ఆగం చేసిన గాలివాన..కూకటి వేళ్లతో నేలకూలిన చెట్లు

  •     కరెంట్ ​లేక ఆస్పత్రుల్లో అల్లాడిన రోగులు
  •     రైతును నిండా ముంచిన చెడగొట్టు వాన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆదివారం రాత్రి గాలివాన అతలాకుతలం చేసింది. కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సానికి ప్రజలు అల్లాడారు. కరెంట్ లేక ఆస్పత్రుల్లోని పేషెంట్లు తల్లడిల్లారు. పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. చేతికొచ్చిన మామిడి కాయలు నేల రాలడంతో రైతులకు కన్నీరే మిగిలింది. రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.

రాత్రంతా అరిగోస..

కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న జిల్లా గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్ తో పాటు రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి గాలివానతో కరెంట్​ నిలిచిపోయింది. కరెంట్ పోల్స్, చెట్లు విరిగి పడడంతో సప్లైని విద్యుత్​ శాఖాధికారులు నిలిపివేశారు. అత్యవసర సమయాల్లో మాత్రం మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​లో కొంత సేపు జనరేటర్​వేశారు. ఆ తర్వాత డీజిల్​ లేని కారణంతో ఆపేశారు. దీంతో ఐసీయూలోని పేషెంట్లతో పాటు వార్డుల్లోని గర్భిణులు, బాలింతలు ఉక్కపోత, దోమలతో రాత్రంతా అరిగోస పడ్డారు. 

చంటి బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి సోమవారం ఉదయం కరెంట్​ను అధికారులు పునరుద్ధరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. జనరల్​ హాస్పిటల్​లో దాదాపు 24 గంటలు గడిచినా కరెంట్​పునరుద్ధరణ జరగకపోవడంతో ఇన్​పేషంట్స్​ ఉక్కపోతతో అల్లాడారు. కరెంట్​ సప్లై లేకపోవడంతో టెస్ట్​లను నిలిపివేయడంతో పేషంట్స్ ఇబ్బంది పడ్డారు.

ఎమ్మెల్యే సాంబశివరావు ఆగ్రహం..

సోమవారం రాత్రి వరకూ కరెంట్ రాకపోవడంతో పేషెంట్ల అవస్థలు పట్టించుకోవడం లేదంటూ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో సహాయకులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రికి వచ్చిన పలువురు పేషెంట్లను రిటర్న్ పంపించారు. మరికొందరికి మొబైల్ టర్చ్ వెలుగులోనే వైద్యులు ట్రీట్మెంట్ అందించారు. ఈ క్రమంలో విషయం తెలుసుకొని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆస్పత్రిని విజిట్​ చేశారు. కరెంట్​ను పునరుద్ధరించడంలో విఫలమైన అధికారలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

670 ఎకరాల్లో పంట నష్టం 

అకాల వర్షం, గాలివాన బీభత్సంతో కొత్తగూడెం జిల్లాలో దాదాపు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. విద్యుత్​ శాఖాధికారుల లెక్కల ప్రకారంగా జిల్లాలో దాదాపు 278 కరెంట్​ పోల్స్​ విరిపోగా.. దాదాపు 48 విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్లు డ్యామేజ్​అయ్యాయి. అశ్వారావుపేట మండలంలోని సున్నంపట్టిలో కరెంట్​తీగలు తగలి రావులమ్మకు చెందిన మూడు పాడి గేదెలు, మాడి నాగేశ్వరరావుకు చెందిన గేదె చనిపోయింది. 

ముల్కలపల్లి మండలంలో వేరుశనగ పంట తడిసింది. ఇల్లెందు, సుజాతనగర్, టేకులపల్లి మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పినపాక మండలంలో వరి, మిర్చి పంటలకు అకాల వర్షం నష్టం తెచ్చింది. 498 ఎకరాల్లో వరి, 103 ఎకరాల్లో మొక్కజొన్న అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 285 మంది రైతులకు సంబంధించి దాదాపు 670 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్​ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు.  కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, కరకగూడెం, పినపాక తదితర మండలాల్లో గాలివాన బీభత్సంతో భారీ సంఖ్యలో చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి.

గరిమెళ్లపాడులో 55 మి.మీ వర్షం

చుంచుపల్లి మండలం గరిమెళ్ల పాడులో 55 మి.మీ., కొత్తగూడెంలో 50 మి.మీ. వర్షం పడింది. టేకులపల్లిలో 45.5, ఇల్లెందులో 39, లక్ష్మీదేవిపల్లిలో 32.8, సుజాతనగర్​లో 20, ముల్కలపల్లిలో 19, ఏడూళ్ల బయ్యారంలో 17 మి.మీ వర్షపాతం నమోదైంది. 

విరిగిన కరెంట్ పోల్స్​

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో అకాల వర్షం, గాలిదుమారంతో50కిపైగా కరెంట్​పోల్స్​విరిగాయి. కారేపల్లి మండలంలోని రావోజీ తండాకు చెందిన లక్ష్మీ అనే మహిళ ఇంటి పైకప్పు రేకులు ఎగరిపోయాయి. మామిడి తోటలకు కొంత నష్టం కలిగింది.