ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆఫీసర్లపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

నర్సింహులపేట, వెలుగు: ‘మన ఊరు–మన బడి’ పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేశారు.వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోక్యతండా ప్రైమరీ స్కూల్​ను బుధవారం కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ స్కూల్ అభివృద్ధికి ‘మన ఊరు–మన బడి’ కింద సర్కారు రూ.4.35లక్షల కేటాయించింది. స్కూల్ లో అదనపు గదులు, టాయిలెట్లు, హ్యాండ్ వాష్ నల్లాల పనులు జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తుండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇట్లాంటి పనులు చేయడానికి సిగ్గుండాలే..

స్కూల్​పనులను పర్యవేక్షించాల్సిన డీఈలు, ఏఈలు పట్టించుకోకపోవడంతో కలెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా కనీసం కామన్ సెన్స్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతిటి పనులైతే ఇలాగే చేసుకుంటారా? అని ప్రశ్నించారు. మొత్తానికి మొత్తం బిల్లు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఎడ్యుకేషన్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ సరిగ్గా నిర్వహించకపోవడం పట్ల స్కూల్ హెచ్ఎం శ్రీనివాస స్వామిపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. వెంటనే సస్పెండ్ చేయాలని డీఈవోను ఆదేశించారు.

పనులు వెంటనే పూర్తి చేయాలి..

జనగామ అర్బన్: జనగామ జిల్లాలో మన ఊరు–మన బడి పనుల్ని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో ఆయన రివ్యూ చేశారు. ఈ పథకానికి 508 స్కూళ్లు ఎంపిక కాగా ఫస్ట్ ఫేజ్ లో 176 బడుల్లో పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 67 స్కూళ్లలో పనులు పూర్తి కాగా.. 64 స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్నారు. పెండింగ్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఘనంగా వివేక్ బర్త్ డే వేడుకలు

మహాముత్తారం, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బర్త్​డే వేడుకల్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంథని డివిజన్ బీజేపీ నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మహాముత్తారం మండలం బోర్లగూడెంలో లీడర్లు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ బడిలో స్టూడెంట్లకు నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు పిలుమరి సంపత్, అధికార ప్రతినిధి ఠాకూర్ రవీందర్,  మండల ప్రధాన కార్యదర్శులు పసుల శివకుమార్, పూర్ణచందర్, బీజేవైఎం లీడర్లు ఠాగూర్ హర్ష, అజ్మీరా నవీన్ నాయక్, బండ శ్రీకాంత్ పటేల్, యువ మోర్చా లీడర్లు రాజేందర్, పవన్, వాయిరాల రమేశ్​ ఉన్నారు.

ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి చేప పిల్లలు: వదిలిన ఎమ్మెల్యే రాజయ్య

ఆఫీసర్ల తీరుపై ముదిరాజుల మండిపాటు

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్​లో బుధవారం ఎమ్మెల్యే రాజయ్య చేప పిల్లలు వదిలారు. ఈ సీజన్లో 12.52లక్షల పిల్లలు వదలాల్సి ఉండగా.. 4 లక్షలు  మాత్రమే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజులు ఆర్థికంగా ఎదిగేందుకే ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. కాగా, గతేడాది కేవలం రూ.లక్ష చేపలే పోసి.. రూ.2.30లక్షల చేప పిల్లలు పోసినట్టు ఆఫీసర్లు బిల్లులు చూపించారని ముదిరాజులు మండిపడ్డారు. తమకు తెల్వకుండా సంతకాలు తీసుకుని గోల్ మాల్ చేశారని స్థానిక ఎంపీపీ నిమ్మ కవిత, ఫిషరీస్ ఏడీ భారతిని నిలదీశారు. ఆగస్టులోనే చేప పిల్లలు వదలాల్సి ఉన్నా.. నవంబర్ నెలాఖరుకు ఈ ప్రోగ్రాంను పోస్ట్ పోన్ చేశారని ఫైర్ అయ్యారు. కాలం మారితే చేప పిల్లలు ఎదగవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో జవహర్ రెడ్డి, తహసీల్దార్ రజిని, స్థానిక సర్పంచ్ శరత్  ఉన్నారు.

షర్మిల పాదయాత్రపై ఉత్కంఠ

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి వరంగల్​లో వైయస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల నర్సంపేటలో జరిగిన పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి చేయగా.. అది ప్రగతిభవన్ ముట్టడి వరకు వెళ్లింది. శాంతిభద్రతల దృష్ట్యా ఇక్కడి పోలీసులు పాదయాత్రకు పర్మిషన్ రద్దు చేయగా..ఆ పార్టీ హైకోర్టుకు వెళ్లి, పర్మిషన్ తెచ్చుకుంది. ఇయ్యాల వైయస్ షర్మిల గవర్నర్​ను కలిసిన అనంతరం పాదయాత్ర ఎప్పుడు అనేది స్పష్టత రానుంది. మరోవైపు అన్ని సంఘాలు, పార్టీల లీడర్లు షర్మిలపై దాడిని ఖండిస్తున్నారు.

పాదయాత్రను అడ్డుకుంటాం: టీఆర్ఎస్

నెక్కొండ: వైయస్ షర్మిల పాదయాత్రలో సీఎం కేసీఆర్ ను, ఎమ్మెల్యేలను తిడితే మళ్లీ అడ్డుకుంటామని వరంగల్ జిల్లా నెక్కొండ మండల టీఆర్ఎస్ లీడర్లు స్పష్టం చేశారు. బుధవారం నెక్కొండలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేసీఆర్, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో నెక్కొండ ఎంపీపీ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరయ్య, పీఏసీఏస్ చైర్మన్ రాము తదితరులున్నారు.

వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి: మేయర్

వరంగల్ సిటీ: వైయస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు లేదని మేయర్ గుండు సుధారాణి విమర్శించారు. బుధవారం బల్దియా హెడాఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణను తాలిబన్ రాజ్యంతో పోల్చడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు. కాగా, బల్దియా హెడాఫీసులో మేయర్ రాజకీయాలు మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో రాజకీయాలేంటని పలువురు మండిపడ్డారు.

పాదయాత్ర ఆపేది లేదు: వైయస్ఆర్టీపీ 

ములుగు: టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, దాడులకు పాల్పడినా వైయస్ షర్మిల పాదయాత్ర ఆగదని వైయస్ఆర్టీపీ ములుగు జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ములుగులో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు బయటపెట్టినందుకే గులాబీ లీడర్లు గూండాల్లా మారి దాడులు చేస్తున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ దమనకాండను  తిప్పికొడతామన్నారు. 

కేటీఆర్ డైరక్షన్​లోనే దాడి..

నర్సంపేట: మంత్రి కేటీఆర్ డైరక్షన్ లోనే వైఎస్ షర్మిలపై దాడి జరిగిందని టీజేఎస్ స్టేట్ సెక్రటరీ అంబటి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దాడులు తగదని పేర్కొన్నారు. బుధవారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలను ఎత్తిచూపితే పెట్రోల్ తో దాడులకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులను ఆశ్రయించాలి కానీ రౌడీల్లా దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

కేంద్ర పథకాలను వివరించాలి

పరకాల, వెలుగు: కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి, వారు లబ్ధిపొందేలా చూడాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం పరకాలలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ..  స్థానిక ఎమ్మెల్యే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మీటింగ్​లో పరకాల నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్ పెసరు విజయచందర్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జి డాక్టర్ మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జయపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ రావు తదితరులున్నారు.

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

బచ్చన్నపేట: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జనగామ జిల్లా  అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం బచ్చన్నపేటలో పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‍ సీపీగా ఏవీ రంగనాథ్‍

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ కొత్త కమిషనర్‍గా సీనియర్‍ ఐపీఎస్‍ ఆఫీసర్‍ ఏవీ రంగనాథ్‍ను (డీఐజీ) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్‍ ప్రస్తుతం హైదరాబాద్‍ ట్రాఫిక్‍ జాయింట్‍ కమిషనర్‍గా బాధ్యతల్లో ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్‍ మర్డర్‍ కేసును.. అప్పట్లో నల్లగొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్‍ సకాలంలో దర్యాప్తు చేసి, గుర్తింపు పొందారు. రంగనాథ్‍ 2002లో జిల్లాలోని నర్సంపేట డీఎస్పీగా  పనిచేశారు. కాగా, ఇప్పటివరకు వరంగల్‍ సీపీగా పనిచేసిన డాక్టర్‍ తరుణ్‍జోషిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‍ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయన 2021 ఏప్రిల్‍ 7 నుంచి వరంగల్ సీపీగా పని చేశారు.

ధరణితో అష్టకష్టాలు

వెంటనే రద్దు చేయాలె: కాంగ్రెస్

ధరణి పోర్టల్ తో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు ర్యాలీలు నిర్వహించారు. పేదల భూములు కొల్లగొట్టేందుకే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నియంత విధానాలతో భూసమస్యలు పరిష్కారం కాక, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ధరణిని రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.– వెలుగు నెట్ వర్క్

సీకేఎం ఇంత అధ్వానమా?

సూపరింటెండెంట్ పై కలెక్టర్ ఆగ్రహం

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలోని ప్రసూతి వార్డును కలెక్టర్ గోపి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు అధ్వానంగా ఉండడంతో హాస్పిటల్ ఇన్ చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మపై మండిపడ్డారు. శానిటేషన్ ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేషెంట్లతో పాటు పేషెంట్ల బంధువులకు కూడా రోగాలు అంటిస్తారా? అంటూ మండిపడ్డారు. బ్లడ్ బ్యాంక్​కు తాళం వేయడంపై  అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆసుపత్రిని నీట్ గా ఉంచాలని డాక్టర్ పద్మను ఆదేశించారు.