గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో రోడ్ల రిపేర్లు స్పీడప్ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో రోడ్ల రిపేర్లకు ప్రపోజల్స్ పంపాలన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి రివ్యూ నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని మూడు కోట్ల జంక్షన్, జ్యోతిరావు పూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. డోర్నకల్ కు మంజూరైన రూ.42.60 కోట్లతో రోడ్లు రిపేర్లు పూర్తి చేయాలన్నారు. ఇల్లందు– పాకాల, కురవి–జంగిలిగొండ, గార్ల–రాంపూర్, భూపతిపేట– కొత్తగూడ మధ్య వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్‌బెడ్ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం పోడు పట్టాల సర్వేపై చర్చించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రోడ్లు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. పోకల తండా కల్వర్టు భారీ వర్షాలతో మరమ్మతులకు గురైందని, దానిని బాగు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి తదితరులున్నారు.
మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డికి పరామర్శ..
కురవి: మాజీ ఎమ్మెల్సీ గాదె వెంకట్ రెడ్డిని మంత్రి సత్యవతి రాథోడ్పరామర్శించారు. ఇటీవల వెంక ట్ రెడ్డి భార్య వెంకటమ్మ అనారోగ్యంతో మరణించగా.. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.
చెదిరిన కల
పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఎనిమిదేండ్ల కింద ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ గ్రామానికి పట్టుమని పది కూడా కట్టలేదు. కొన్ని చోట్ల పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పిల్లర్లు ఇలా పశువుల కొట్టానికి పనికొస్తున్నాయి. కాగా, ఇటీవల ప్రభుత్వం ఖాళీ జాగ ఉన్నోళ్లకు రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇక డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉండవని పరోక్షంగా తెలిపింది. దీంతో పేదల కలలు అడియాసలయ్యాయి. – నెల్లికుదురు, వెలుగు
మస్తు ఇగం
ఉమ్మడి వరంగల్ జిల్లాను చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా పొగ మంచు వీడడం లేదు. దీంతో పొద్దటిపూట పనులకు వెళ్లే రైతులు, గౌడన్నలు ఇగంతో ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గ్రామాల్లో యువకులు, వృద్ధులు చలిమంటలు కాగుతున్నారు. మార్కెట్లలో దుప్పట్లు, స్వెటర్లకు గిరాకీ పెరిగింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్
టార్గెట్ పోలీస్
పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా కేయూ గ్రౌండ్లో ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మహిళా అభ్యర్థులు సైతం శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. పోలీస్ కొలువు కొట్టడమే టార్గెట్ గా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. అడిషనల్ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేశ్‌కుమార్, ఏసీపీలు, సీఐల ఆధ్వర్యంలో ఈవెంట్స్ సాగుతున్నాయి. సోమవారం జరిగిన ఈవెంట్స్ లో 1,196 మంది పాల్గొనగా.. 761మంది అర్హత సాధించారు. అభ్యర్థులకు పోలీసులు అరటిపండ్లు, వాటర్ బాటిల్స్ అందజేసి ఔదార్యం చాటుకున్నారు. – హనుమకొండ, వెలుగు
అక్రమ కేసులకు భయపడం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
జనగామ, వెలుగు: ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణపై కేంద్రం కుట్ర చేస్తోందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కేంద్రం పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడమన్నారు. సోమవారం ఆయన జనగామలోని తన క్యాంపు ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలోని 80 కోట్ల మంది రైతులు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని చెప్పారు. రైతుల గురించి ఎక్కువగా ఆలోచించి మేలు చేసే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని అన్నారు. సమైక్యాంధ్రలో రైతుల పరిస్థితి తెలంగాణ వచ్చాక పరిస్థితిని బేరీజు వేస్తే అర్థమై పోతుందన్నారు. దేశాన్ని బాగు చేయడం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్షకు అంతు లేకుండా పోతోందని ఆరోపించారు. సీబీఐ ఈడీలను అడ్డుపెట్టుకుని బెదిరించాలని చూడడం అప్రజా స్వామికమన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, పాండు, తాళ్ల సురేష్ రెడ్డి, బండ పద్మ ఉన్నారు.
ఇన్నాళ్లు మురిపించి రూ.3లక్షలా?
శాయంపేట, వెలుగు: ఎనిమిదేండ్లుగా డబుల్ బెడ్ రూం ఇస్తామని ప్రజలను ఊరించిన కేసీ ఆర్.. ఇప్పుడు ఇల్లు కట్టుకోడానికి రూ.3లక్షలు ఇస్తామంటూ కొత్త మోసానికి పాల్పడుతున్నాడని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. సోమవారం హనుమకొండ జిల్లా శాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు నిరసన దీక్ష నిర్వహించింది. చీఫ్ గెస్టుగా గండ్ర హాజరై మాట్లాడారు. రూ.3లక్షలకు సిమెంట్, ఇసుక కూడా రాదని, వీటితో ఇల్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు. ఇవి కూడా నియోజకవర్గానికి 300 మందికే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
స్మార్ట్ సిటీని స్లమ్ సిటీగా మార్చారు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ స్మార్ట్ సిటీని లోకల్ లీడర్లు స్లమ్ సిటీగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ లో మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29 వ డివిజన్ రామన్నపేటలో ప్రజలు వివిధ సమస్యలు, అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతుం డటంతో వారి తరఫున సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కమిషనర్ ప్రావీణ్యకు రాకేశ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన డివిజన్ ను చక్కదిద్దుకోలేని మేయర్, వరంగల్ ను స్మార్ట్ సిటీగా ఎలా మారుస్తారో అర్థం కావడం లేదన్నారు.
రామన్నపేటలో ఎక్కువ శాతం దళితులే ఉంటుండటంతో ఎమ్మెల్యే, మేయర్ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. వినయ్ భాస్కర్ 4 సార్లు ఎమ్మెల్యే గా గెలిచి తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ తదితర కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. దళితులను కేవలం ఎన్నికల్లో ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. లీడర్లు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే వాటిని ఎలా తీర్చుకోవాలో తెలుసునని స్పష్టం చేశారు. ఆయన వెంట రామన్నపేట ప్రజలు, బీజేపీ నాయకులు ఉన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మం డలంలో సోమవారం ఎంపీపీ రమేశ్అధ్య క్షతన మండల సభ జరిగింది. చీఫ్ గెస్టుగా ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు 4 నెలల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 22.30కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కొత్త పంచాయతీలకు బీటీ రోడ్లు సాంక్షన్ అయ్యాయని, టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించేందుకు చంద్రుగొండ, దీక్షకుంట, అప్పల్రావుపేట, రెడ్లవాడ, పెద్దకోర్పోల్, నాగారం గ్రామాల్లో రూ.36లక్షలతో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. జడ్పీటీసీ సరోజన, పీఏసీఎస్ చైర్మన్లు రాము, సంపత్ర్ రావు తదితరులున్నారు. అనంతరం నెక్కొండ గెస్ట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు. నాలుగేండ్లు కానరాని ఇద్దరు లీడర్లు ఓట్ల కోసం నర్సంపేటలో తిరుగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాంట్రాక్టర్ల వెంట పడండి
డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించండి కలెక్టర్ శివలింగయ్య
జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు. కాంట్రాక్టర్ల వెంట పడి పనులు చేయించాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి రివ్యూ నిర్వహించారు. వచ్చే జనవరి నుంచి డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు జరగాలని ఆదేశించారు. అనంతరం ‘మన ఊరు– మన బడి’ పనులపై ఆరా తీశారు. బడుల్లో వర్స్ స్పీడప్ చేయాలన్నారు.
సామాన్య పౌరుడిగా కలెక్టర్ కాల్..
జనగామ కలెక్టర్ శివలింగయ్య ఎంసీహెచ్(మాతా శిశు సంరక్షణా ఆసుపత్రి) హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేశారు. సామాన్యుడిగా మాట్లాడి వైద్య సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. సిబ్బంది నుంచి మంచి స్పందన రావడంతో వారిని అభివందించారు.