- సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖానాలు
- ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- కోరుట్ల, మెట్పల్లిలో హాస్పిటల్డెవలప్మెంట్ వర్క్స్
కోరుట్ల, మెట్పల్లి, వెలుగు: వైద్య రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, వైద్య విద్య, పీజీ సీట్లలో రెండో స్థానం, వైద్య సేవల్లో మూడో స్థానంలో గుర్తింపు సాధించిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల హాజీపురాలో బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను, మెట్ పల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ పనులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుమాట్లాడుతూ కోరుట్లలోని 30 పడకల ఆసుపత్రి రూ.20 కోట్లతో 100 పడకలుగా అప్ గ్రేడ్ చేసి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. తెలంగాణలో 200 ఉన్న ఐసీయూ బెడ్ లను, 6,000 లకు పెంచామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేలేదని ఆరోపించారు.
నార్మల్ డెలివరీలకు మొగ్గు చూపాలి
గర్భిణులు నార్మల్ డెలివరీలకే మొగ్గు చూపాలని మినిస్టర్అన్నారు. మెట్ పల్లి హాస్పిటల్ లో ఏటా 200 డెలివరీలు చేస్తే తెలంగాణ ఏర్పడ్డాక 2 వేలకు పైగా డెలివరీలు జరుగుతున్నాయన్నారు. మెట్ పల్లి ఆస్పత్రిలో 73 శాతం సీ సెక్షన్లు చేస్తున్నారనీ, ఇది రివర్స్ అయ్యి 73 శాతం నార్మల్ ప్రసవాలు కావాలని డాక్టర్లను ఆదేశించారు. మెట్ పల్లి, కోరుట్ల హాస్పిటళ్లలో టిఫ్ఫాన్ స్కానింగ్ మిషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మెట్ పల్లి కి డెంటల్ చైర్, బస్తీ దవాఖానా, ఏఎన్ఎం సబ్ సెంటర్లకు సొంత భవనం లేని చోట సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నరు.
మాది పేగు బంధం, బీజేపీది రాజకీయ బంధం
తెలంగాణతో సీఎం కేసీఆర్ కు పేగు బంధం ఉందని, బీజేపీ వాళ్లకు రాజకీయ బంధం ఉందని మినిస్టర్హరీశ్రావు విమర్శించారు. దేశంలో 5.6 శాతం ఉన్న నిరుద్యోగిత బీజేపీ పాలనలో 8.3 శాతానికి పెరిగిందని, తెలంగాణలో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉందని నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే, బీజేపీ దేశంలోనీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటోందన్నారు. హర్యానాలో 37.4 శాతం నిరుద్యోగిత రేట్ ఉందని విమర్శించారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య సేవలను యూనిసెఫ్ కూడా కొనియాడిందన్నారు. ఆయా సమావేశాల్లో జడ్పీ చైర్ పర్సన్ వసంత, కలెక్టర్ రవి, ఆర్డీఓ వినోద్ కుమార్ , తహసీల్దార్ రాజేశ్, ఎంపీపీ నారాయణ, జడ్పీటీసీ లావణ్య , మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు
ధర్మపురి: ధర్మపురి పట్టణంలో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం మినిస్టర్ హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు మినిస్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.
బీజేపీ మీటర్లు పెట్టమంటోంది
పెద్దపల్లి: బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు, పెట్టమంటోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.7.32 కోట్లతో నిర్మించ తలపెట్టిన 50 పడుకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మోటార్లు పెట్టడంలేదని కేంద్రం నుంచి రావాల్సిన రూ.30 వేల కోట్లు పెండింగ్ పెట్టారని మినిస్టర్ఆరోపించారు.
రూ.వంద కోట్ల కుంభకోణం బయట పెడతా!
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణాన్ని బయట పెడతానని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కోనాయపల్లిలోని హరిమల గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్5న 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెడతానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు చెప్పి, బయటపెట్టకుండానే జర్మని వెళ్లారని, కానీ తాము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా అన్ని ఆధారాలతో శుక్రవారం ప్రజల సమక్షంలో కుంభకోణాన్ని బయట పెడతామన్నారు. కార్యకర్తలంతా కష్టపడి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు వకుళాభరణం శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, పిల్లి కనకయ్య, కూస రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
జగిత్యాల రూరల్ వెలుగు : జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకను గురువారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి కాంగ్రెస్ నాయకులు జగిత్యాల సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లిలో బీజేపీదే గెలుపు
నియోజకవర్గ పాలక్ శ్రీరాములు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని నియోజకవర్గ పాలక్ శ్రీరాములు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం నిర్ధేశిస్తే అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. బీజేపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. తెలంగాణలో రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలు సిద్ధమైనట్లు శ్రీరాములు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, పిన్నింటి రాజు, జనార్దన్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఉనుకొండ శ్రీధర్ తదితరులు
పాల్గొన్నారు.
మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం
మెట్ పల్లి, వెలుగు: స్థానిక సర్కారీ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కోసం కేంద్రం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ.7.50 కోట్లు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ లీడర్లు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్ సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ మెట్ పల్లి హాస్పిటల్ బిల్డింగ్ కోసం కేంద్ర సర్కారు నిధులు మంజూరు చేస్తే.. ఇది తమ ఘనతగా బీఆర్ఎస్ చెప్పుకుంటోందన్నారు. బిల్డింగ్ శిలాఫలకం ఆవిష్కరణ కోసం నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ ను అహ్వానించకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కౌన్సిలర్ శేఖర్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి నరేశ్ పాల్గొన్నారు.
దేశాన్ని ఏకం చేసే శక్తి కాంగ్రెస్ కే ఉంది
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్
హుజూరాబాద్, వెలుగు : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశాన్ని ఏకం చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకట నరసింగరావు అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను వాడుకుంటున్నాయన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో లీడర్లు బి.శ్రీనివాస్ గౌడ్, మోహన్, రామ్ చరణ్, కిరణ్, బాబు, మిడిదొడ్డి శ్రీనివాస్, సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.