ఎల్కతుర్తి, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎనిమిదేండ్లు గడిచినా పేదలకు గుంట భూమి కూడా పంపిణీ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో వెయ్యి మందితో భారీ ర్యాలీ తీశారు. సూరారం శివారులోని సర్వే నంబర్ 566లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చి మాయమాటలు చెప్పి, అధికారం రాగానే వాటిని దాటవేయడం పరిపాటిగా మారిందన్నారు. భూపట్టాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. టీఆర్ఎస్ లీడర్లు దర్జాగా భూములు కబ్జా చేస్తున్నా.. వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గుడిసెలు వేసుకున్న పేదలపైనే ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మెదునూరు జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదరి శ్రీనివాస్ తదితరులున్నారు.
దహనం చేసినా పోరాటం ఆగదు..
కమలాపూర్: కమలాపూర్ మండలకేంద్రంలోని సర్వే నెంబర్ 895లోని ప్రభుత్వ జాగలో ఇటీవల పేదలు గుడిసెలు వేసుకున్నారు. వీటిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. మంగళవారం సంఘటనా స్థలాన్ని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జక్క రాజ్‌గౌడ్ పరిశీలించారు. గుడిసెలు దహనం చేసినా, తమ పోరాటం ఆగదన్నారు. దుండగుల పిరికిపంద చర్యల్ని తిప్పికొడతామన్నారు. కొందరు ప్రభుత్వ జాగలు తమవంటూ చెప్పుకుని తిరుగుతున్నా.. ఆఫీసర్లు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఇంటికో ఉద్యోగం ఏమైంది?
కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ధర్నా
హనుమకొండ సిటీ, వెలుగు: సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ కలెక్టరేట్ఎదుట ధర్నాకు దిగారు. ‘ఉద్యోగాలు ఏవి దొర.. నిరుద్యోగ భృతి ఏది దొర’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేయకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డా.విజయచందర్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బీజేవైఎం నేతలు పాల్గొన్నారు.
బెల్టు షాపులు మూసేయాలి..
ములుగు: బెల్టు షాపుల ద్వారా చాలామంది మద్యానికి బానిసవుతున్నారని, బెల్ట్ షాపులను ఎత్తేయాలని బీజేవైఎం ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ములుగు ఎక్సైజ్ ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు. బెల్ట్ షాపుల ద్వారా కల్తీ లిక్కర్ సరఫరా అవుతోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే వీటిని వెంటనే అరికట్టాలన్నారు.
కూడు, గూడు బాధ్యత ప్రభుత్వాలదే!
హసన్ పర్తి, వెలుగు: పేదలకు కూడు, గూడు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఇవి రెండూ విస్మరిస్తే.. ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మంగళవారం హసన్ పర్తి మండలం ఎర్రగట్టులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొదటి మహాసభలు జరగగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్సీ హాజరై ప్రసంగించారు. ఏడాదికి రెండు కోట్ల ఇండ్లు నిర్మిస్తామని కేంద్ర మోసం చేస్తే.. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందన్నారు.
నిత్యావసర ధరలు, ఇంధన రేట్లు పెరుగుతున్నా.. ఇరు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ జాగల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగదన్నారు. వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చి, రూ.5లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్, వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు 14 రకాల సరుకులు పంపిణీ చేయాలన్నారు.
అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. రామచంద్రాపురంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతతో పనులు చేయాలని ఆదేశించారు. సిగ్నకాలనీలోని బస్తీ దవాఖానా పనులను తనిఖీ చేశారు. ప్రజలను అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వెనుక నిర్మిస్తున్న శ్మశాన వాటిక, టౌన్ ప్కార్ ను పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి తదితరులున్నారు.
పోడు సర్వే రిపోర్ట్ రెడీ చేయాలి..
నర్సంపేట: పోడు భూముల సర్వేను 3 రోజుల్లో డివిజనల్ లెవల్కమిటీకి ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి ఆఫీసర్లను ఆదేశించారు. నర్సంపేట ఆర్డీవో ఆఫీసులో పోడు భూముల సర్వేపై మంగళవారం రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోడు భూ ముల సర్వే రిపోర్ట్స్‌ను స్పీడప్ చేసి, కమిటీకి సమర్పించాలన్నారు. అర్హులను మాత్రమే గుర్తించాలని, పైరవీలకు తావివ్వొద్దని సూచించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, డీఎఫ్‌వో అర్పన, డీటీడీవో జహీరోద్దీన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎఫ్ఆర్ వో బల్లాడి రమేశ్ తదితరులున్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
ఏటూరునాగారం, వెలుగు: గిరిజన ఆశ్రమ స్కూల్స్ స్టూడెంట్లకు బయోమెట్రిక్ తప్పనిసరి అని ములుగు, భూపాలపల్లి జిల్లాల ఏటీడీవో దేశిరాం సూచించారు. స్కూల్ సిబ్బంది ప్రతి రోజూ విద్యార్థుల అటెండెన్స్ మానిటర్ చేయాలన్నారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. స్టూడెంట్లకు మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారో లేదో తెలుసుకున్నారు. స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్‌డబ్ల్యూవో శ్రీలత ఉన్నారు.