ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

    జడ్పీ చైర్​పర్సన్​ న్యాలకొండ అరుణ 

సిరిసిల్ల టౌన్,  కోనరావుపేట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పెట్టే ఖర్చు భవిష్యత్‌‌పై పెట్టుబడి అని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌‌‌‌పర్సన్​ న్యాలకొండ అరుణ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని గీతానగర్​ జడ్పీ హైస్కూల్, కోనరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన మండల స్థాయి టీచింగ్​ లెర్నింగ్​ మెటీరియల్​(టీఎల్ఎం) మేళాను జడ్పీ చైర్​పర్సన్​ ప్రారంభించారు.  ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు ఈ మేళాను నిర్వహిస్తోందన్నారు.  రాబోయే రోజుల్లో స్కూళ్లలో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టనుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డీఈవో డి.రాధకిషన్,  సర్పంచ్ రేఖ, ఎంపీటీసీ చారి, అధికారులు, టీచర్లు పాల్గొన్నారు. 

విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌ అందించాలి

వీర్నపల్లి, వెలుగు: విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​అందించేందుకు టీచర్లు కృషి చేయాలని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌‌‌‌రావు పేర్కొన్నారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో  ‘తొలిమెట్టు’లో భాగంగా ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను రవీందర్‌‌‌‌రావు చీఫ్​గెస్ట్​గా హాజరై ప్రారంభించారు. 20 ప్రభుత్వ స్కూల్స్​ టీచర్లు రూపొందించిన ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సర్పంచ్ దినకర్, ఎంపీటీసీ అరుణ్ కుమార్, ఎంపీపీ భూల, జడ్పీటీసీ కళావతి, సెస్ డైరెక్టర్ మల్లేశం, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, నాయకులు రాజిరెడ్డి, సురేశ్, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్న మహిమ గల దేవుడు: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

కొండగట్టు, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే కొండగట్టు అంజన్న ఆలయం మహిమ గలదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల్లో అంజన్నకు కట్టిన ముడుపు విప్పారు. స్పీకర్​ వెంట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, సంజయ్ కుమార్ ఉన్నారు. పోచారం రాక సందర్భంగా ఆలయ సిబ్బంది భక్తులను గంటసేపు క్యూ లైన్ లోనే ఆపివేశారు. కనీసం తాగు నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో బ్లాస్టింగ్‌‌‌‌ ఆపాలని ధర్నా

గోదావరిఖని, వెలుగు:  సింగరేణి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ 5 ప్రాజెక్ట్‌‌‌‌లో చేస్తున్న బ్లాస్టింగ్‌‌‌‌ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌‌‌‌ జిల్లా ప్రెసిడెంట్ ఎంఎస్‌‌‌‌.ఠాకూర్‌‌‌‌ అన్నారు. ఓసీపీలో బ్లాస్టింగ్‌‌‌‌ను ఆపాలని డిమాండ్‌‌‌‌  చేస్తూ మంగళవారం గోదావరిఖని మెయిన్‌‌‌‌ చౌరస్తాలో ధర్నా చేశారు. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో తక్కువ మోతాదులో బ్లాస్టింగ్‌‌‌‌ చేస్తామని ప్రకటించిన మేనేజ్‌‌‌‌మెంట్..  నేడు భారీ బ్లాస్టింగ్ ​చేస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓసీపీ 5 రాకుండా అడ్డుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌.. గెలిచిన తర్వాత సింగరేణితో లోపాయికారీ ఒప్పందం చేసుకుని గోదావరిఖనిని బొందలగడ్డగా మార్చుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఓసీపీ 5 వైపు ర్యాలీగా వెళుతుండగా కాంగ్రెస్‌‌‌‌ లీడర్లను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఆందోళనలో లీడర్లు రాజేశ్‌‌‌‌, స్వామి, ముస్తఫా, ప్రకాశ్‌‌‌‌, రమేశ్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌, రవికుమార్‌‌‌‌ పాల్గొన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే.. కమ్యూనిజం, సోషలిజం ఉండదు : రాష్ట్ర ప్రణాళికా సంఘం     వైస్​చైర్మన్​ వినోద్​కుమార్​

రాజన్నసిరిసిల్ల,వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే కమ్యూనిజం, సోషలిజం అంతమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​చైర్మన్​ బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు.  మంగళవారం సిరిసిల్లలో సీపీఐ  ఆధర్యంలో  నిర్వహించిన  బద్దం ఎల్లారెడ్డి వర్ధంతి సభకు వినోద్​కుమార్​, ఎమ్మెల్యే రసమయి చీఫ్ గెస్ట్ గా  హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టు యోధుడు  బద్దం ఎల్లారెడ్డి  సేవలు మరువలేనివని ప్రశంసించారు. నిరుపేదల  జీవితాల్లో వెలుగులు నింపేందుకు బద్దం ఎల్లారెడ్డి కృషి చేశారన్నారు. సభలో రసమయి ఆటపాట అలరించాయి. విమలక్క మాట్లాడుతూ కామ్రెడ్ బద్దం ఎల్లారెడ్డి జీవితం త్యాగాల మూట అని అన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ పీడిత సమాజం  కోసం పోరాటం చేసేదే కమ్యూనిస్టులేనన్నారు. కార్యక్రమంలో సీపీఐ, బీఆర్ఎస్​లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మధురానగర్ అభివృద్ధికి సహకరిస్తా..

గంగాధర, వెలుగు: గంగాధర మండలం మధురానగర్ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. మధురానగర్​లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే రవిశంకర్‌‌‌‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీలు శ్రీరామ్​ మధుకర్​, ఎంపీపీ మేనేని స్వర్ణలత-, సర్పంచ్​ లావణ్య-, బీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు నవీన్​రావు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం 

ఇల్లందకుంట, వెలుగు: అక్రమ అరెస్ట్‌‌లను నిరసిస్తూ మంగళవారం సీఎం కేసీఆర్ ​దిష్టిబొమ్మను కాంగ్రెస్​ లీడర్లు దహనం చేశారు. పలువురు లీడర్లు మాట్లాడుతూ సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా పీసీసీ చీఫ్​ రేవంత్‌‌రెడ్డితో సహా లీడర్ల అరెస్ట్‌‌ను ఖండిస్తున్నామన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని విమర్శించారు. కార్యక్రమంలో లీడర్లు వంగ రామకృష్ణ, ఓదెలు,  శ్రీనివాస్​, మహేశ్​, మదన్​రావు, వీరారెడ్డి, సురేశ్, సాయికుమార్​, కిరణ్​, చల్ల మధు పాల్గొన్నారు.

మంత్రి కొప్పుల ఎదుట జడ్పీటీసీ నిరసన: జగిత్యాల జడ్పీ మీటింగ్‌‌లో ఘటన

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జడ్పీ జనరల్​బాడీ మీటింగ్‌‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎదుట ఓ జడ్పీటీసీ ప్లకార్డుతో నిరసన తెలిపారు. మంగళవారం జగిత్యాల జడ్పీ ఆఫీసులో చైర్‌‌‌‌పర్సన్​దావ వసంత అధ్యక్షతన నిర్వహించిన జనరల్​బాడీ మీటింగ్‌‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మెట్‌‌పల్లి మండలానికి నిధుల మంజూరులో స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు జడ్పీటీసీ కాటిపెల్లి రాధ నిరసన తెలిపారు. అంతకుముందు ఎజెండాలో పొందుపరిచిన 40 అంశాలను మీటింగ్‌‌లో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు. 

చికిత్స పొందుతూ మున్సిపల్ కాంట్రాక్టర్ మృతి

    సంతాపం తెలిపిన బీజేపీ  నేత వివేక్‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు: రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మున్సిపల్‌‌‌‌ సివిల్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ జంగపల్లి(గడ్డి) కనకయ్య(63) మంగళవారం కరీంనగర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చనిపోయారు. కనకయ్య గతేడాది సెప్టెంబర్‌‌‌‌ 14న బైక్​పై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి కరీంగనగర్​లోని హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం చనిపోయారు. కనకయ్య భార్య సరోజన 38వ కార్పొరేటర్‌‌‌‌గా ఉన్నారు. కనకయ్య మృతికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌ సంతాపం ప్రకటించారు. గౌతమీనగర్‌‌‌‌లోని కనకయ్య నివాసానికి మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, లింగయ్య, కౌశిక హరి, మేయర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ నివాళులర్పించారు. కనకయ్య నేత్రాలను సదాశయ ఫౌండేషన్‌‌‌‌ ద్వారా హైదరాబాద్‌‌‌‌లోని వాసన్‌‌‌‌ ఐ బ్యాంక్‌‌‌‌కు తరలించారు.  

కార్పొరేట్‌‌కు దీటుగా వైద్యసేవలు: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: కార్పొరేట్ హాస్పిటల్స్‌‌కు దీటుగా సర్కారీ హాస్పిటల్స్‌‌లో వైద్య సేవలు అందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌‌‌‌రావు అన్నారు. మంగళవారం మెట్‌‌పల్లి దవాఖానాలో కొత్తగా బిల్డింగ్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్లలో 100 పడకల హాస్పిటల్, మెట్‌‌పల్లిలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ కూల్చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నెల 5న కొత్త బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు వస్తున్నట్లు తెలిపారు. అలాగే కోరుట్లలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సాజిద్ అహ్మద్, డాక్టర్ అమరేశ్వర్, ఎంపీపీ సాయిరెడ్డి, ఇన్‌‌చార్జి కమిషనర్ రాజ్‌‌కుమార్ పాల్గొన్నారు.