​కాస్ట్​ మైన్ బొగ్గు తవ్వకాలు​, సింగరేణి రెస్క్యూ స్టేషన్లతో పాటు మంచిర్యాల జిల్లా జైపూర్​లో సుమారు రెండు వేల ఎకరాల్లో విస్తరించిన సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది.

థర్మల్ పవర్​తో పాటు సోలార్​ కరెంట్​నూ వీక్షించే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రాణహిత, గోదావరిలోయ పరిసర ప్రాంతాలు చూడొచ్చు. మంగళవారం హైదరాబాద్​ బస్​ భవన్​లో డైరెక్టర్​(ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, పి అండ్ పి)  ఎన్‌‌‌‌‌‌‌‌.బ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌రామ్ నాయక్​, ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవ‌‌‌‌‌‌‌‌ర్దన్, ఎండీ సజ్జనార్ సింగరేణి దర్శన్ సర్వీసును ప్రారంభించారు.  మొదటి సింగరేణి దర్శన్​ కోల్ టూరిజం సర్వీస్​ బస్సు పర్యాటకులతో బుధవారం ఎస్టీపీపీకి రానుంది. పర్యాటకుల కోసం ఎస్టీపీపీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది.