భైంసా, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది. న్యూ ఇయర్ కావడంతో మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. అమ్మవారి చెంత భక్తులు తమ చిన్నారులకు వేద పండితులచే అక్షర శ్రీకార పూజలు జరిపించారు.
ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు రాగా.. దర్శనానికి సుమారు మూడు గంటలు పట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కొద్ది మేర ఇబ్బందులు ఎదురయ్యాయి. అమ్మవారికి ఒక్క రోజే రూ7.50 లక్షల ఆదాయం సమకూరింది.
ఘనంగా శౌర్య దివాస్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ భుక్తపూర్‌లోని బుద్ధ విహార్‌లో భీమా కోరేగావ్ శౌర్య దివాస్‌ను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా 1818 లో జరిగిన యుద్ధంలో చనిపోయిన అమరవీరులకు నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బుద్ధుడి ఫొటోలకు పూలమాలలు వేశారు. అనంతరం పంచషీల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, దళిత సంఘాల నాయకులు రత్నజాడే ప్రజ్ఞ, శేఖర్, కుమార్, సుదర్శన్, శైలేందర్ వాగ్మరే పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో ..
బెల్లంపల్లి, వెలుగు: మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో భీమా కోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు జరిగాయి. మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు చిలుక రాజనర్సు అంబేడ్కర్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వార్షిక లక్ష్యం సాధిస్తాం: జీఎం సంజీవరెడ్డి
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలో వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని జీఎం సంజీవ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏరియాలో భూగర్భ గనులు ఎక్కువగా ఉన్నా కార్మికులు, ఆఫీసర్ల కృషితో వార్షిక లక్ష్యం సాధన దిశగా సాగుతున్నామన్నారు. డిసెంబర్‌కు సంబంధించి ఆర్కే5గని 121శాతం, ఆర్కే6 గని 131 శాతం, ఆర్కే7గని 95 శాతం, ఆర్కే న్యూటెక్ గని 115శాతం, ఎస్ఆర్పి1గని 75శాతం, ఎస్ఆర్పీ 119శాతం, ఐకె1ఎ గని 85శాతంతో భూగర్భగనులు 106శాతం, ఎస్ఆర్పీ ఓసీపీ 98శాతం, ఐకే ఓసీపీ 99శాతంతో ఏరియా మొత్తంగా 100 శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించామన్నారు. సింగరేణిలో సోలార్ విద్యుత్ ను 500 మెగావాట్ల వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శ్రీరాంపూర్ ఏరియాకు స్వచ్ఛతా పక్వాడ్‌లో సింగరేణి వ్యాప్తంగా ఫస్ట్ ఫ్రైజ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం త్యాగరాజు, ఏరియా ఇంజినీర్ రమేశ్, డీవైజీఎం గోవిందరాజు, తుకారం, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం అర్ధరాత్రి 2022కు వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఆదివారం ఆసిఫాబాద్‌లో జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగేలా నాగేశ్వరరావు.. కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విషెస్ చెప్పారు. ఆంజనేయస్వామి టెంపుల్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు.
సింగరేణి కార్మిక క్షేత్రాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, జైపూర్, బెల్లంపల్లిల్లో సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులు, యువత న్యూ ఇయర్వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో టీఎన్జీవో నాయకులు ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్‌లో బోథ్ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నేరడిగొండ లీడర్లు విషెస్ చెప్పారు. - వెలుగు, నెట్‌వర్క్
7 నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
మందమర్రి, వెలుగు: మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఈనెల 7 నుంచి 9 వరకు రాష్ట్ర స్థాయి బాలుర జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, జనరల్ సెక్రటరీ రమేశ్ తెలిపారు. ఆదివారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో మీడియాకు పోటీల వివరాలు వెల్లడించారు. పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయన్నారు. పోటీలు లీగ్ కమ్నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అసోసియేషన్ ట్రెజరర్రమేశ్రెడ్డి, పోటీల నిర్వహణ చైర్మన్ సమ్మయ్య, కన్వీనర్ ఆర్.వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు శంకర్, వెంకటస్వామి, శంకర్ పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు పోలీస్ బందోబస్తు
పట్ణణంలోని చౌరస్తాలు, ప్రధాన కూడళ్లలో తనిఖీలు
నిర్మల్, వెలుగు: డిసెంబర్ 31 సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా పోలీసులు లిక్కర్వినియోగం, ట్రిపుల్‌రైడింగ్, రాష్‌డ్రైవింగ్, డీజేల వినియోగంపై యువతకు అవగాహన కల్పించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం సాయంత్రం నుంచి బందోబస్తు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన జంక్షన్లలో తనిఖీలు చేశారు. వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు.
కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం బేల, ఉట్నూర్మండల కేంద్రాల్లో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులతో భవిష్యత్ కార్యాచరణ, ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్సుహాసినీరెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, లీడర్లు రాందాస్, దత్తానికం, విజయ, గంగారెడ్డి, విలాస్ రెడ్డి, ముకుందరావు, మురళీధర్, సుభాశ్, నరేశ్, నవీన్ పాల్గొన్నారు.