ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం చేశారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేల మంది భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని స్వామికి కోడె మొక్కులు చెల్లించు కున్నారు. - వెలుగు, వేములవాడ
వివేక్‌ను కలిసిన పెద్దపల్లి లీడర్లు
పెద్దపల్లి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామిని జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ లీడర్లు సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివేక్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వివేక్‌ను కలిసినవారిలో సయ్యద్ సజ్జద్, బాలసాని సతీశ్‌గౌడ్, సోడాబాబు, పోతుల ప్రవీణ్, మేకల సతీష్, సాలజ్, అర్కుటి రవి తదితరులు ఉన్నారు.
మాటిచ్చి మరిచిన మినిస్టర్ కేటీఆర్
విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ లీడర్ల రాస్తారోకో
ముస్తాబాద్ వెలుగు : మండలానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తానని మినిస్టర్ కేటీఆర్ మాటిచ్చి మర్చిపోయారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏల్ల బాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మినిస్టర్ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోలో లీడర్లు గజ్జెల రాజు, రాములు గౌడ్, శ్రీనివాస్ , రాజిరెడ్డి , తిరుపతి, మహేశ్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్ల విధుల బహిష్కరణ
సుల్తానాబాద్, వెలుగు: నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ ఎర్రం గణపతి, కోర్టు ఉద్యోగి, డిక్రీ హోల్డర్ పై కేసు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. ఒక కేసు విషయంలో నిజామాబాద్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అటాచ్ మెంట్ ఎగ్జిక్యూట్ వారెంట్ నోటీసులు జారీ చేశారని, వీటిని అందించేందుకు కలెక్టరేట్ కు వెళ్లిన అడ్వకేట్ గణపతి, కోర్టు ఉద్యోగి, డిక్రీ హోల్డర్ పై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, అడ్వకేట్లు పాల్గొన్నారు.
మెట్ పల్లి: అడ్వకేట్, కోర్టు సిబ్బందిపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి అన్నారు. సోమవారం మున్సిఫ్ కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ నిజామాబాద్ కు చెందిన అడ్వకేట్ గణపతి, కోర్టు సిబ్బందిపై కలెక్టర్ తప్పుడు కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి తెడ్డు ఆనంద్, ఉపాధ్యక్షుడు రాంబాబు న్యాయవాదులు వెంకటస్వామి, రాజ్ మహమ్మద్, లక్ష్మణ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ అవార్డ్స్ కి విద్యార్థుల ఎంపిక
ముస్తాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్‌స్పైర్‌మనక్- అవార్డులకు ముస్తాబాద్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కావటి అక్షయ, చెక్కపల్లి దీక్షిత ఎంపికయ్యారు. సోమవారం స్కూల్హెడ్మాస్టర్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వం తరపున నగదు బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి, సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి అధికారులు ఏటా దేశంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్-మనక్ పోటీలు నిర్వహించి, అవార్డులను ప్రదానం చేస్తారన్నారు. కార్యక్రమంలో టీచర్లు సుజాత, ఆనందం, విద్యార్థులు పాల్గొన్నారు .
అగ్రిమెంట్‌పై దుష్ప్రచారం మానండి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి
గోదావరిఖని, వెలుగు : జాతీయ కార్మిక సంఘాలు కోల్‌కతాలో జరిగిన జేబీసీసీఐ మీటింగ్‌లో 11వ వేజ్‌బోర్డుపై మెరుగైన అగ్రిమెంట్ చేస్తే టీబీజీకేఎస్ లీడర్లు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది సరైంది కాదని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయియీ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం జీడీకే ఓసీపీ 5లో, ఏరియా వర్క్‌షాప్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 19 శాతం వేతన పెరుగుదల కార్మికుల విజయంగా భావిస్తున్న తరుణంలో అవగాహన లేకుండా ఎమ్మెల్యే చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బాయిబాట పేరుతో సింగరేణి బొగ్గు బ్లాక్‌ల రక్షణ కోసం పోరాడుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యే చందర్ సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన నీటిని అందించలేకపోతున్నారని విమర్శించారు. మీటింగ్‌లలో లీడర్లు మెండె శ్రీనివాస్, మహేశ్, రాజమౌళి పాల్గొన్నారు.