ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాంను విజయవంతం చేయాలని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. రెండవ విడత కంటి వెలుగు ప్రోగ్రాం సన్నాహక ఏర్పాట్లపై ఆదివారం మంచిర్యాల, ఆసిఫాబాద్​లో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి వంద రోజుల పాటు రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతుందన్నారు.12 లోగా మండల పరిషత్​లు, మున్సిపాలిటీల్లో మీటింగ్​లు ఏర్పాటు చేయాలన్నారు. 

డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, అద్దాలు అందిస్తారని తెలిపారు. అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. మంచిర్యాల కలెక్టర్​ భారతి హోళికేరి​ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 484 శిబిరాల ద్వారా 40 వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 300, అర్బన్ ఏరియాల్లో 400 మందికి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. శిబిరాల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 950 డాక్టర్లను నియమించినట్లు తెలిపారు. 

అంతకుముందు మంత్రి మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలో పలువురికి దళిత బంధు అందజేశారు. సమావేశంలో ఆసిఫాబాద్​ కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్​ కలెక్టర్లు బి.రాహుల్, రాజేశం, చాహత్ బాజ్ పేయ్, ఆసిఫాబాద్, మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్లు కోవ లక్ష్మి, నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ  దండే విఠల్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్​రావు, దుర్గం చిన్నయ్య, డీఎంహెచ్​వో  ప్రభాకర్ రెడ్డి , జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఇయ్యాల్టి నుంచి నిర్మల్​లో రాష్ట్రస్థాయి సైన్స్​ఫెయిర్

నిర్మల్,వెలుగు: నిర్మల్ లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ తరఫున భారీ ఏర్పాట్లు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 900 మంది స్టూడెంట్స్, మరో 900 మంది గైడ్స్,​ 33 మంది సైన్స్ ఆఫీసర్లు రానున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి కోసం 16  వసతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, డీఈవో రవీందర్ రెడ్డి తదితరులు రెండు రోజులుగా పోటీల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మూడు టెలిస్కోప్ లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి విద్యార్థులు, గైడ్ టీచర్లు టెలిస్కోప్​ల ద్వారా అంతరిక్ష విశేషాలు సమీక్షిస్తారు. రోజూ క్విజ్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్​లో గెలుపొందిన ఎగ్జిబిట్లను జాతీయస్థాయిలో ప్రదర్శించనున్నారు.

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బెల్లంపల్లి,వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్ టీయూ స్టేట్ ప్రెసిడెంట్ టి. శ్రీనివాస్ కోరారు. ఆదివారం బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో జరిగిన ఎస్ సీసీడబ్ల్యూ, ఐఎఫ్టీయూ బెల్లంపల్లి రీజియన్ 10వ మహాసభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పీఆర్సీ ఇవ్వలేదన్నారు. జేబీసీసీఐలో వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్​ చేస్తున్న సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఎందుకు పెంచడంలేదో సమాధానం చెప్పాలన్నారు. 

వేతనాల పెంపుకోసం తాము పోరాటాలు చేస్తే.. జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యానికి తొత్తుగా మారాయన్నారు. ఎస్​సీసీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం మాట్లాడుతూ రెండు దశాబ్దాల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ సీసీడబ్ల్యూ, ఐఎఫ్ టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల రమేశ్,  బెల్లంపల్లి రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ జాఫర్, టి.శ్రీనివాస్, సభ్యులు గజ్జి మల్లేశ్, అప్పారావు, తిరుపతి, పోశం, శ్రీను, సుందర్, రాజు, నారాయణ, శోభ, రాజకళ పాల్గొన్నారు.

ఎంసీహెచ్​ను ఐబీలోనే ఏర్పాటు చేయాలి 

మంచిర్యాల, వెలుగు: మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్​)ను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​ ఎదురుగా ఉన్న ఐబీలోనే ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్​సాగర్​రావు, డీసీసీ చైర్​పర్సన్​ సురేఖ డిమాండ్​ చేశారు. ఆదివారం ఐబీ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ ​పనులను వెంటనే నిలిపివేసి ఇక్కడ ఎంసీహెచ్​ బిల్డింగ్​ నిర్మించాలన్నారు. గోదావరి ఒడ్డున కట్టిన ఎంసీహెచ్​ జూలైలో వచ్చిన వరదలకు పూర్తిగా మునిగినప్పటికీ తిరిగి అందులోనే రీ ఓపెన్​ చేస్తామనడం మూర్ఖత్వమని విమర్శించారు. ఐబీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపడితే కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ నరేష్, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్​ పూదరి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్, మజీద్ పాల్గొన్నారు.  

సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కోల్​బెల్ట్,వెలుగు: కోల్ మైన్స్​ఆఫీసర్స్​అసోసియేషన్ ఆఫ్​ఇండియా అపెక్స్​ సీనియర్​ ఉపాధ్యాక్షుడిగా ఎన్నికైన శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5 గ్రూప్​ డీజీఎం  వెంకటేశ్వర్​రెడ్డిని ఆదివారం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్  బి.జనక్​ప్రసాద్​ ఆధ్వర్యంలో యూనియన్ లీడర్లు సన్మానించారు. ఈ సందర్భంగా జనక్​ప్రసాద్​ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఆఫీసర్లు  ఏఐసీఎంవో ఆఫీసర్ల హక్కులతో పాటు సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం, పారిశ్రామిక సంబంధాలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్​వైస్​ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య, మందమర్రి ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ దేవీభూమయ్య, ఆర్గనైజింగ్​ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, ఏరియా సెక్రటరీ కుక్కల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.