ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ ఆలయ ప్రాంగణంలో మాడవీధుల నిర్మాణానికి ఆదివారం లేజర్ సర్వే నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(ట్రాక్) ఆధ్వర్యంలో డ్రోన్, లాడార్ సర్వే చేసిన ఆఫీసర్లు.. తాజాగా లేజర్ సర్వే కూడా పూర్తి చేశారు. బెంగళూర్ నుంచి వచ్చిన టెక్నికల్ టీమ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సర్వే చేయగా.. ఆ సమయంలో అమ్మవారి దర్శనం నిలిపివేశారు. సర్వే పూర్తయిన అనంతరం భక్తులను అనుమతించగా మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భద్రకాళీ మాడవీధుల ఏర్పాటుకు  ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

కరెంట్ వైర్లతో చేపల వేట! షాక్ కొట్టి వ్యక్తి మృతి

మరిపెడ, వెలుగు: వాగులో కరెంట్ వైర్లు పెట్టి, చేపలు పడుతుండగా.. ప్రమాదవశాత్తు షాక్ కొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామంలో జరిగింది. ఎస్సై పవన్ కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని లచ్యా తండా పరిధిలోని సోమ్ల తండాకు చెందిన గుగులోత్ సూర్య(45) శనివారం రాత్రి తండ ధర్మారంలోని ఆకేరు వాగులో కరెంట్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కరెంట్ వైర్లను వాగులో వేస్తుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడి షాక్ కొట్టి చనిపోయాడు. వెంట వెళ్లినవారు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా..

ఎల్కతుర్తి, వెలుగు: రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెంచికలపేటకు చెందిన మామిడి రాజిరెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం హుజూరాబాద్ వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో పెంచికలపేట వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో హనుమకొండ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తున్న కారు ఆయనను వేగంగా ఢీకొట్టింది. ​ తీవ్ర గాయాలు కావడంతో రాజిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. 

బైక్ ను డీసీఎం ఢీకొని..

వెంకటాపురం, వెలుగు: ఆగి ఉన్న డీసీఎంను బైక్ ఢీకొట్టి యువకుడు మృతి చెందిన విషాద సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం మండపాకలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన వేముల భరత్ ల్యాబ్ టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు. ఆదివారం ఓ పని నిమిత్తం బైక్​పై వాజేడు మండలంలోని జగన్నాథపురానికి వెళ్లాడు. రాత్రి తిరిగి ఏటూరునాగారం వెళ్తుండగా.. మండపాక సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై ఆగి ఉన్న డీసీఎం వెహికల్​ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. అయితే యువకుడు హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడని స్థానికులు చెబుతున్నారు. హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇకనైనా హెల్మెట్ వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.

స్తూపంపై అంబేడ్కర్ విగ్రహం...  ఇరు పార్టీల మధ్య వివాదం

మహాదేవపూర్, వెలుగు: కొందరు దుండగులు చేసిన పనికి ఇరు పార్టీలు వాగ్వాదానికి దిగాయి. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం క్రాస్ వద్ద ఉమ్మడి ఏపీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారక చిహ్నం ఉంది. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిహ్నంపై చిన్నపాటి అంబేడ్కర్ విగ్రహం పెట్టారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు ఆదివారం స్తూపం వద్దకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలన్నారు. వెంటనే బీఆర్ఎస్ లీడర్లు అక్కడికి చేరుకుని, అంబేడ్కర్ విగ్రహం అక్కడే ఉండాలని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ లీడర్లు కాళేశ్వరంలో రాస్తారోకో చేయగా.. బీఆర్ఎస్ లీడర్లు అంబేడ్కర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మహదేవపూర్ సీఐ కిరణ్, ఎస్ఐలు రాజ్ కుమార్, అరుణ్ కుమార్ అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో అందరూ వెనక్కి తగ్గారు. అయితే స్తూపం మీద అంబేడ్కర్ విగ్రహం ఏంటని, రాజకీయ దురుద్దేశంతోనే పెట్టారని పలువురు ఆగ్రహించారు.

జీపీ బిల్డింగులకు ఫండ్స్ రిలీజ్

మరిపెడ, వెలుగు: మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌లపరిధిలోని 14 గ్రామాల్లో కొత్త జీపీ బిల్డింగుల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు బీఆర్ఎస్ స్టేట్ లీడర్ కొంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని గిరిపురంలో మీడియాతో మాట్లాడారు. ఒక్కో బిల్డింగ్ కు రూ.20లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఫండ్స్ రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్ కు, సహకరించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అండర్–15 క్రికెట్ జట్టులో తనుశ్రీ

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ సిటీకి చెందిన ఎన్. సాయి తనుశ్రీ క్రికెట్ లో సత్తా చాటుతోంది. బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తూ అండర్–15 మహిళల విభాగం లో హెచ్​సీఏకు ఎంపికైంది. ఈ నెల 26 నుంచి జరిగే జాతీయ మహిళల చాంపియన్ షిప్ పోటీల్లో హెచ్ సీఏ తరఫున బరిలోకి దిగనుంది. తనుశ్రీని వరంగల్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.