ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ములుగు, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్​ కుసుమ జగదీశ్​ సూచించారు. ములుగులోని ఎంపీడీవో ఆఫీసులో తహసీల్దార్​సత్యనారాయణస్వామి ఆధ్వర్యంలో శనివారం 119మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆఫీసర్లు నిరుపేదలకు సక్రమంగా పథకాలు అమలు చేయాలన్నారు. అధికారుల వద్ద ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్నారు. గ్రంథాలయ చైర్మణ్​పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ఎంపీడీవో ఇక్బాల్, ఎంపీటీసీలు పోరిక విజయ్​రాం, గొర్రె సమ్మయ్య, స్వామిరావు, మాచర్ల ప్రభాకర్ తదితరులున్నారు.

దుప్పట్ల పంపిణీ..

కొత్తగూడ(గంగారం), వెలుగు: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. 860మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. అర్హులందరికీ పోడు పట్టాలు ఇచ్చే వరకు తాను పోరాటం చేస్తానన్నారు. అనంతరం తాళ్లగుంపు గ్రామంలో 20 మంది కాంగ్రెస్ లో చేరగా వారికి కండువాలు కప్పారు.

జల్సాలకు అలవాటుపడి చోరీలు

 నిందితుల్లో కౌన్సిలర్ కొడుకు

జనగామ అర్బన్, వెలుగు: జల్సాలకు అలవాటై చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద సుమారు రూ.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో డీసీపీ పి.సీతారాం ఈ కేసు వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన దేవరాయి అనిల్, మెటికె మహేశ్, ఓ మైనర్ ​బాలుడు కలిసి మద్యం, సిగరేట్లకు బానిసయ్యారు. దీంతో చోరీలు చేయాలని డిసైడ్ అయ్యారు. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ టౌన్​లోని జ్యోతి నగర్, కుర్మవాడ, సాయినగర్ కాలనీల్లో దొంగతనాలు చేశారు. నగదు, బంగారం, ల్యాప్​టాప్ తో పాటు గుడిలోని హుండీని ఎత్తుకెళ్లారు. చోరీలపై ఫిర్యాదులు రాగా పోలీసులు నిఘా పెట్టారు. శనివారం నిందితులు సొత్తును అమ్మేందుకు హైదరాబాద్ వెళ్తుండగా.. కళ్లెం కమాన్ వద్ద అదుపుతోకి తీసుకున్నారు. వారి వద్ద 8.5 తులాల బంగారం, 35 తులాల వెండి, ఒక ల్యాప్​టాప్,  రూ.18,500 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన అనిల్, టీఆర్ఎస్ కౌన్సిలర్ దేవరాయి నాగరాజు కొడుకు కావడం గమనార్హం. ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

బైక్ పై యువకుల సర్కస్ ఫీట్లు

అరెస్ట్ చేసిన పోలీసులు

హసన్ పర్తి, వెలుగు: ముగ్గురు వ్యక్తులు బైక్  పై చేసిన విన్యాసాలు అరెస్టుల పాలుజేసింది. వివరాల్లోకి వెళితే... హసన్ పర్తి మండలం పెంబర్తికి చెందిన సూర రమేశ్, విలాకర్..మడిపల్లికి చెందిన వల్లపు నాగరాజ్ ముగ్గురు దోస్తులు. ముగ్గురు కలిసి హెల్మెట్​లేకుండా బైక్ పై చింతగట్టు క్యాంప్​నుంచి భీమారం వరకు అతివేగంగా వెళ్తూ సర్కస్ ఫీట్లు చేశారు. బైక్ వెనకాల వచ్చిన ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది వైరల్ గా మారడంతో సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు కేయూ సీఐ దయాకర్ బైక్ నంబర్ సాయంతో ముగ్గురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.

మావోయిస్టుల సమాచారమిస్తే క్యాష్ ప్రైజ్

భూపాలపల్లి అర్బన్, వెలుగు: మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ ప్రైజ్ తో పాటు వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం నలుగురు మావోయిస్టుల ఫొటోలు రిలీజ్ చేసి, క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షల నుంచి రూ.20లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. సమాచారం ఇవ్వదలుచుకున్న వారు డయల్ 100 లేదా 87126 58100, 87126 58111, 87126 58101, 87126 58103, 87126 58104 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

రౌడీ షీటర్లు, కబ్జాదారులపై పీడీ యాక్ట్ పెట్టాలి

మెతక వైఖరి చూపొద్దు: సీపీ రంగనాథ్

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో లా అండ్‍ ఆర్డర్‍ సమస్యకు కారణమయ్యే రౌడీ షీటర్లతో పాటు భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం సిటీలోని టాస్క్​ఫోర్స్ పోలీస్‍ ఆఫీసును సందర్శించారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్‍ డీసీపీ వైభవ్‍ గైక్వాడ్‍, సీఐ నరేశ్​కుమార్‍ తో మాట్లాడి సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. అక్రమార్కుల విషయంలో మెతక వైఖరి ప్రదర్శించవద్దన్నారు. అధికారులు, సిబ్బంది పనితనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎస్సైలు లవణకుమార్‍, నిస్సార్‍ పాషా పాల్గొన్నారు.

గంజాయి అమ్మేటోళ్ల సమాచారం నాకే పంపండి

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో ఎక్కడ గంజాయి అమ్మకాలు జరిగినా తనకు సమాచారం అందించాలని కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍ ప్రజలకు సూచించారు. గంజాయి రహిత  కమిషనరేట్‍ గా మార్చేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎవనైనా గంజాయి అమ్మినా, లేదంటే సేవించినా తన ఫోన్ నంబర్​ 94910 89100 కాల్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఈవెంట్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు..

పోలీస్‍ ఫిజికల్‍ ఈవెంట్లలో ఎవరైనా సిబ్బంది, వ్యక్తులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లుగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. శనివారం తెల్లవారుజామున కేయూ గ్రౌండ్​లో ఈవెంట్లు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈవెంట్లు పూర్తి పారదర్శకమన్నారు. ఎవరైనా సాయం చేసి నట్లు, పక్షపాతం చూపుతున్నట్లు కనిపిస్తే తన నంబర్​9491089100 లేదా అడిషనల్‍ డీసీపీ 94 40795201 సెల్‍ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

హక్కులపై అవగాహన పెంచుకోవాలి

జనగామ అర్బన్, వెలుగు: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి సూచించారు. శనివారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామ బీసీ గురుకులంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా సంపత్ రెడ్డి హాజరై మాట్లాడారు. హక్కుల వల్లే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. స్టూడెంట్లు గ్రామాల్లో మూఢాచారాలు అంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జేఎస్ఎఫ్ ఫౌండర్, చైర్మన్ డా. సుల్తాన్ రాజా, వీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి రాజు, వీఎస్ఎఫ్​జిల్లా నాయకులు అనిల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

హామీలపై నిలదీస్తారనే బీఆర్ఎస్ డ్రామా

నర్సంపేట, వెలుగు: ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిలా రంగులు మార్చి, బీఆర్ఎస్ పెట్టాడని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్​బెడ్​ రూంలు, లక్ష రూపాయల రుణమాఫీ, మూడు వేల నిరుద్యోగ భృతి తదితర హామీలు అమలు చేయలేదని, ప్రజలకు బహిరంగంగా కేసీఆర్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. నర్సంపేటలోనీ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​రెడ్డి, కొండేటి శ్రీధర్, స్టేట్​లీడర్లు ఎడ్ల అశోక్​రెడ్డి, జాటోతు సంతోష్​ నాయక్​లతో కలిసి ప్రేమేందర్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ర్టాన్ని మోసం చేసినోడు.. దేశానికి ఏం అభివృద్ధి చేస్తాడని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ​నంబర్ వన్​అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ర్టంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గటిక అజయ్​కుమార్, బాల్నె జగన్, వనపర్తి మల్లయ్య, గూడూరు సందీప్, పెంచాల సతీశ్, కొంపల్లి రాజు, కొత్త శ్రీనివాస్ 
తదితరులున్నారు.

రాజవర్ధన్ రెడ్డికి మాతృవియోగం

కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలకేంద్రానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డి భార్య, బీజేపీ రాష్ట్ర నాయకులు వి.రాజవర్ధన్ రెడ్డి తల్లి వెంకటమ్మ(92) శనివారం ఉదయం మరణించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. సాయంత్రం సీరోలులో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటమ్మ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షులు రాంచందర్ రావు, కాంగ్రెస్ నాయకులు రామచంద్రునాయక్, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి, గూడూరు జడ్పీటీసీ సుచిత్ర సంతాపం వ్యక్తం చేశారు.

వైఎస్సార్టీపీ లీడర్ల నిరాహార దీక్ష

నర్సంపేట, వెలుగు: వైయస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ లీడర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేశారు. హైదరాబాద్ లో వైయస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా, మండలకేంద్రాల్లో దీక్షలు నిర్వహించారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని, పోలీసులు అరెస్ట్ చేసిన లీడర్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లీడర్లు దాడులకు పాల్పడితే, తమను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

బహుజనులకు అధికారం దక్కాలి

హసన్ పర్తి, వెలుగు:  బహుజనులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం దక్కితేనే ప్రజల బతుకులు బాగుపడతాయని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం ఆయన హసన్ పర్తి మండలంలోని హసన్ పర్తి, ముచ్చర్ల, నాగారం, సూదనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. రాష్ట్ర సాధనలో ఎక్కువశాతం బలైంది అణగారిన వర్గాలైతే..  అధికారం మాత్రం అగ్రకులాలు అనుభవిస్తున్నాయని మండిపడ్డారు. డా. బీఆర్ఎస్ అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాలన్నారు.

‘శ్రీసృష్టి’లో ఉచిత వైద్యం

కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్​లోని ‘శ్రీసృష్టి’ సంతాన సాఫల్య, పిల్లల ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డా. ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ నెల మొత్తం ఆసుపత్రికి వచ్చే బాధితులకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కన్సల్టేషన్, రిజిస్ర్టేషన్, టెస్టులు ఫ్రీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు నిత్యం కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు డి.సంధ్యా రెడ్డి, సిబ్బంది ఉన్నారు.