ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వర్ధన్నపేట, ధర్మసాగర్​, వెలుగు: రేషన్ బియ్యం దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. వరంగల్ జిల్లా  వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని నందీశ్వర రైస్ మిల్  అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్,వర్ధన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో పీడీఎస్ రైస్ డంప్ చేశారన్న సమాచారం తెలుసుకుని పోలీసులు దాడులు నిర్వహించారు. 35 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. హసన్ పర్తి గ్రామానికి చెందిన గణేశ్​ను అదుపులోకి 
తీసుకున్నారు.

పోడు భూముల సర్వే 98 శాతం పూర్తి

ములుగు, వెంకటాపూర్, వెలుగు: ములుగు జిల్లాలో పోడు భూముల సర్వే 98శాతం పూర్తయిందని, గ్రామసభలు నిర్వహించి అసలైన లబ్ధిదారులకు భూములు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్​కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఇంచర్ల గ్రామం వద్ద ట్రైబల్​ విలేజీతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పోడు భూములు కలిగిన ములుగు జిల్లాలో సర్వే సక్సెస్ అయిందన్నారు. ఈ నెల 22 వరకు గ్రామ సభలు పూర్తి చేసి, అర్హులందరికీ పట్టాలు అందిస్తామన్నారు. 2005 కంటే ముందు పోడు సాగు చేసుకున్న వారికి మాత్రమే పట్టాలు ఇస్తామన్నారు. సర్వేపై రైతులకు అనుమానాలు ఉంటే రీసర్వే కూడా చేయిస్తామన్నారు.

త్వరలోనే ప్రభుత్వ భవన నిర్మాణాలు..

బండారుపల్లి, జాకారం శివార్లలో 538 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారని, ఆ భూమిలోనే ప్రస్తుతం కలెక్టరేట్ తోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగుతోందన్నారు. అటవీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 573/1, 573/2 సర్వే నెంబర్లలో జాయింట్​సర్వే చేస్తున్నామని, అది చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు. కలెక్టరేట్​నిర్మాణానికి టెండర్​ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే రాష్ట్ర మంత్రులు పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ వివరించారు. జాకారం గ్రామంలో ఎన్​హెచ్​కు ఇరువైపులా సుమారు 1154 ఎకరాల భూమికి హద్దుల ఏర్పాటుతోపాటు కందకాల తవ్వకం పూర్తయిందని, ములుగులోని గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో సైతం కందకాల నిర్మాణాన్ని పూర్తిచేసి హద్దులు నిర్ణయించామన్నారు. జిల్లాలోని మహ్మద్​గౌస్​ పల్లి నుంచి గట్టమ్మ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. భారీ వర్షాలకు తెగిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. ములుగు మండలం ఇంచర్ల సమీపంలో ఉద్యానవన శాఖకు చెందిన ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు కేటాయించామని, అందులో ట్రైబల్ విలేజ్ నిర్మాణ పనులను ఆ శాఖ ద్వారా చేపట్టి త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు కలెక్టర్ వివరించారు.

సర్వే స్పీడప్ చేయాలి..

వరంగల్ సిటీ: పోడు భూముల సర్వే స్పీడప్ చేయాలని వరంగల్ కలెక్టర్ గోపి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 7,711 పోడు భూముల అప్లికేషన్ల వచ్చాయని, ఇప్పటివరకు 85శాతం సర్వే పూర్తి చేశామన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన ప్రక్రియను కూడా విజయవంతం చేయాలన్నారు. అడిషన్​కలెక్టర్ శ్రీవాత్సవ కోట, ఆర్డీవో మహేందర్ జీ, సంపత్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ టీడీ జహీరుద్దీన్ 
తదితరులున్నారు.

ప్రతి గింజనూ సర్కారే కొంటది: ఎమ్మెల్యే అరూరి రమేశ్

వర్ధన్నపేట, వెలుగు: రైతులు పండించిన ప్రతి గింజనూ సర్కారే కొంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బుధవారం వర్ధన్నపేట టౌన్​తోపాటు దమ్మన్నపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని సూచించారు. దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం వర్ధన్నపేటలో 42మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

లీకేజీలను అరికట్టండి

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: సిటీలో వాటర్ లీకేజీలను అరికట్టాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి ​ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం సిటీలోని పలు డివిజన్లలో మేయర్ పర్యటించారు. వాటర్ లీక్ డిటెక్షన్ మెషిన్ పనితీరు తెలుసుకున్నారు. దీనిద్వారా భూమిలోని లీకేజీలను పైనుంచే తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ మెషిన్ వాడకంపై మరింత లోతుగా చర్చిస్తామన్నారు. ఆఫీసర్లు నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 18వ డివిజన్​లోని స్లమ్​ ఏరియాల్లో ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’పై మేయర్ అవగాహన సదస్సు నిర్వహించారు.

సకల సౌకర్యాలతో భరోసా సెంటర్

హనుమకొండ, వెలుగు: హనుమకొండ సుబేదారిలో అద్దె భవనంలో కొనసాగుతున్న భరోసా కేంద్రం తొందర్లోనే సొంత బిల్డింగ్​లోకి మారనుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా భరోసా సెంటర్​నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సి​ ఇచ్చింది. దీంతో ఈ నెల 19న రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రంగంపేటలోని పోలీస్​ లైన్స్​లో కొత్త బిల్డింగ్​ ఏర్పాటు కోసం వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి, అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి బుధవారం స్థలాన్ని పరిశీలించారు. బిల్డింగ్​ కన్​ స్ట్రక్షన్​ కు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకల సౌకర్యాలతో శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. అనంతరం రంగంపేటలోని షీటీమ్​, అర్బన్​ మహిళా పోలీస్​ స్టేషన్లను సీపీ సందర్శించారు.  స్టేషన్ లోని వసతులు, సిబ్బంది నిర్వహించే విధులపై పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. వారి వెంట ఏసీపీ గిరి కుమార్, సీఐలు ఉస్మాన్, సువర్ణ, సంజీవ్, రమేశ్​, బాబులాల్  ఉన్నారు.

రోడ్లు అధ్వానం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఎటుచూసినా రోడ్లన్నీ గుంతలమయంగా కనిపిస్తున్నాయి. ఆఫీసర్లు రిపేర్లు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలకుర్తికి వెళ్లే రూట్​లో పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. శివునిపల్లిలో మసీదు ముందు, రైల్వేస్టేషన్​ సమీపంలో, జఫర్​గఢ్​ రోడ్డులోని అంబేడ్కర్​ చౌరస్తాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆరు నెలల కింద రిపేర్లు చేపట్టినా, నాసిరకం  పనులు చేయడంతో కొద్దిరోజులకే రోడ్లు కరాబ్ అయ్యాయి.