ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలు దేశానికే ఆదర్శమని, అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్​ గురుకులాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో మైనార్టీ వెల్ఫేర్​స్కూల్​లో తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గురుకుల విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి శ్రీనివాస్​రావు, ప్రిన్సిపల్​ శ్రీనివాస్​, కౌన్సిలర్లు ఎడ్ల వేణు, హరిసింగ్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ నారాయణరావు, సర్పంచ్​ శ్రీనివాస్​, టీఆర్ఎస్​ లీడర్లు కన్న, వెంకన్న, వెంకటాద్రి,  లింగన్న, శ్రీనివాస్​, కరుణాకర్​రెడ్డి ఉన్నారు.

ప్రతీ కుటుంబానికి ఏదో స్కీమ్​ అందుతోంది :మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

పాలకుర్తి, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబానికి ఏదో ఒక ప్రభుత్వ పథకం అందుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. శుక్రవారం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలలో వేర్వేరుగా నిర్వహించిన దళితబంధు  రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్​ జిల్లాలో మెడికల్​ కాలేజీ, కలెక్టరేట్​తో పాటు, కొడకండ్లలో మినీ  టెక్స్​టైల్​ పార్క్​కు త్వరలో సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ​నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా అన్ని స్కూల్స్ ని ప్రైవేట్ కు దీటుగా బాగు చేసేందుకు ‘మన ఊరు, మన బడి’ని అమలు చేస్తున్నామన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని పెడుతున్నామని,  ఈక్రమంలో జనగామకు కూడా మంజూరు చేశారన్నారు.  

ప్రభుత్వ భూమిలో జెండాలు 

అడ్డుకున్న పోలీసులు, సీపీఐ నాయకుల అరెస్ట్​

కమలాపూర్, వెలుగు: ఇండ్ల జాగల కోసం ఆందోళన చేస్తే 2009లో 400 మందికి పట్టాలిచ్చిన ఆఫీసర్లు, 13 ఏండ్లు దాటినా భూమి, హద్దులు చూపకపోవడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​లోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్​ 895లో శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాట కార్యక్రమం నిర్వహించారు. స్ధానిక సబ్​ మార్కెట్​యార్డు సమీపంలో నిరుపేదలు ఎర్ర జెండాలు పాతి గుడిసెలు వేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. జెండాలు లాక్కొని సీపీఐ లీడర్లను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు అద్దె ఇండ్లలో ఉండలేక,అద్దె డబ్బులు కట్టలేక పోతున్నామని తమలాంటి పేదోళ్లు ఎట్లా బతకాలే అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో లీడర్లు లింగారెడ్డి, శ్రీనివాస్​, తిరుపతి, జక్కు రాజ్​గౌడ్​, రమాదేవి పాల్గొన్నారు. 

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి :మేయర్​ సుధారాణి 

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం  కృషి చేస్తోందని  మేయర్​ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్​లోని మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్​, జూనియర్​ కాలేజీలో జాతీయ విద్యా  దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు.  మేయర్​ మాట్లాడుతూ మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని, ఆయనను  స్ఫూర్తిగా తీసుకొని నంబర్​ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.   మైనార్టీల సంక్షేమానికి సీఎం  కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ఎంతో కృషి చేస్తున్నట్లుగా  తెలిపారు. 

ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలి

నగర వాసులు ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలని   మేయర్​ సుధారాణి అన్నారు.  బల్దియా హెడ్ ఆఫీస్​లో   పీఎంఈజీపీ, ఎంఎఫ్​ఎంఈ  పథకాల పై ఆర్​పీలకు , లబ్దిదారులకు అవగాహన  నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల జీవన శైలిని అవగాహన చేసుకొని,  వారి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే లాభం ఉంటుందన్నారు.  ప్లాస్టిక్​ పై నిషేధం కొనసాగు
తున్న తరుణంలో జూట్​, కాగితపు బట్ట సంచుల తయారీ పై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో నర్సింహ మూర్తి, అశోక్ కుమార్, రాజు, మసియొద్దీన్​, రేణుక, రమే, మెప్మా, ఆర్​పిలు, సీఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేయర్​ సుధారాణిని కలిసి కొత్తగా బల్దియా ఎస్​ఈగా బాధ్యలు స్వీకరించిన కృష్ణారావు మార్యదపూర్వకంగా మేయర్​ను కలిసి పూల బోకేను అందజేశారు. 

ఎస్సీ హాస్టల్​ అద్దె వివాదంపై అధికారుల విచారణ

తొర్రూరు, వెలుగు : తొర్రూరు లోని ఎస్సీ పోస్ట్ మెట్రిక్  బాలికల హాస్టల్​అద్దె బకాయి వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని హాస్టల్​కు తాళం వేసి ఇంటి యజమాని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  శుక్రవారం హాస్టల్​కు చేరుకున్న ఎస్సీ అభివృద్ధి జిల్లా అధికారి సన్యాసయ్య,  ఆర్డీవో రమేశ్ బకాయి వివాదంపై విచారణ జరిపారు. ఇంటి యజమాని గుమ్మడవెల్లి శ్రీనివాస్ తో మాట్లాడి ఎంతకాలంగా అద్దె బకాయి ఉందో ఆరా తీశారు. నాలుగేండ్ల అద్దె బకాయి మొత్తం సుమారు రూ. 25 లక్షలు విడతల వారీగా యజమానికి అందే విధంగా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరిపెడ ఎస్టీఓలో పెండింగ్ లో ఉన్న రూ.9 లక్షలు వెంటనే ఇచ్చే విధంగా కృషి చేస్తామని, మిగతా మొత్తం నెలలోపు  ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో అద్దె చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన పాత వార్డెన్ నుంచి డబ్బులు రికవరీ చేస్తామని అధికారి సన్యాసయ్య స్పష్టం చేశారు.