- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
- మల్లన్నపేట మల్లికార్జున ఆలయంలో పూజలు
ధర్మపుర/గొల్లపల్లి, వెలుగు: ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం గొల్లపల్లి మండలం మల్లన్నపేట ఆలయంలోని మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. అంతకుముందు వెలుగటూర్ మండలం కుమ్మరిపల్లెకు చెందిన బీజేపీ లీడర్ జక్కుల రాజ్ కుమార్ వివాహానికి వివేక్హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పలువురికి పరామర్శ..
గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీపతుల గంగారాం తండ్రి నారాయణ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను వివేక్ పరామర్శించారు. అలాగే బుర్ర శ్రీనివాస్, ఏలేటి చుక్కారెడ్డి, అంకం లక్ష్మి, కోలా దేవయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గొల్లపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చెవులమద్ది లచ్చయ్య కుటుంబ సభ్యులను, గోవిందపల్లిలో బీజేపీ సీనియర్ కార్యకర్త సైన్ల దామోదర్ ను, లక్ష్మిపూర్ లో బీజేపీ కార్యకర్త ఆకుల కనకరాజును, దమ్మన్నపేటలో సోమ రాజు కుమార్ ను వివేక్పరామర్శించారు. అయన లీడర్లు సూర్య నారాయణ, రాజేశ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ సత్యం, మండలాధ్యక్షులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సానుకూల స్పందన..
గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ ఆలయానికి బోర్ వెల్, దమ్మన్నపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌కు కుర్చీలు, ఫర్నిచర్ కావాలని సోమవారం గ్రామస్తులు వివేక్‌వెంకటస్వామిని కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
కోరం లేక జడ్పీసమావేశం వాయిదా
ఆవరణలోకి వచ్చి మీటింగ్‌కు రాని సభ్యులు
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలో జడ్పీ హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో చైర్ పర్సన్ కనుమల్ల విజయ వాయిదా వేశారు. సమావేశంలో చైర్ పర్సన్ తో కలిపి 15 మంది సభ్యులున్నారు. విజయ, చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్, ఎస్టీ కమిషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తోపాటు గౌరవ సభ్యుడి హోదాలో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ మాత్రమే సమావేశ మందిరానికి వచ్చారు. 10 నిమిషాలపాటు కోరం కోసం వేచి చూద్దామంటూ చైర్ పర్సన్ తొలుత ప్రకటించారు. అనంతరం సభ్యులెవరూ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే 10 మంది సభ్యులు జడ్పీ ఆవరణలోని చైర్ పర్సన్ ఛాంబర్ లో ఉండి కూడా సమావేశానికి రాకపోవడం విశేషం. మొత్తం సభ్యుల్లో మూడో వంతు (5 మంది) హాజరైనా సమావేశం నిర్వహించుకోవచ్చు. 50 శాతం సభ్యులు(7మంది) ఉంటే బిల్లులు కూడా పాస్ చేసుకోవచ్చు. అలాంటిది 10 మంది ఆవరణలోకి వచ్చి కూడా సమావేశానికి హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
జోరుగా సెస్ ఎన్నికల ప్రచారం
బోయినిపల్లి, వెలుగు : సెస్ ఎన్నికలలో భాగంగా సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లీడర్లుజోరుగా ప్రచారం చేశారు. బోయినిపల్లి మండలంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కొట్టేపల్లి సుధాకర్ తరుపున చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మల్లాపూర్, మాన్వాడ, కొత్తపేటలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బోలుమాల శంకర్ తరుపున చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం మల్లాపూర్, మన్వాడ, కొత్తపేట, వెంకట్రావుపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి జోగు రవీందర్ తరుపున నల్గొండ, తిప్పాయిపల్లి గ్రామాలలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ ప్రచారం చేశారు.
కోనరావుపేట: మండల సెస్ డైరెక్టర్ గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి గోపాడి సురేందర్ రావును గెలిపించాలని మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ ఓటర్లను కోరారు. సోమవారం బీజేపీ నాయకులతో కలిసి మండలంలోని మామిడిపల్లి, సుద్దాల గ్రామాల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ, గొపాడి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్ధి దేవరకొండ తిరుపతిని సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని మండలంలోని నిమ్మపల్లి తదతర గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ ఎన్.అరుణ, పార్టీ మండలాధ్యక్షుడు దేవయ్య, ఆయా గ్రామాల సర్పంచులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మండల సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని వెంకట్రావుపేట, కొండాపూర్, సుద్దాల గ్రామాల్లో మండలాధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి రుక్మిణి, కార్యదర్శులు ఎల్లయ్య, నాయకులు ప్రచారం నిర్వహించారు.
వీర్నపల్లి: మండల సెస్ డైరెక్టర్ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన గుగులోత్ హరిలాల్ బీఎస్పీలో చేరారు. సోమవారం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంకని భాను, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్ డైరెక్టర్ ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థిగా గుగులోత్ హరిలాల్ ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మునిందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిగౌడ్, మండల ఉపాధ్యక్షులు అనిల్ తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్: ముస్తాబాద్ లో సోమవారం సెస్బీజేపీ అభ్యర్థి మట్ట వెంకటేశ్వర రెడ్డి ప్రచారం చేశారు. ఆయన వెంట బీజేపీ మండలాధ్యక్షుడు కస్తూరీ కార్తిక్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కడుపులోనే శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
జగిత్యాల, వెలుగు: స్థానిక జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల క్రితం ఓ నవజాత శిశువు మరణించిన విషయం మరవకముందే సోమవారం మరో ఘటన జరిగింది. ప్రసవం కో సం ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులోనే శిశువు మృతి చెందడంతో బంధువులు నిరసనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం టీఆర్ నగర్ కు చెందిన సుమయ కౌసర్ మొదటి కాన్పు కోసం భర్త షహీద్ తో కలిసి ఆరు రోజుల క్రితం మాతా శిశు ఆస్పత్రికి వచ్చింది. కాగా ఆమెకు గర్భంలో ఉమ్మనీరు తగ్గడంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సోమవారం పరిస్థితి విషమంగా ఉందని చెప్పి పట్టణంలోని స్కానింగ్ సెంటర్లో పరీక్షలు జరపగా పాప కడుపులోనే మృతి చెందినట్లు తెలిపారన్నారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ పాప కడుపులో మృతి చెందిందని షహీద్ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఉమ్మ నీరు లేదని, కడుపులో బిడ్డకు ప్రాణహాని ఉందని తాము ముందే చెప్పామని వైద్యులు పేర్కొన్నారు.
‘ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి’
మేడిపల్లి, వెలుగు : గల్ఫ్ కార్మికుల వేతన దొంగతనంపై ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల డిమాండ్ చేశారు. మేడిపల్లి మండలం మన్నెగూడెం కు చెందిన నరేష్ రెడ్డి ‘జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్’ పేరుతో మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా సభ్య సంస్థలు, ప్రవాసీ కార్మికుల జాతీయ వేదిక పక్షాన వలస కార్మిక సంఘాల లీడర్లతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చెల్లించని వేతనాలు, ఇతర ప్రయోజనాలను తిరిగి పొందడానికి, ఫిర్యాదుల పరిష్కారాన్ని సమన్వయం చేయడానికి ప్రభుత్వం సమన్వయ వేదిక ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.