ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

  •     దిమ్మదుర్తిలో అంబేద్కర్ కు నివాళి అర్పించిన బండి సంజయ్​
  •     నేటితో జిల్లాలో ముగియనున్న సంగ్రామ యాత్ర
  •     ఖానాపూర్ లో బహిరంగ  సభ
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ లీడర్లు

నిర్మల్/లక్ష్మణచాంద,వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అందరికి న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చెప్పారు. మహా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం ఆయన మామడ, దిమ్మదుర్తి, రాజురాగేట్, ఎగ్బాల్​పూర్ ​మీదుగా ఖానాపూర్ చేరుకున్నారు. యాత్రకు యువకులు, మహిళలు, పిల్లలు బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికారు.  సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దిమ్మదుర్తి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పూల మాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ భిక్షతోనే తామంతా పదవులు అనుభవిస్తున్నామన్నారు. అనంతరం స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి గీత కార్మికులతో ముచ్చటించారు. ఖానాపూర్ సాయిబాబా ఆలయం వద్ద రాత్రి బస చేశారు. పార్టీ లీడర్లతో సమావేశమై భవిష్యత్​కార్యాచరణపై దిశా నిర్దేశంచేశారు. బుధవారం ఖానాపూర్​లో బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. బహిరంగ సభ కోసం మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పెంబి జడ్పీటీసీ జానుబాయి, బీజేపీ అసెంబ్లీ లీడర్​హరినాయక్ తదితరులు ఏర్పాట్లు చేశారు.

‘మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు’

నిర్మల్,వెలుగు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ లీడర్లు స్పష్టం చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మారు కొండరాము, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు ముడుసు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ లీడర్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రిపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మచ్చలేని నాయకుడిగా ఇంద్రకరణ్ రెడ్డికి పేరుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. డివన్ పట్టాలు, అసైన్డ్ భూముల వ్యవహారం, మున్సిపల్ ఉద్యోగాల నియామకంలో మంత్రికి సంబంధం లేదన్నారు. దమ్ముంటే బీజేపీ లీడర్లు ఆరోపణలు రుజువు చేయాలన్నారు. లేదంటే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరాలన్నారు. మరోసారి మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులు కీలకం

ఆదిలాబాద్,వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్​ పోలీస్​హెడ్​ క్వార్టర్స్​లో హోంగార్డు రైజింగ్ డే ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి ర్యాలీ ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత హోంగార్డులు ప్రభుత్వం తరఫున పెన్షన్ లేని కారణంగా, ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ పథకాల్లో చేరడం ఉత్తమమన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, పట్టణ సీఐలు పురుషోత్తం, మల్లేశ్, రిజర్వ్  ఇన్​స్పెక్టర్లు వెంకటి, వేణు, శ్రీపాల్, గుణవంతరావు, వంశీకృష్ణ, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాలని వెంకటేశ్వర్లు, ఎస్సై అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

టీచర్​ సస్పెన్షన్

కాగజ్ నగర్,వెలుగు: చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-1లోని బాబాపూర్ –-గంగా పూర్ హిందీ మీడియం హైస్కూల్ టీచర్ సవితను మంగళవారం సస్పెండ్ చేస్తూ డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్​ క్లాస్ రూమ్​కు పిలిచి ఇతరులతో వీడియో కాల్ లో మాట్లాడించడం, వీడియోలు తీయడం, ఫ్యామిలీ విషయాలు చెప్పడం, లిక్కర్ విషయాలపై మాట్లాడంతో  గత నెల 26న స్కూల్ ఎదుట విద్యార్థులు, పేరెంట్స్​ ఆందోళనలకు దిగారు. ఘటనపై విచారణ జరిపిన డీఈవో అశోక్​ ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఘనంగా సాయిపల్లకి శోభాయాత్ర

నిర్మల్,వెలుగు: గండిరామన్న సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా  జరుగుతున్నాయి. మంగళవారం సాయిపల్లకి ఊరేగింపు నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన శోభాయాత్రకు మంగళహారతులతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ  సింగిల్ ట్రస్టీ లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బుధవారం జరిగే దత్త జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు. ఉదయం 5.30 గంటలకు మంగళ స్నానం, అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సాయి దీక్ష సేవాసమితి సభ్యులు పూదరి నరహరి, రాంరెడ్డి, మహేందర్ యాదవ్, జొన్నల మనోహర్,  కోల శంకర్, జైపాల్ రెడ్డి,  సోమేశ్వర్, ఉప్పుల నందు, కళ్యాణి, రేఖ, ప్రియ పాల్గొన్నారు.

‘తైబజార్ వేలం డబ్బులు రికవరీ చేయాలి’

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి మున్సిపాలిటీలో తైబజార్ వేలం డబ్బులు మున్సిపాలిటీకి చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు రికవరీ చేయాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గోగు సుధాకర్, నెన్నెల మండల బీజేపీ మాజీ కార్యదర్శి గోగు సురేందర్ డిమాండ్​చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో వారు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లుగా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించని యాకూబ్, రేవెళ్లి విజయ్, భీమ శంకర్​పై చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు.