రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు రామ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హోమంలో మంత్రి పాల్గొన్నారు. తర్వాత ఐటీడీఏ పరిధిలోని డివిజన్ స్థాయి సైన్స్ ఫెయిర్‌ను మంత్రి ప్రారంభించారు.
ఆదర్శనగర్ లో నిర్మించిన రోడ్డును కలెక్టర్ ముషారఫ్ ఫారుకీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాము పాల్గొన్నారు.
ఖాందేవ్ జాతర పోస్టర్ల రిలీజ్
నార్నూర్,వెలుగు: నార్నూర్మండల కేంద్రంలో కొలువుదీరిన తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవ్ జాతర ఈనెల 6 నుంచి షురూ కానుంది. జాతర పోస్టర్లను బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు. జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్నుంచి ఆదివాసీలు, ప్రజలు వస్తారని చెప్పారు. భక్తులకు కావలసిన సౌలత్ లను ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌చైర్మన్ సురేశ్, ఉప సర్పంచ్ మహేందర్, నిర్వహణ కమిటీ సభ్యులు నాగోరావ్, బండు, రూప్ దేవ్త
తదితరులు పాల్గొన్నారు.
మంచును చీల్చుకుంటూ.. ముందుకు సాగుతూ
ప్రకృతి అందాలకు నిలయమైన ఆదిలాబాద్జిల్లాలో బుధవారం వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచు కురిసింది. ఆదిలాబాద్పట్టణంతోపాటు నేషనల్ హైవేపై మంచు దుప్పటి వేసింది. మంచుతో ఆదిలాబాద్పరిసరాలు కశ్మీర్‌ను తలపించాయి. మంచును చీల్చుతూ ట్రైన్ ముందుకు దూసుకెళుతుండగా ‘వెలుగు’ కెమెరా క్లిక్ మనిపించింది. - వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్
ఉత్సాహంగా యువజన ఉత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన డాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ లో పాల్గొంటారని డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
బీజేపీ సైనికులు పోరాటానికి సిద్ధం కావాలి: జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బీజేపీ సైనికులు బీఆర్ఎస్ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, అసెంబ్లీ ప్రబారి లింగారెడ్డి అన్నారు. బుధవారం పార్టీ ఆఫీసులో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలతో మీటింగ్నిర్వహించారు. ఈ నెల 7న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు వకులాభరణం ఆదినాథ్, నగేశ్, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.
7న నడ్డా మీటింగ్‌ను సక్సెస్ చేయాలి
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలో బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావం తో పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పిలుపునిచ్చారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్ లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరగనున్న పోలింగ్ బూత్మీటింగ్ను సక్సెస్చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, నియోజక వర్గ పాలక్ కౌషిక హారి, నియోజకవర్గ ఇన్‌చార్జి సుదర్శన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణ దేవరాయలు, లీడర్లు రమేశ్, ఏమాజీ, హరీశ్ గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ధర్నా
ముధోల్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భోస్లే మోహన్‌రావు పాటిల్ ఆరోపించారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం ముథోల్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీజేపీ మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని, స్థలం లేని పేదవారికి తక్షణమే డబుల్ బెడ్రూం మంజూరు చేయాలని కేటాయించాలని డిమాండ్ చేశారు. ముథోల్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సభాస్థలి నుంచి ధర్నా చౌక్ వర కు ర్యాలీగా వెళ్లారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌చేశారు.
ఎస్టీపీపీలో డీజిల్ చోరీపై ఫిర్యాదు
ఎనిమిది మందిపై కేసు
జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ)లో డీజిల్ ఎత్తుకెళ్తున్న వ్యక్తులపై బుధవారం కేసు నమోదు చేశామని జైపూర్ ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 31న గ్లోబస్ కంపెనీ బుల్ ఆపరేటర్ లంక రవికుమార్ తన కారులో 30 లీటర్ల డీజిల్ తీసుకెళ్తున్నట్లు సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీనిపై ఎంక్వైరీ చేయగా తనతోపాటు ప్లాంటులో పనిచేసే ప్రశాంత్, స్వామి, రాజేశ్, అర్జున్, అరవింద్, కొమురయ్య, వెంకటేశ్.. వాహనాల్లోని డీజిల్దొంగతనం చేసి బయటకు అమ్మకున్నట్లు రవికుమార్ అంగీకరించాడు. దీంతో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
దీంతోపాటు గతనెల 30న హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తులు ఎంసీ క్వార్టర్స్‌లో నాలా శుభ్రం చేస్తుండగా ఐదు క్యాన్లలోని 100 లీటర్ల డీజిల్ కనిపించినట్లు జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.బుధవారం ఎస్టీపీపీ లో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్న ఎలక్ట్రిషన్ హెల్పర్ గుండా రవి కుమార్.. ఎలక్ట్రికల్స్క్రాప్ ను బైక్ పై తీసుకొని వెళుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని దీనిపై కూడా కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి: ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
గుడిహత్నూర్, వెలుగు: ఆదిమ గిరిజనుల అభివృద్ధి కోసం పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘పోలీసులు-మీ కోసం’లో భాగంగా ఉట్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ ఉదయ్ కుమార్ కొలాం ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో పోలీసులు గిరిజన గ్రామాల్లోకి వస్తుంటే భయపడేవారన్నారు. ఆదివాసీలతో మమేకం అయ్యేందుకే ‘పోలీసులు–మీ కోసం’ చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో అత్యంత వెనుకబడిన కోలాం గిరిజన యువత చదువుపై ఆసక్తి చూపాలని సూచించారు. ఆదివాసీ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ నిరంతరంగా కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌లో పాసైన ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం ఎస్పీని కోలాం గిరిజన నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాహుల్, సీఐ సైదారావు, ఎస్సై భరత్ సుమన్, కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు శేషరావు, నాయకులు నాగేశ్, బాపురావు, గంగారం, గ్రామస్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రాంతలకు నడిపే అంబులెన్స్‌లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేశ్ రెడ్డి మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఏర్పాటుచేసిన అంబులెన్స్‌లకు రిపేర్లు చేయకపోవడంతో 3 నెలల నుంచి మూలనపడి ఉన్నాయన్నారు. అంబులెన్స్‌లు లేకపోవడంతో ఎమర్జెన్సీ టైంలో ఆదివాసీలు, గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాహిద్, ఉప సర్పంచ్ మల్లయ్య, చంద్రకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.